పామాయిల్‌ ధరలపై ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్‌

ABN , First Publish Date - 2021-04-24T05:14:25+05:30 IST

పామాయిల్‌ గెలలకు 18.68 శాతం ఆధారంగా రైతులకు ఫ్యాక్టరీలు ధరను చెల్లించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు సబబే అని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది.

పామాయిల్‌ ధరలపై ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్‌
పామాయిల్‌ గెలలు

18.68 శాతం చెల్లించాల్సిందే : హైకోర్టు ఆదేశం

పెదవేగి, ఏప్రిల్‌ 23 : పామాయిల్‌ గెలలకు 18.68 శాతం ఆధారంగా రైతులకు ఫ్యాక్టరీలు ధరను చెల్లించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు సబబే అని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. పామాయిల్‌ ధరపై అన్యాయం జరుగుతోందని రైతుల పోరాటానికి ఫలితంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలంగాణలో ఇస్తున్న ధరనే ఏపీలోనూ చెల్లించేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై ఏపీలోని ప్రైవేటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. పెదవేగి ఏపీ ఆయిల్‌ఫెడ్‌ సంస్థలో వచ్చే నూనె దిగుబడి శాతం ఆధారంగా మాత్రమే రైతులకు ధర చెల్లిస్తామని, ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించాయి. దీనిపై ప్రభుత్వంతోపాటు రైతుల సంక్షేమ  సంఘం కోర్టులో తమ వాదనలు వినిపించాయి. వాదనల అనంతరం ధర చెల్లింపులో ప్రభుత్వ ఉత్తర్వులు సబబేనని, ఆ మేరకు ప్రైవేటు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిందేనని హైకోర్టు పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆయిల్‌పామ్‌ తోటల విస్తీర్ణానికి దోహదపడుతుందని, ఇన్నేళ్ల పోరాటానికి ఫలితం దక్కిందని ఏపీ పామాయిల్‌ ధరల కమిటీ సభ్యుడు రామకృష్ణ తెలిపారు. 


Updated Date - 2021-04-24T05:14:25+05:30 IST