సీట్లో కూర్చున్నారు.. చెక్‌ పవర్‌ లేదు!

ABN , First Publish Date - 2021-04-11T04:58:08+05:30 IST

గెలిచిన నెల తర్వాత సీట్లో కూర్చున్నారు.. అయితే ఇంతవరకూ ప్రభుత్వం మాత్రం చెక్‌పవర్‌ ఇవ్వలేదు.

సీట్లో కూర్చున్నారు.. చెక్‌ పవర్‌ లేదు!

 ప్రభుత్వం ఎప్పుడు ఇస్తోందో తెలియని పరిస్థితి

 నూతన సర్పంచ్‌ల ఎదురుచూపులు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 10 : గెలిచిన నెల తర్వాత సీట్లో కూర్చున్నారు.. అయితే ఇంతవరకూ ప్రభుత్వం మాత్రం చెక్‌పవర్‌ ఇవ్వలేదు. ఏ పనిచేయాలన్నా వారి చేతిలో ఏమీ లేదు. ప్రభుత్వం ఎప్పుడు ఆ అధికారాన్ని అప్పగిస్తుందో కూడా తెలియని పరిస్థితి. దీంతో నూతన సర్పంచ్‌లు కేవలం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి కూర్చొని వచ్చేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో జరిగాయి. జిల్లావ్యాప్తంగా 1,050 గ్రామపంచాయతీలు ఉండగా వివిధ కారణాలతో 39 చోట్ల ఎన్నికలు నిలిచిపోగా, 1,011 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌  అనంతరం కౌంటింగ్‌ జరగ్గా ఆ రోజునే రిటర్నింగ్‌ అధికారుల వద్ద గెలుపొందినట్లుగా ధ్రువీకరణ పత్రాలను అందుకున్న నూతన సర్పంచ్‌లు బాధ్యతల కోసం  నెలన్నర ఎదురుచూశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఎట్టకేలకు ఈనెల 3న పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి సర్పంచ్‌లకు బాధ్యతలు అప్పగించారు. 


బాధ్యతలకే పరిమితమైన సర్పంచ్‌లు...

పంచాయతీ సర్పంచ్‌లకు గ్రామంలో ఏ పనిచేయాలన్న సర్వాధికారాలు ఉంటాయి.  అయితే ప్రస్తుతం జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. అట్టహాసంగా ఈనెల 3న బాధ్యతలు స్వీకరించారే తప్ప ఇంతవరకూ చెక్‌పవర్‌ ఇవ్వలేదు. ఈ చెక్‌పవర్‌ లేకపోవడంతో నూతన సర్పంచ్‌లు ఆయా గ్రామపంచాయతీల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో తాగునీటి  సమస్యతో పాటు, ఇతర ముఖ్యమైన పనులు చేపట్టేందుకు కూడా సర్పంచ్‌లకు అవకాశం లేకపోవడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు.


కార్యాలయాలకు వచ్చిపోవడమే

సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజువారీ పంచాయతీ కార్యాలయాలకు వచ్చి సీట్లో కూర్చొని తిరిగి వెళ్లిపోవడమే జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా ఏ పనులు చేపట్టాలన్నా చెక్‌పవర్‌ అవసరం ఉంది. అయితే ఆ అధికారాన్ని ప్రభుత్వం ఇంతవరకూ సర్పంచ్‌లకు ఇవ్వకపోవడంతో వారు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  


Updated Date - 2021-04-11T04:58:08+05:30 IST