పల్లెల్లో నారీ భేరీ

ABN , First Publish Date - 2021-02-28T06:33:51+05:30 IST

కశింకోట మేజరు పంచాయతీ సర్పంచ్‌ పదవి ఎస్సీ జనరల్‌లో ఉంది. మంత్రి జయరజని పోటీ చేసి విజయం సాధించారు.

పల్లెల్లో నారీ భేరీ

జనరల్‌ స్థానాల్లోనూ సత్తా చాటిన మహిళలు

50 శాతం రిజర్వేషన్‌తో జిల్లాలో 487 సర్పంచ్‌ పదవులు కేటాయింపు

528 పంచాయతీల్లో విజయ బావుటా

కోటాకంటే అధికంగా 41 పంచాయతీల్లో గెలుపు

55 శాతం పంచాయతీల్లో నారీమణులదే పెత్తనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కశింకోట మేజరు పంచాయతీ సర్పంచ్‌ పదవి ఎస్సీ జనరల్‌లో ఉంది. మంత్రి జయరజని పోటీ చేసి విజయం సాధించారు.

చింతపల్లి మేజరు పంచాయతీ సర్పంచ్‌ పదవి ఎస్టీ జనరల్‌లో ఉంది. ఉపాధ్యాయ వృత్తిలో వున్న దురియా పుష్పలత పోటీచేసి గెలుపొందారు. ఇక్కడ మొత్తం తొమ్మిది మండి పోటీ చేయగా...పుష్పలత మినహా మిగిలిన వారంతా పురుషులే!

...జిల్లాలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో నారీమణులు సత్తా చాటారు. 50 శాతం రిజర్వేషన్‌ మేరకు 487 సర్పంచ్‌ పదవులను మహిళలకు కేటాయించగా....  528 పంచాయతీల్లో సర్పంచులుగా ఎన్నికయ్యారు. పలుచోట్ల జనరల్‌ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసి విజయం సాధించారు. రిజర్వు చేసిన వాటికన్నా ఐదు శాతం అదనంగా...41 పంచాయతీల్లో సర్పంచు లుగా ఎన్నికయ్యారు. పాయకరావుపేట మండ లంలో ఐదుగురు, కె.కోటపాడు మండలంలో నలు గురు, చీడికాడలో ముగ్గురు... ఇలా పలు మండ లాల్లో జనరల్‌ స్థానాల్లో మహిళలు పోటీ చేసి సర్పంచ్‌ పీఠాలను అధిష్ఠించారు.

జిల్లాలో 969 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 50 శాతం రిజర్వేషన్‌ మేరకు వీటిల్లో 487 పంచాయతీల సర్పంచ్‌ పదవులను మహిళలకు కేటాయించారు. వీటిల్లో ఎస్సీ మహిళలకు 39, ఎస్టీ మహిళలకు 141, బీసీ మహిళలకు 138, అన్‌రిజర్వుడ్‌లో మహిళలకు 179 కేటాయించారు. జిల్లాలో 969 గ్రామ పంచాయతీలకుగాను కోర్టు కేసుల కారణంగా ఏడు పంచాయతీల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. ఒక పంచాయతీలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 961 పంచాయతీల్లో నాలుగు విడతలుగా పోలింగ్‌ జరిగింది. వీటిల్లో 528 (55 శాతం) పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు మహిళలు ఎన్నిక కావడం విశేషం. ఆయా కేటగిరీల్లో జనరల్‌ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేసి, తమకు కేటాయించిన వాటికన్నా అదనంగా 41 పంచాయతీల్లో విజయం సాధించారు. పురుషులకు 433 సర్పంచ్‌ పదవులు మాత్రమే దక్కాయి. పాయకరావుపేట, కె.కోటపాడు, చీడికాడ తదితర మండలాల్లో పలు జనరల్‌ స్థానాల్లో మహిళలు గెలుపొందారు. కె.కోటపాడు మండలంలో 32 సర్పంచ్‌ పదవుల్లో 16 మహిళలకు రిజర్వు చేయగా, మరో నాలుగు కలిపి...20 పంచాయతీలకు కైవసం చేసుకున్నారు. పాయకరావుపేట మండలంలో 24 పంచాయతీ లకుగాను మహిళలకు 12 రిజర్వు చేయగా, మరో ఐదు పంచాయతీల్లో పాగా వేశారు. అత్యధిక పంచాయతీలు వున్న బుచ్చెయ్యపేట మండలంలో 35 పంచాయతీల్లో 19, అచ్యుతాపురం మండ లంలో 35 పంచాయతీలకు 19, కొయ్యూరులో 33కి 19చోట్ల మహిళలే సర్పంచులు అయ్యారు. 


మహిళలు గెలుపొందిన జనరల్‌ స్థానాలు...

కశింకోట మేజరు పంచాయతీ-జయరజని, ఎలమంచిలి మండలం పద్మనాభరాజుపేట- గున్నాబత్తుల శివలక్ష్మి; కె.కోటపాడు మండలంలో చంద్రయ్యపేట- సబ్బవరపు పార్వతి, కె.సంత పాలెం-చల్లామంగ, మర్రివలస-పోతుపల్లి అప్పల నరసమ్మ, పిండ్రింగి-జామి వెంకటరామలక్ష్మి, పాయకరావుపేట మండలం మాసాహేబ్‌పేట- గెడ్డమూరి నీలవేణి, గుంటుపల్లి-గెడ్డం సుజాత, కొత్తూరు-రెడ్డి సీత, మంగవరం-వంగలపూడి సరస్వతి, ఎస్‌.నర్సాపురం-ఎం.అనిత, చీడికాడ మండలం అర్జునగిరి-బోడాల రమాదేవి, తునివ లస-పడాల హైమ, చుక్కపల్లి-మజ్జి లక్ష్మమ్మ, చోడవరం మండలం మైచర్లపాలెం-బూరె దేవి, అనంతగిరి మండలం పెద్దబిడ్డి- సాలెపు పెంట మ్మ, చింతపల్లి- దురియా పుష్పలత....వగైరా.

Updated Date - 2021-02-28T06:33:51+05:30 IST