Advertisement

పల్లా గెలుపు చరిత్రలో నిలవాలి : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

Mar 5 2021 @ 23:53PM
ప్రసంగిస్తున్నమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

విపక్షాలకు ఓటడిగే హక్కే లేదు
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 
ఖమ్మంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
హాజరైన ఎంపీ నామ, మాజీ ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యేలు
ఖమ్మం, మార్చి 5 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి విజయం చరిత్రలో నిలవాలని, పట్టభద్రుల నియోజకవర్గంలోనే ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక మెజారిటీ కట్టబెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడఅజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం మమతా మెడికల్‌ కళాశాల ఆవరణలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అన్నివర్గాల పట్టభద్రులు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని, పల్లాను గెలిపించి బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు కానుక ఇద్దామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీలు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను రెచ్చగొడుతున్నాయని, ప్రభుత్వంతో, టీఆర్‌ఎస్‌తో, కేసీఆర్‌తో వారికున్న బంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసి నడిచిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడిన కష్టాలను, చేసిన పోరాటాన్ని మరువలేమన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీకి ధారాదత్తం చేస్తుంటే చూస్తూ కూర్చున్న బీజేపీ నేతల మాటలు ఎవరూ నమ్మరని, బయ్యారం ఉక్కుపరిశ్రమ, ఐటీఆర్‌, రైల్వేకోచ్‌ పరిశ్రమ, ఏ ఒక్కటి ఇవ్వని బీజేపీకి అసలు ఓటుఅడిగే హక్కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేదేమీ లేకపోగా.. జీఎస్టీరూపంలో నిధులను లాక్కుంటోందని మండిపడ్డారు. విభజనచట్టంలో ఇచ్చిన హామీలు కేంద్రం విస్మరించిందని, ఈ విషయమై తమపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభ సమావేశాల్లో కేంద్రంపై పోరాడేందుకు తమతో కలిసి రావాలని సవాల్‌విసిరారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక.. కొందరు తాము ప్రశ్నించే గొంతుకలమంటూ జనంలోకి వస్తున్నారని వారికి ఓటు ద్వారా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమది సంక్షేమ ప్రభుత్వమని, రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలతో ఆరున్నరేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచిన ఘనత కేసీఆర్‌, కేటీఆర్‌లదన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ తాను సమస్యలు పరిష్కరించే గొంతుకనని, రాష్ట్రం కోసం పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని ఉద్ఘాటించారు. కానీ ప్రశ్నించే గొంతుకలమంటూ వస్తున్న వారితో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం గుర్తించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక లక్షా34వేల ఉద్యోగాలు కల్పించామన్న ఆయన ఆయా శాఖల వారీగా ఆ ఉద్యోగాల కల్పన వివరాలను వివరించారు. సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములనాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ 400కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటు పరం చేస్తూ రిజర్వేషన్ల వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని. రాష్ట్రప్రభుత్వం మాత్రం సింగరేణి, ఆర్టీసీని కాపాడుకుంటోందన్నారు. ఈసభలో ఇరుజిల్లాల జడ్పీచైర్మన్లు కమల్‌రాజ్‌, కోరం కనకయ్య, వైరా, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు, ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ‘సుడా’ చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఇరుజిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు ఖమర్‌, దిండిగల రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, పార్టీ జిల్లా కార్యాలయ ఇన్‌చార్జ్‌ గుండాల కృష్ణ పాల్గొన్నారు. 

 
మంత్రి పువ్వాడ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న బేగ్

మళ్లీ టీఆర్‌ఎస్‌ గూటికి బుడాన్‌బేగ్‌
రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పక్షాన నిలిచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా పార్టీ  బలోపేతానికి కృషి చేసి, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్‌గా పనిచేసి, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ను వీడిన టీఆర్‌ఎస్‌ ఖమ్మంజిల్లా మాజీ అధ్యక్షుడు, మైనారిటీ నేత షేక్‌ బుడాన్‌బేగ్‌ తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. శుక్రవారం రాత్రి ఖమ్మం మమత కళాశాల ప్రాంగణంలో జరిగిన పట్టభద్రుల సమ్మేళన సభలో ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన బేగ్‌ పార్టీకి, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరి అప్పటి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నామ గెలుపునకు పనిచేశారు. ఆ తర్వాతి పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్న బేగ్‌.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార వేదికపై మంత్రి పువ్వాడ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. అలాగే పలు విపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి పువ్వాడ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

Follow Us on:
Advertisement