పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయ భవనం
జిల్లా పోలీసు కార్యాలయాల కోసం లీజుకు ప్రైవేట్ భవనం
ఎస్పీ కార్యాలయ భవనంలో ప్రారంభం కాని పనులు
నరసరావుపేట, మార్చి26: పల్నాడు జిల్లా కలెక్టరేట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ రూం సిద్ధమైంది. జిల్లా పోలీసు కార్యాలయాల కోసం ఇక్కుర్రు రోడ్డులోని గతంలో ప్రైవేట్ స్కూల్ నిర్వహించిన భవనాన్ని లీజుకు తీసుకున్నట్టు పోలీసువర్గాలు తెలిపాయి. ఎస్పీ కార్యాలయం కోసం ప్రభుత్వ చిన్నపిల్లల వైద్యశాల కోసం నిర్మించిన భవనాన్ని కేటాయించారు. అయితే ఈ భవనంలో ఎస్పీ కార్యాలయానికి సంబంధించిన పనులు ఇంకా చేపట్టలేదు. చిన్నపిల్లల ఆసత్రి భవనాలను వైద్య ఆరోగ్యశాఖ ఇంకా కాంట్రాక్టర్ నుంచి తీసుకోలేదు. కాంట్రాక్టర్ భవనం అప్పగించకుండా నూతన భవనంలో ఎస్పీ కార్యాలయ పనులు చేపట్టడానికి వీలు లేకుండాపోయింది. కాంట్రాక్టర్ ఈ భవనాన్ని వైద్యశాఖకు అప్పగించేందుకు పనులను పూర్తి చేస్తున్నాడు. అప్పటివరకు భవనంలో కార్యాలయానికి అనుకులంగా మార్పులు చేసుకోవడానికి వీలు లేదు. ఈ ప్రక్రియ పూర్తి కోసం పోలీసు శాఖ ఎదురు చూస్తోంది. మరోవైపు కలెక్టరేట్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. భవనానికి రంగులు వేసే పనులు దాదాపు పూర్తయ్యాయి. దీనిలోని జలవనరుల శాఖ కార్యాలయాలను పూర్తిగా ఖాళీ చేయించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు అవసరమైన హాల్స్‌ను సిధ్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పవర్ రూం పనులు పూర్తయ్యాయి. సోమవారం వీడియో కాన్ఫరేన్స్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. మత్యశాఖ కార్యాలయం కోసం ఆ శాఖ ఏడీ వెంకటేశ్వరరావు లింగంగుంట్లలోని పాత రైతు భరోసా కేంద్రం భవనాన్ని పరిశీలించారు. తమ శాఖకు ఈ భవనం కేటాయించాలని కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపనున్నారు. కార్యక్రమంలో ఏడీవో ప్రసాదు, పంచాయతీ కార్యదర్శి కేవీ ప్రసాద్ పాల్గొన్నారు.
బాపట్లలో.. వేగవంతం
గుంటూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పాటు కాబోతున్న బాపట్ల జిల్లాలో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాల గుర్తింపు చకచకా జరిగిపోతోంది. దాదాపుగా 80 శాతం పైగా ప్రభుత్వ శాఖలకు భవనాలు గుర్తించారు. వాటన్నింటి వివరాలతో నివేదికని స్థానిక తహసీల్దార్ గోపాలకృష్ణ జిల్లా యంత్రాంగానికి నివేదించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలతో పాటు బాపట్ల జూనియర్ కళాశాలని కూడా వినియోగించుకోవడానికి వీలుగా ఉందని పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉచితంగా కేటాయించేందుకు హామీ ఇచ్చిందని తెలిపారు. కాగా కొన్ని శాఖల అధికారులు వారంతటికి వారే ఆఫీసులకు భవనాలను గుర్తించుకొన్నారు. పోతన బిల్డింగ్‌లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా లేదని చెప్పారు. దీని దృష్ట్యా గతంలో పోతన భవనంలో ప్రతిపాదించిన ఆఫీసులకు వేరే చోట బిల్డింగ్లు గుర్తించామన్నారు. బాపట్ల జిల్లా ఏర్పాటుకు సంబంధించి మొత్తం 34 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటు కోసం 18 ప్రాంతాల్లో 60 భవనాలను గుర్తించారు. ఇంకా తొమ్మిది శాఖలకు ఆఫీసులు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఆయా శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించి సాధ్యమైనంత త్వరగా మిగతా ఆఫీసులకు కూడా భవనాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీహెచ్ఆర్డీఐలో కలెక్టర్ ఆఫీసు, విపత్తుల నిర్వహణ శాఖ జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ఆర్డీవో ఆఫీసు, ఎన్ఐసీ, ఏపీస్వాన్, డీఎస్వో, డీఎం సివిల్ సప్లయిస్, డీడీ ఐ అండ్ పీఆర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, సర్వే ఏడీ, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, జిల్లా అఽగ్నిమాపక అధికారి, మత్స్య శాఖ జేడీ, డీడీ, ఏడీ, ఏపీ టిడ్కో ఈఈ, హౌసింగ్ పీడీ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ఖజానా, సహకార, ఆడిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఈటీసీ క్వార్టర్స్‌ని కూడా వినియోగించుకోబోతున్నారు.