Advertisement

ఏటీఎం కార్డుపై కన్నేశాడంటే.. ఖాతా ఖాళీయే!

Apr 23 2021 @ 04:25AM

ఐదు జిల్లాల్లో 44 నేరాలు


ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 22: చదివింది బీకాం కంప్యూటర్స్‌. కంప్యూటర్‌ అప్లికేషన్‌లో అపార పరిజ్ఞానాన్ని సంపాదించాడు. వృత్తి.. పాత కార్లు కొనడం, అమ్మడం. ప్రవృత్తి.. ఏటీఎం సెంటర్ల వద్దకు వచ్చే వారిని బురిడీ కొట్టించి ఖాతాలు ఖాళీ చేయడం. ఈ నైపుణ్యంతో లక్షల్లో దోచుకుని బంగారాన్ని కొనుగోలు చేశాడు. ఆన్‌లైన్‌లో అనేక వస్తువులను షాపింగ్‌ చేసేశాడు. ఇలా ఐదు జిల్లాల్లో మోసాలకు పాల్పడ్డాడు. పోలీసు రికార్డుల్లో 44 ఫిర్యాదులు మాత్రమే ఉన్నాయి. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.ఈ వివరాలను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె.నారాయణనాయక్‌ గురువారం ఏలూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరానికి చెందిన పళ్ల సురేంద్రకుమార్‌(28) బీకాం కంప్యూటర్స్‌ చేశాడు. ఏటీఎం సెంటర్లకు వెళ్లి, తన కార్డు పనిచేయడం లేదంటూ అక్కడే నిలబడి ఇతరుల ఏటీఎం కార్డులపై కన్నేస్తాడు. వారి పిన్‌ నెంబర్‌ను గుర్తు పెట్టుకుంటాడు.


ఆ కార్డు తీసే సమయంలో తన చేతిలోని కార్డును కింద పడేసి.. మీ కార్డు పడిపోయిందంటూ.. ఏటీఎం మిషన్‌లోని కార్డును అతను తీసుకుంటాడు. ఆ తరువాత ఆ కార్డుతో నగదు డ్రా చేస్తూ ఉంటాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా మాయ మాటలు చెప్పి ఏటీఎం కార్డులను తస్కరిస్తూ ఉంటాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏటీఎం కార్డుల కేసులు 17 నమోదు కావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం రాజమండ్రి తాడితోటలో తాత్కాలిక నివాసం ఉంటున్న సురేంద్రకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.  రూ.18.53 లక్షల నగదు, రూ.23 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.