Advertisement

పల్లె భారతి ప్రియ బాంధవుడు

Oct 13 2020 @ 00:15AM

2014తో పోలిస్తే 2019లో గ్రామీణప్రాంతాల్లో అత్యధిక శాతం ప్రజలు బిజెపికి అనుకూలంగా స్పందించారని ఒక అధ్యయనంలో వెల్లడయింది. ఇందుకు ప్రధాన కారణం పల్లెప్రాంతాల్లో కాంగ్రెస్, తదితర పార్టీల బలం కృశించిపోవడమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలు ఇప్పుడు గ్రామీణ భారత ఆర్థిక, సామాజిక జీవనాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్నాయి. కొత్త వ్యవసాయచట్టాలు, స్వమిత్వ వంటి పథకాలే ఇందుకు నిదర్శనాలు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉత్తరాఖండ్ గ్రామీణ వాసి అయిన సురేశ్‌చంద్ర అనే వ్యక్తితో మాట్లాడారు. వాళ్ల గ్రామాల్లో ఆస్తికార్డులు సులభంగా లభిస్తున్నాయా? కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వమిత్వ పథకం’ పారదర్శకంగా అమలవుతోందా? అని అడిగారు. ఒక దేశ ప్రధాని తనతో నేరుగా మాట్లాడడంతో సురేశ్‌చంద్ర తబ్బిబ్బయ్యారు. తన గ్రామంలో ఆస్తులను గుర్తించడం ఎంతో పారదర్శకంగా జరిగిందని, ఆస్తికార్డుల ద్వారా సులభంగా రుణాలు పొందగలుగుతున్నామని ఆయన చెప్పారు. ఆ డబ్బుతో తాము తమ ఇళ్లను మరమ్మత్తు చేసుకుంటున్నామని, ఏవైనా చిన్నచిన్న వ్యాపారాలు చేయాలని కూడా అనుకుంటున్నామని ఆ రైతు చెప్పారు. 


సురేశ్‌చంద్రతో మాత్రమే కాదు, ప్రధానమంత్రి ఆరు రాష్ట్రాల్లోని పలువురు రైతులతో నేరుగా మాట్లాడి తాను ప్రారంభించిన కొత్త పథకం అమలు గురించి తెలుసుకున్నారు. గ్రామాలను సర్వే చేసి అధునాతన టెక్నాలజీ ద్వారా మ్యాపింగ్ చేయడం కోసం ఆయన ప్రారంభించిన ‘స్వమిత్వ’ గ్రామీణ వ్యవస్థ రూపురేఖలు మార్చే మరో విప్లవాత్మక కార్యక్రమం. మొబైల్ ఫోన్లలో ఎస్‌ఎంఎస్ లింకును తెరవడం ద్వారా ప్రజలు తమ ఆస్తికార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేకమైన నంబరుతో ఉండే ఈ కార్డుల ద్వారా తమ ఆస్తులను ఒక ఆర్థిక సంపదగా గ్రామీణ ప్రజలు మార్చుకునే అవకాశం లభిస్తుంది. ఇది క్రమంగా పట్టణాల్లో కూడా అమలవుతుంది. ఈ కార్డులో ఆస్తి యాజమాన్య రికార్డులు దాని గత యాజమాన్య వివరాలతో సహా లభిస్తాయి. అంతేకాదు, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి తీసుకున్న రుణాల వివరాలు, ఆ ఆస్తిపై పెండింగ్‌లో ఉన్న కేసులు, చెల్లించిన పన్ను వివరాలు కూడా అందులో ఉంటాయి.


ముఖ్యంగా రైతులు, గ్రామీణ యువత రుణాలు తీసుకుని అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు, చిన్నచిన్న వ్యాపారాలను ప్రారంభించేందుకు ఈ ఆస్తికార్డు దోహదం చేస్తుంది. దేశంలో కోట్లాది గ్రామీణ యజమానులకు ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రయోజనం చేకూర్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్రలో ఏనాడూ జరగలేదు. ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ వినూత్న పథకం అమలు తొలి దశలో ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాల్లో లక్షమందికి తొలుత ఆస్తికార్డులు లభిస్తాయి. తర్వాత దేశంలో అందరికీ ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది. గత ఏప్రిల్‌లో ఈ పథకానికి రూపకల్పన జరిగింది. అనంతరం ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రాల్లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా సర్వే విజయవంతంగా పూర్తయింది. ఆ తర్వాత పంచాయతీరాజ్, రెవిన్యూ అధికారులు భౌతికంగా ఆ గ్రామాలను సర్వే చేశారు. ఆ తర్వాతే ఆస్తికార్డులను రూపొందించారు. వచ్చే నాలుగేళ్లలో కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశంలోని 6.6 లక్షల గ్రామాల్లో దశలవారీగా స్వమిత్వ పథకాన్ని అమలు చేస్తుంది. 


దేశంలో 60 శాతం మంది ఇప్పటికీ గ్రామీణప్రాంతాలలో నివసిస్తున్నప్పటికీ లక్షలాది కుటుంబాల వద్ద తమ ఆస్తులకు సంబంధించి సరైన పత్రాలు లేవు. గ్రామాల్లో ఒక్కసారి ఆస్తుల యాజమాన్యాన్ని నిర్ధారించి, ఆస్తికార్డులను పంపిణీ చేశాక వాటి ధరల నిర్ణయం కూడా జరుగుతుంది. గ్రామ పంచాయతీలు కేవలం 19 శాతం మాత్రమే ఆస్తిపన్ను వసూలు చేస్తున్నాయి. ఆస్తుల నిర్ధారణ తర్వాత నూటికి నూరు శాతం ఆస్తి పన్ను వసూల వుతుంది. అప్పుడు గ్రామాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు నిధులు లభిస్తాయి. మొత్తానికి స్వమిత్వ పథకం గ్రామీణ భారతానికి ఆర్థిక సుస్థిరత లభించేందుకు, గ్రామీణ సాధికారికతకు ఉపయోగపడుతుంది. 


గ్రామాలను స్వయంసమృద్ధి దిశగా నడిపించేందుకు ప్రధానమంత్రి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అనేకసార్లు ఆయన రైతులతో నేరుగా మాట్లాడి తన అభిప్రాయాలను పంచుకున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తన లక్ష్యంగా ప్రకటించారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి నిధులు రెట్టింపు చేశారు. ఉపకరణాల వ్యయం తగ్గించడం, పంటకు తగిన ధర లభించేలా చూడడం, రైతులు కష్టపడి ఉత్పత్తి చేసిన పంట కుళ్లిపోకుండా సకాలంలో తగిన మార్కెట్ లభించేలా చర్యలు తీసుకోవడం, రైతుకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను సమకూర్చడం ప్రభుత్వ విధానమని ఆయన అనేక సార్లు ప్రకటించారు. తాను అనుకున్నవి అనుకున్నట్లుగా అమలు చేయడం ప్రధాని మోదీ స్వభావం. అందుకే ఆయన అత్యంత కీలకమైన వ్యవసాయ చట్టాలను చేయడమే కాదు, స్వమిత్వ లాంటి పథకాలనూ ప్రారంభించారు. 


నిజానికి ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన వ్యవసాయ చట్టాలు అన్నదాతలను అవస్థలపాలు చేస్తాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు దేశంలో ఎక్కడా రైతుల్లో అంతగా ప్రతిస్పందన లభించడం లేదు. సరికదా, కొత్త చట్టాలతో తమకు లభిస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రైతుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. అంతేకాదు, కొత్త చట్టాల గురించి ప్రతిపక్షాలు సృష్టించిన అపోహలు తొలగించడం కోసం స్వయంగా రైతులను పిలిచి చర్చించడానికి మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా 8మంది కేంద్రమంత్రులు స్వయంగా గ్రామాలకు వెళ్లి రైతులకు వ్యవసాయ చట్టాల గురించి వివరించడం ప్రారంభించారు. భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు, నేతలతో విస్తృతంగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. 


నిజానికి కనీస మద్దతు ధర వ్యవస్థను ధ్వంసం చేయకుండానే మార్కెట్ల ద్వారా రైతులకు కొత్త అవకాశాలు లభించాలన్న ఆలోచనతోనే మోదీ సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందన్న విషయాన్ని రైతులు గమనించడం ప్రారంభించారు. దేశంలో పంటల దిగుబడులు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ, ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతున్నప్పటికీ వాటికి సరైన మార్కెట్ లభించడం లేదన్న విషయం ప్రతి ఒక్కరి అనుభవంలోకి వచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయోత్పత్తులకు పెద్ద ఎత్తున మార్కెట్ లభించడమే కాక, వాటి ఉత్పాదకత, నాణ్యత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపెనీలే కాక, రైతుల ఉత్పత్తి సంస్థలు (ఎఫ్ పిఓ)లు దేశవ్యాప్తంగా అవిచ్ఛిన్నంగా, నిరంతర సరఫరాలు జరిగేందుకు దోహదం చేస్తాయి. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి, రైతులు మధ్యదళారుల నుంచి విముక్తి పొందేందుకు తోడ్పడతాయి.ఆదివారం నాడు స్వమిత్వ పేరుతో ఆస్తి కార్డులను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇదే విషయం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్క దాన్నీ వ్యతిరేకించాలన్న భావనతో ప్రతిపక్షాలు అసభ్యకరమైన భాషను ఉపయోగించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవసాయ రంగాన్నే సమూలంగా మార్చి రైతుల జీవితాలను మార్చే సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటున్న ప్రధానమంత్రిని రాహుల్‌గాంధీ పిరికిపందగా అభివర్ణించడంలో ఔచిత్యం ఏమైనా ఉందా? ఈ దేశాన్ని లూటీ చేసిన వారెవరో ప్రజలు గుర్తించడం ప్రారంభించారు. 


నిజానికి పట్టణాల్లో కంటే గ్రామీణప్రాంతాల్లో ప్రజలు దేశంలో జరిగే పరిపాలనా తీరు తెన్నులను నిశితంగా గమనిస్తుంటారు. పట్టణవాసుల కంటే ఎక్కువ శాతం ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని కొన్నేళ్లుగా రికార్డవుతున్న ఎన్నికల సరళిని బట్టి అర్థమవుతోంది. 2014తో పోలిస్తే 2019లో గ్రామీణప్రాంతాల్లో అత్యధిక శాతం ప్రజలు బిజెపికి అనుకూలంగా స్పందించారని లోక్‌నీతి, -సిఎస్‌డిఎస్ అధ్యయనంలో వెల్లడయింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పల్లె ప్రాంతాల్లో సాంప్రదాయికంగా ఓటుబ్యాంకును సమకూర్చుకున్న కాంగ్రెస్, తదితర పార్టీల బలం కృశించిపోవడమే. మోదీ విధానాలు గ్రామీణ భారత ఆర్థిక, సామాజిక జీవనాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్నాయి. తమ కాళ్ల కింద నేల జారిపోతోందని ప్రతిపక్షాలు గ్రహించాయి. మోదీ సర్కార్ గ్రామాల్లో సమగ్ర సంస్కరణలు, వ్యవస్థీకృత మార్పులు చేపట్టడంతో విపక్షాలు బెంబేలెత్తిపోయి రకరకాల దుష్ప్రచారాలకు పూనుకుంటున్నాయి. మోదీ విధానాలు అమలు కాకుండా ఆపడం ప్రతిపక్షాలకు ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. స్వీయ పతనాన్ని కూడా అవి నివారించుకోలేవు. వ్యవసాయ చట్టాలు, స్వమిత్వ వంటి పథకాలు పల్లె ప్రజల హృదయాల్లో మోదీకి శాశ్వత స్థానం సంపాదించిపెడతాయనడంలో సందేహం లేదు.

 

వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.