ప.గో. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు!

ABN , First Publish Date - 2021-01-25T15:29:42+05:30 IST

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు ఆదేశాల కోసం పశ్చిమగోదావరి జిల్లా అధికారులు...

ప.గో. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు!

పశ్చిమగోదావరి: పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు ఆదేశాల కోసం పశ్చిమగోదావరి జిల్లా అధికారులు ఎదురుచూస్తున్నారు. తీర్పు వెల్లడి అయిన వెంటనే  జిల్లా కలెక్టర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ తరువాతే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. తొలిదశలో ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో 337 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.


ఇప్పుడు... అందరిచూపూ సుప్రీంకోర్టు వైపే! పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా... లేదా? సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? ‘జరిపి తీరాల్సిందే’ అని చెబితే ప్రభుత్వం ఏమంటుంది? ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారా? లేక... ‘వ్యాక్సిన్‌ వేసే దాకా ఎన్నికల్లో పాల్గొనం’ అనే చెబుతారా? ఎడతెగని ఉత్కంఠ! పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఇది మధ్యాహ్నం ధర్మాసనం ముందుకు రావొచ్చునని భావిస్తున్నారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపాల్సి ఉండింది. అయితే... ఆదివారం దీనిని  జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌  రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు మార్చారు. ఈ బెంచ్‌ ముందు ఉన్న కేసుల జాబితాలో 39వ నంబరు ఇచ్చారు.  హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఇదే ధర్మాసనం విచారణ జరపనుంది. దీనికి కేసుల వరుసలో 40వ నంబరు ఇచ్చారు. ఈ రెండు పిటిషన్లను కలిపే ధర్మాసనం విచారించనుంది. 

Updated Date - 2021-01-25T15:29:42+05:30 IST