పంచాయతీ ఎన్నికల కసరత్తు మొదలు

ABN , First Publish Date - 2021-01-22T06:07:45+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లలో నిమగ్నమైంది.

పంచాయతీ ఎన్నికల కసరత్తు మొదలు
జిల్లా పంచాయతీ కార్యాలయం

ఇప్పటికే సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు

(ఆంధ్రజ్యోతి - గుంటూరు)

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లలో నిమగ్నమైంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత గురువారం సాయంత్రం డీపీవో కార్యాలయానికి ఈ మేరకు మెయిల్‌లో ఆదేశాలందినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ ప్రకటనతో జిల్లా పంచాయతీ కార్యాలయంతోపాటు, డీఎల్‌పీవో కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు మొదలైంది. మండలాల వారీగా పంచాయతీలు, వార్డు సభ్యుల సంఖ్య,  పోలింగ్‌స్టేషన్లు తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సిబ్బంది, నామినేషన్‌ కేంద్రాలు ఇతర అంశాలను ఖరారు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో 1,042 పంచాయతీలుండగా 976 పంచాయతీల ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలయ్యాయి. పొన్నూరు, బాపట్ల, మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట పట్టణాల సమీపంలోని కొన్ని గ్రామాలు ఆయా పురపాలక సంఘాల్లో కలిశాయి. దీంతో మొత్తం 66 గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాల పరిధిలోకి కొచ్చాయి. అందువల్ల ఈ పంచాయతీల్లో ఎన్నికలు జరగవు.

కోర్టుతీర్పు శుభపరిణామం


పంచాయతీ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు శుభపరిణామం అని ఏపీ పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర చైర్మన్‌ జాస్తి వీరాంజనేయులు తెలిపారు.  ప్రభుత్వం పంచాయతి ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీకి సహకరించాలని కోరారు.

మూడు పోస్టులకు ఒకే అధికారిపై ఆరా? 

స్థానిక సంస్థలలో కీలకమైన మూడు పోస్టులకు జిల్లాలో ఒకే అధికారి కొనసాగుతుండటంపై ఎస్‌ఈసీ ఆరా తీసినట్లు సమాచారం. పంచాయతీ, మండలాల్లో సిబ్బంది, అధికారులు, కార్యదర్శుల వివరాలను జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్‌కు పంపింది. ఈ ప్రకారం నాదెండ్ల మండలం ఈవోపీఆర్‌డీ, ఎంపీడీవో, నరసరావుపేట డీఎల్‌పీవోగా ఒకే అధికారి కొనసాగుతున్నట్లు ఎస్‌ఈసీ దృష్టికి వెళ్లినట్లు సమాచారం.     

అడ్డంకులు ఉండటానికి వీల్లేదని లేఖ  


హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పు వెలువడిన కాసేపటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు. ఎన్నికలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌, అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు, జడ్పీ సీఈవో, డీపీవోలకు లేఖలో ఎస్‌ఈసీ సూచించారు. ఈ నెల 23న తొలి విడత, 27న రెండో విడత, 31న మూడో విడత, ఫిబ్రవరి నాల్గో తేదీన నాల్గో విడత ఎన్నికలకు నోటిఫికేషన్లను విడుదల చేయడం జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పటివరకు ఓటర్‌ జాబితాలను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. అవసరం మేరకు ఓటర్‌ జాబితాలను సిద్ధం చేసి పెట్టాలన్నారు. న్యాయ, పరిపాలన చిక్కులు, పట్టణ స్థానిక సంస్థల్లో విలీనానికి ప్రతిపాదించిన గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వరాదని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ గత ఏడాది ప్రారంభమైన సందర్భంలో ఎక్కడైతే ఏకగ్రీవం అయ్యాయో సంబంధిత ఆర్‌వోలను గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు ప్రత్యక్షంగా/పరోక్షంగా నియమించడానికి వీల్లేదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. 


Updated Date - 2021-01-22T06:07:45+05:30 IST