పరిష్కరించే గొంతును ఎన్నుకోవాలి..

ABN , First Publish Date - 2021-03-01T03:56:01+05:30 IST

పరిష్కరించే గొంతును ఎన్నుకోవాలి..

పరిష్కరించే గొంతును ఎన్నుకోవాలి..
మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పక్కన పల్లా రాజేశ్వర్‌రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును పట్టభద్రులు విశ్లేషించుకోవాలి..

రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేసీందేమీ లేదు..

బీజేపీ ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు


పోచమ్మమైదాన్‌, ఫిబ్రవరి 28: వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే వారిని కాకుండా సమస్యను పరిష్కరించే వారినే ఎన్నుకోవాలని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. వరంగల్‌ దేశాయిపేటలోని సీకేఎం కళాశాల మైదానంలో ఆదివారం వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. పట్టభద్రులు మంచి చెడులను విశ్లేషించుకొని ప్రశ్నించే వారికి కాకుండా సమస్యను పరిష్కరించే వారికి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేస్తున్నది, కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న విధానాలను పట్టభద్రులు అర్థం చేసుకోవాలని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎందుకు లేవని, బీజేపీ ప్రభుత్వం రెండుకోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని, ప్రతీ ఖాతాలో రూ.15లక్షలు ఎందుకు వేయలేదని, పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. ఇటీవల 150 మెడికల్‌ కాలేజీలు మంజూరైతే బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఒక్కటి కూడా తెచ్చుకోలేకపోయారని అన్నారు. కరోనా సమయంలో, వరదల సమయంలో బీజేపీ నేతలు ఎవరూ కనిపించలేదని ఆరోపించారు. పన్నులరూపంలో రూ.2లక్షల72 వేల కోట్లు కడితే తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.లక్ష50వేల కోట్లు మాత్రమేనని అన్నారు. భద్రకాళి దగ్గర చర్చకు రమ్మన్న బీజేపీ నాయకులను మీ కేంద్ర మంత్రితో కలెక్టర్‌ దగ్గరకు చర్చకు రమ్మంటే ఒక్కరు కూడా రాలేదని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. వాళ్ళ నియోజకవర్గాలలో మెడికల్‌ కాలేజీ, పసుపు బోర్డు తెచ్చుకోలేని బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై భారం పడకుండా రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నామని, వచ్చే ఉగాది నుంచి వరంగల్‌ మహానగరంలో ప్రతీ రోజు మంచినీరు ఇస్తామని అన్నారు. సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

బి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. నిన్నటి దాక కరెంటు కొ న్న తెలంగాణ నేడు ఇతర రాష్ట్రాలకు కరెంటు అమ్మే స్థాయికి ఎదిగిందని, సమర్థవంతమైన కేసీఆర్‌ నాయకత్వంలో మాత్ర మే ఇది సాధ్యమైందని అన్నారు. మరో రెండేళ్లు కరువు వచ్చి నా ఇబ్బంది లేనంతగా తెలంగాణ భూగర్భంలో నీరు ఉందని, 40 వేల చెరువులను మిషన్‌ కాకతీయ కింద బాగు చేసుకున్నామని అన్నారు. అన్ని రంగాలలో తెలంగాణ ముందుందని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారని అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి మరోసారి టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, టీ ఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు, మేయర్‌ గుండా ప్రకాశ్‌ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, టీఆర్‌ఎస్‌ నాయకులు గుండు సుధారాణి, డాక్టర్‌ హరి రమాదేవి  పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T03:56:01+05:30 IST