మోసకారి పార్టీలు వైసీపీ, బీజేపీ

ABN , First Publish Date - 2021-04-06T15:34:33+05:30 IST

మూడు దశాబ్దాల రాజకీయం. పార్లమెంట్‌ సభ్యురాలిగా..

మోసకారి పార్టీలు వైసీపీ, బీజేపీ

ఆ రెండు పార్టీల పాలనలో ప్రచారమే తప్ప అభివృద్ధి ఏదీ?

ఎన్నికలు నిజాయితీగా జరిగితే తిరుపతిలో గెలుపు ఖచ్చితంగా నాదే

టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి


(తిరుపతి, ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల రాజకీయం. పార్లమెంట్‌ సభ్యురాలిగా రెండు దశాబ్దాల అనుభవం. కేంద్రమంత్రిగా పదేళ్ల అధికారం. అగ్రశ్రేణి నాయకులతో సాన్నిహిత్యం. రాజకీయ మేధావులతో సహచర్యం. వివాదాలకు దూరం.. అభివృద్ధే అభిమతం.. ఇవే పనబాక లక్ష్మి ప్రత్యేకతలు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు పార్లమెంటుకు ఎన్నికైన ఆమె ఈసారి తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు.ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది. ఎన్నికల్లో తన ప్రచారాస్త్రాలు.. తన గెలుపునకు సహకరించే అంశాలపై ఆమె ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు.


ఇసుక రేటు ఇక బంగారం ధరే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలే నా ప్రచారాస్త్రాలు. రెండేళ్ల పాలనలో వైసీపీ, బీజేపీ విఫలమయ్యాయి. 2019 ఎన్నికల్లో 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్‌ అన్నారు కానీ మాట నిలబెట్టుకోలేదు సరికదా ఆ ప్రయత్నం కూడా చేయలేదు. రాజధానిలో మార్పుండదని అసెంబ్లీలో ప్రకటించి ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు. సంక్షేమం పేరుతో ప్రజలకు ఇచ్చే దానికన్నా మద్యం  రూపంలోనే ఎక్కువగా ప్రజల కష్టాన్ని పిండుకొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా ఇసుక దొరికేది. ఇప్పుడా ఇసుకను కూడా ప్రైవేటు సంస్థలకు ఇచ్చేశారు. ఇక ఇసుక రేటు బంగారం ధర కన్నా ఎక్కువ అవుతుందనడంలో సందేహం లేదు. ఉప్పు, పప్పు, నూనెలు.. వేటి ధరలు తీసుకున్నా ఆకాశాన్నంటుతున్నాయి. ఏడాది పాటు కరోనా ప్రజల ఆదాయ మార్గాలను కబళిస్తే, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం కారణంగా ధరల రూపంలో ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. 


అభివృద్ధి మాటే మరిచిన బీజేపీ 

బీజేపీ రాష్ట్ర ప్రజలకు మోసమే చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఇస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా తిరుపతి ఎన్నికల సభలో మోదీ హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించారు. దేశం మెచ్చే రాజధాని అమరావతికి నిధులిస్తామని తిరుపతి ఎన్నికల సభలో ప్రకటించిన మోదీ మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పెట్రోలు, డీజల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటి ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. దుగరాజపట్నం పోర్టుకు మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న కాలంలో ఆమోదముద్ర పడింది. ఇది పూర్తయితే తిరుపతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో 10వేల మందికి ఉపాధి అవకాశాలు లభించేవి. కానీ బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది.  మన్నవరం పరిశ్రమ విస్తరణకు నిధులివ్వకుండా ఆపేశారు.2011లో నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మరుగున పడిన శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం నిర్మాణానికి రూ.1200 కోట్లు బడ్జెట్‌లో పెట్టించాను. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 శాతం వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ పనులు ఆపేసింది.  


టీడీపీకి ఓటేసేందుకు జనం సిద్ధమయ్యారు

మూడు దశాబ్దాల నా రాజకీయ జీవితంలో చూసిన ఎన్నికలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతి.. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే జరిగాయి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన వాతావరణాన్ని చూస్తున్నా. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లా కాకుండా ఈ ఉప ఎన్నికలైనా  ప్రజాస్వామ్యబద్ధంగా, నీతిగా, నిజాయితీగా జరిగితే, విజయం నాదే. ప్రజలంతా టీడీపీకి ఓటు వేయాలని చూస్తున్నారు. చంద్రబాబు సమర్ధతతో పాటు పార్లమెంట్‌ సభ్యురాలిగా, కేంద్రమంత్రిగా నాకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.


Updated Date - 2021-04-06T15:34:33+05:30 IST