పంచ రంగుల పంజరం

Published: Mon, 04 Jul 2022 01:11:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పంచ రంగుల పంజరం

కళ్ళల్లో ఇమడలేని కలలు జారి 

చెంపలపై ఇంకిన ఆనవాళ్ళతో

వాళ్ళు ఇళ్లను విడిచెల్లిపోతారు...


అలుగు దుంకుతున్న వేదనను

గుండెల్లో అదిమిపట్టి చేతులూపుతూ,

వెనుదిరిగి చూడకుండా వాళ్ళెళ్లిపోతారు...


వణుకుతున్న పెదాలతో,

‘‘పోయొస్తా పైలమంటూ’’

బుడ్డోడి తల నిమిరి, ఇంటామె కళ్ళు తుడిచి,

తడబడే కాళ్లతో నడవలేక నడుస్తూ 

బంధాలను బలవంతంగా వదిలెళ్లిపోతారు...


కలిసి నడిచిన సోపతోళ్లు గుండెలకు హత్తుకోగానే...

కలియదిరిగిన వాడలన్నీ కండ్లల్ల మెదులుతుంటే,

కట్టతెగిన దుఃఖమంతా మత్తడోలే ఎగిసిపడ్తది.

కన్నోళ్ళ తడికళ్ళ దీవెనార్తులు దాచుకుని,

ముప్పైకిలోల మూటతో వలసెల్లిపోతారు...


గూడునొదిలి, తోడునొదిలి,

నీడనొదిలి, జాడనొదిలి,

తల్లీ, చెల్లి, ఇల్లు, ఆలి,

ఐనవాళ్ల ముఖచిత్రాల్ని మనసులో

ముద్రించుకుని కాసిన్ని గింజలకై

వలస పిట్టలోలే ఎగిరెళ్లిపోతారు,

మహా సముద్రపు ఆవలిగట్టుపై వాలిపోతారు...


పసిగుడ్డు కండ్లు తెరిచినా,

తండ్రి తనువు చాలించినా,

ఆనందభాష్పాలైనా, అశ్రుబిందువులైనా

అరచేతిలోని గాజుతెరపై కారి కరగాల్సిందే తప్ప,

గట్టు దాటలేరు, చెట్టు చేరలేరు....


‘‘పంచరంగుల పంజరం’’ నుండి

బాహ్య ప్రపంచాన్ని వీక్షిస్తూ,

విడిచిన చెట్టును, వదిలిన గూడును

కలగంటూ రాత్రుళ్ళు ఉలిక్కిపడి లేస్తుంటారు....


పొద్దంతా పరకా, పరకా పేర్చి,

నింగినంటే గూళ్లను నిర్మిస్తారు,

సొంతగూటి కోసం ఒక్క పుల్లకైనా నోచుకోరు.... 


తప్పుకో రాయి చొప్పున గులేర్‌ దెబ్బల రుచి చూస్తూ,

పొద్దున్నే పుట్టి, సాయంత్రానికల్లా మరణించిన ఆత్మలను,

మోసుకుంటూ ‘క్యాంప్‌’ గుమ్మంలోకి అడుగుపెడతారు...


తెగిన రెక్కలతో ఎగరలేక,

మొలిచే రెక్కలకై ఎదురుచూస్తూ....

తిరిగి పచ్చనిచెట్టుపై వాలే పిట్టలు కొన్నైతే,

అలసి పరాయిగట్టుపై రాలే పిట్టలు మరికొన్ని....

జాబేర్‌ పాషా

00968 78531638 (మస్కట్‌)


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.