పలాస దర్శకుడి తదుపరి చిత్రం ‘బ్రాకెట్’ ?

Sep 23 2021 @ 13:00PM

‘పలాస’ సినిమా  టాలీవుడ్ లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో  విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. దీని తర్వాత కరుణ దర్శకత్వంలో రూపొందిన సుధీర్ బాబు చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ నిరాశ పరిచినప్పటికీ..  గీతా ఆర్ట్స్ వారు కరుణ కుమార్ ను పిలిచి మరీ ఓ ఆఫర్ ఇచ్చారు. మలయాళంలో సూపర్ హిట్టైన ‘నాయాట్టు’ సినిమా రీమేక్ రైట్స్ ను గీతా ఆర్ట్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే ఇప్పుడు కరుణ కుమార్ దర్శకత్వంలో సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ కి కరుణ ‘బ్రాకెట్’ అనే టైటిల్ ను ఖాయం చేస్తున్నట్టు  టాక్ వినిపిస్తోంది. పూర్వం బ్రాకెట్ అనే ఒక ఆట ఉండేది. జూదం తరహాలో ఉండే ఈ ఆటను ఎప్పుడో బ్యాన్ చేశారు. ‘నాయాట్టు’ సినిమా కథాంశం కూడా బ్రాకెట్ ఆట తరహాలో సాగుతుందని ఆ టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఓటు బ్యాంక్ రాజకీయాలవల్ల ముగ్గురు పోలీసు ఉద్యోగస్థుల్ని .. పోలీస్ వ్యవస్థే వేటాడే పరిస్థితులు తలెత్తుతాయి. ఆ క్రమంలో ఆ ఉద్యోగస్థులు పడే ఆందోళన, ఆవేదన ఈ సినిమాకి ప్రధానాంశం. మలయాళంలో కుంచాకో బోబన్ , జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నాయాట్టు’ సినిమా తెలుగు వెర్షన్ లో ఆ పాత్రల్ని ఎవరు పోషిస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అతి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. మరి నిజంగానే ఈ సినిమాకి ‘బ్రాకెట్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.