ఉద్యాన పంటలకు ఊతమేది ?

ABN , First Publish Date - 2022-08-08T05:33:54+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన వన పంటలపై ఉదాసీనత చూపిస్తోంది. అదే ఇప్పుడు ఆయిల్‌పామ్‌ సాగుకు ఊతమేది అన్నట్టుగా మారింది.

ఉద్యాన పంటలకు ఊతమేది ?

ప్రభుత్వ పాలనలో రాయితీ ప్రోత్సాహకాలు కరువు
గత ఏడాది రాయితీ సొమ్ము రూ.2.76 కోట్లు
నేటికీ రైతుల ఖాతాల్లో జమ కాని నగదు
కొత్త పామాయిల్‌ సాగుకు ఉద్యాన శాఖ సన్నద్ధం
పెట్టుబడి భారంతో రైతుల్లో నిరాశ


సాగు కష్టమైనా.. నష్టమైనా.. వాతావరణం అడ్డంకులు సృష్టించినా రైతు పంట పండిస్తూనే ఉంటాడు. అటువంటి రైతులకు ప్రభుత్వ భరోసా ఉంటే మరింత ధైర్యంగా అడుగులు ముదుకు వేస్తాడు. కానీ వైసీపీ ప్రభుత్వ పాలనలో రాయితీ ప్రోత్సాహకాలు కరువైపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం వరమిచ్చినా రాష్ట్రం మొండి చేయి చూపుతోంది. ఉద్యాన పంటలపై ఉదాసీనత ప్రదర్శిస్తోంది. పామాయిల్‌ రైతులకు రాయితీ  విడుదల  చేయడంలో తాత్సారం చేస్తోంది.

 
భీమవరం రూరల్‌, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన వన పంటలపై ఉదాసీనత చూపిస్తోంది. అదే ఇప్పుడు ఆయిల్‌పామ్‌ సాగుకు ఊతమేది అన్నట్టుగా మారింది. గత ఏడాది రైతులకు అందించాల్సిన రాయితీ ఇప్పటివరకు విడుదల చేయలేదు. వాస్తవానికి పామాయిల్‌పై దేశమంతా విదేశాలపైనే ఆధారపడుతుంది. పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. దిగుమతులు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశీయంగా పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహకాలు కల్పిస్తోంది.  కొత్తగా పామాయిల్‌ సాగు ప్రారంభిస్తే గత ఏడాది వరకు హెక్టారుకు రూ.12వేలు ఇస్తూ వచ్చింది. ఈ ఏడాది నుంచి రూ.29 వేలకు పెంచారు. కేంద్రం ఎంత పెద్దమొత్తంలో నగదు పెంచి ఊతమిచ్చేందుకు ప్రయత్నించినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానసాగుపై ఉదాసీనంగా ఉంటోంది. గత ఏడాది పామాయిల్‌ రైతులకు  ఇప్పటివరకు రాయితీ విడుదల చేయలేదు. ఈ ఏడాది నుంచి పెంచిన సొమ్ములను ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పామాయిల్‌ సాగు రాబడి బాగున్నా.. సాగు విస్తీర్ణం పెరుగుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.


గత ఏడాది రాయితీ రూ.2.76 కోట్లు

ఉద్యానపంట పంట అయిన ఆయిల్‌పామ్‌ సాగుకు నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ పథకం ద్వారా రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకి రాయితీ సొమ్ము జమ చేసేది. ఈ పథకం ద్వారా ఇచ్చే సొమ్ములో కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తోంది. గత ఏడాది జిలాల్లో దాదాపు 230 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగును  రైతులు కొత్తగా ప్రారంభించారు. మొక్కలు నాటడం పూర్తయిన తరువాత రాయితీ కింద అప్పటి లెక్కప్రకారం హెక్టారుకు రూ. 12 వేలు రైతుల ఖాతాలో జమ చేయాలి. ఈ లెక్కన 230 హెక్టార్లకు గాను 2 కోట్ల 76  లక్షల రూపాయలు రైతులకు రాయితీగా ఇవ్వాల్సి ఉంది.  ఎరువులు యాజమాన్యం కింద ఏడాదికి రూ.10,500 చొప్పున నాలుగేళ్లు రైతుకు అందించాలి. గత ఏడాది మొక్కలు నాటినా సరే రాయితీ సొమ్ము ప్రభుత్వం రైతులకు అందించలేదు. దీంతో రైతుల్లో నిరాశ మొదలైంది. పెట్టుబడి భారంతో పాటు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.


 కంపెనీలు వెనుకంజ

గతంలో పామాయిల్‌ కంపెనీలు రైతులకు   మొక్కలను సరఫరా చేసేవి. ప్రభుత్వం కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించేది. కంపెనీలకు సొమ్ములు ఇవ్వకపోడంతో రెండేళ్లనుంచి మొక్కల సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇప్పుడు నేరుగా రైతులే మొక్కలు సేకరించుకుంటున్నారు. వారికే ప్రభుత్వం సొమ్ములు చెల్లించాలి. రైతులు మొక్కలు నాటినా ఇప్పటికి వరకు ప్రభుత్వం సొమ్ము జమ చేయలేదు.  ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాయితీ పెంచుతూ వెళుతోంది. ఈ ఏడాది నుంచి హెక్టారుకు రూ. 29వేలు ఇవ్వాలని సంకల్పించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము విడుదల చేయకుండా ఉద్యానసాగును నీరు గారుస్తోంది. .


లక్ష్యం నెరవేరేనా ?   
 జిల్లాలో 16 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తుండగా దానిని రూ.30 వేల హెక్టార్లకు పెంచాలని జిల్లా ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అది నెరవేరా లంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాలి. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ పథకం, రాష్ర్టీయి కిసాన్‌ వికాస్‌ యోజన వంటి  పథకాల ద్వారా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది.  రాష్ట్ర ప్రభుత్వ తీరు కారణంగా రైతులకు ప్రోత్సాహకాలు అందకుండా పోతున్నాయి.  ఈ ఏడాది దాదాపు  370 హెక్టార్లలో పామాయిల్‌ సాగు విస్తరించేందుకు ఉద్యానశాఖ సన్నద్ధమవుతోంది.

Updated Date - 2022-08-08T05:33:54+05:30 IST