‘స్థానికం’ సిద్ధమేనా?

ABN , First Publish Date - 2021-01-22T06:39:48+05:30 IST

హైకోర్టు తీర్పును అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వస్తోంది.

‘స్థానికం’ సిద్ధమేనా?

తెరపైకి పంచాయతీ ఎన్నికల అంశం

నోటిఫికేషన్‌ విడుదల చేస్తే రేపటి నుంచే నామినేషన్లు

సుప్రీంకోర్టు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే తక్షణమే కోడ్‌ 


పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశం మళ్లీ తెరపైకి రావడంతో అందరూ అప్రమత్తమయ్యారు. ఎన్నికలను ఇబ్బంది లేకుండా నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం వెనకడుగు వేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. 


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : హైకోర్టు తీర్పును అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వస్తోంది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తున్నట్లు  ఎనిమిదో తేదీన కోర్టు ప్రకటించినపుడు ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలని కొందరు మంత్రులు డిమాండ్‌ చేశారని, ఇప్పుడు కోర్టు తీర్పు ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా వచ్చినందున ఆ మంత్రులు రాజీనామా చేయాలని మాజీమంత్రి  కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. 


ఉద్యోగ సంఘాల మాట చెల్లుబాటయ్యేనా?

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తరువాతే ఎన్నికల విధుల్లో పాల్గొంటామని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనకపోతే చర్యలు తీసుకుంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారమే సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఉద్యోగ సంఘాలు కూడా అదే ఆలోచనలో ఉన్నాయి. దీంతో ఎన్నికలు జరుగుతాయా? అనే చర్చ మొదలయింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలని సుప్రీం ఉత్తర్వులు వస్తే వెంటనే ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుంది. 8వ తేదీనే ఎన్నికల కమిషనర్‌ షెడ్యూలును ప్రకటించడం, ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు రావడంతో నోటిఫికేషన్‌కు సంబంధించి శుక్రవారం ఎన్నికల కమిషనర్‌ తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. ఎన్నికలు జరిగేట్టయితే అందుకనుగుణంగా వ్యూహాన్ని రూపొందించుకునేందుకు ఆయా రాజకీయ పార్టీల నాయకులు తన అనుయాయులతో  సమాలోచనలు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-22T06:39:48+05:30 IST