‘పాంచ్‌’ పటాకా...

ABN , First Publish Date - 2022-06-26T18:11:42+05:30 IST

జాన్‌ వడ్లా, మార్క్‌ రూమర్‌, డల్లాస్‌ బర్నీ, జాన్‌ మొలోనీ, జాన్‌ డిక్సన్‌... ఐదుగురూ ప్రాణస్నేహితులు... అది 1982... అంటే సరిగ్గా నలభై ఏళ్ల

‘పాంచ్‌’ పటాకా...

జాన్‌ వడ్లా, మార్క్‌ రూమర్‌, డల్లాస్‌ బర్నీ, జాన్‌ మొలోనీ, జాన్‌ డిక్సన్‌... ఐదుగురూ ప్రాణస్నేహితులు... అది 1982... అంటే సరిగ్గా నలభై ఏళ్ల క్రితం... ఒక రోజు కాలిఫోర్నియాలోని ‘కాప్కో’ సరస్సు దగ్గర కూర్చున్నారు. వారిలో ఒక స్నేహితుడి చేతిలో సీసా... అందులో నూనెలాంటి పదార్థముంది. ఎందుకో అలాగే ‘ఒక ఫొటో లాగించేద్దాం’ అనుకుంది మిత్రబృందం.  టీనేజ్‌లో గట్టు మీద కూర్చుని ఫొటో దిగారు. ‘ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఇలాగే ఫొటో దిగుదాం సరదాగా...’ అనుకుంటూ ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికి 8 సార్లు అదే పోజు పెట్టి దిగ్విజయంగా ఫొటోలు దిగారు. కాలగమనంలో ఫొటోలు మారు తుంటే (పోజు, పొజిషన్‌ మాత్రం మారలేదండోయ్‌...) వారు ఎలా మారుతున్నారో చూపెడతాయి అవి. విషాదం ఏమిటంటే వారిలో ఒక మిత్రుడు ఇటీవలే క్యాన్సర్‌ బారినపడటం. అయినా సరే 9వ ఫొటో దిగారు. ‘‘ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఫొటో తీసుకునేప్పుడు వచ్చేసారి ఏదో ఒక స్థానం ఖాళీ అవుతుందేమోనని భయపడేవాళ్లం’’ అంటూ గతాన్ని గుర్తుతెచ్చు కున్నాడు జాన్‌ డిక్సన్‌. ఆయన శాంతా బార్బరాలో ఉంటారు.


కాలగమనంలో మిత్రులంతా ఎక్కడెక్కడో స్థిరపడ్డప్పటికీ ఐదేళ్లకొక సారి మాత్రం ఆ సరస్సు దగ్గరకు వచ్చి ఫొటో తీసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. చివరిసారిగా 2017లో కలుసుకున్నారు. అయితే వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలతో బాధపడు తుండటంతో కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ ఒప్పందం ప్రకారం అతి కష్టం మీద ఈ ఏడాది కూడా లాగించేశారు. వాళ్లందరికీ ఇప్పుడు 59 ఏళ్లు. మరో ఫొటో సెషన్‌ అంటే మరో ఐదేళ్లు (2027)... ‘పాంచ్‌’ పటాకా మిత్రులు ఇలాగే కలవాలని సోషల్‌ మీడియాలో వారి గురించి చదివిన వారంతా కోరుకుంటున్నారు. 

Updated Date - 2022-06-26T18:11:42+05:30 IST