పంచాయతీ నిధులు పక్కదారి!

ABN , First Publish Date - 2021-11-24T06:19:22+05:30 IST

15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పడుతున్నాయి.

పంచాయతీ నిధులు పక్కదారి!

15వ ఆర్థికసంఘం నిధులు రూ.100 కోట్లకుపైగా మళ్లింపు

విద్యుత్‌ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు

ఇదేం చోద్యమంటున్న సర్పంచ్‌లు


15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పడుతున్నాయి. తమ ప్రమేయం లేకుండా ఖాతాల్లోని నిధులు తరిగిపోతుండటంతో ఆయా పంచాయతీల పాలకవర్గాలు అవాక్కవుతున్నాయి. ఖాతాల్లోని నగదు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా మళ్లిపోతున్నాయి. బిల్లు నెంబరు మాత్రమే తమకు వస్తోందని, ఏ ఖర్చుల కింద నిధులు మళ్లించారో తెలియడం లేదని సర్పంచ్‌లు, పంచాయతీల ఉద్యోగులు వాపోతున్నారు. 

 

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం/మోపిదేవి : జిల్లాలో 980 పంచాయతీలున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గతంలో రూ.142.94 కోట్లను విడుదల చేసింది. ఇటీవల మరో రూ.21 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు నేరుగా ట్రెజరీల ద్వారా పంచాయతీల ఖాతాల్లో జమ అవుతాయి. పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇస్తే, ట్రెజరీల ద్వారా నిధులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ నిధులను విద్యుత్‌ బకాయిల నిమిత్తం ఇంధనశాఖ ఒకవిడత డ్రా చేసుకోవచ్చని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకుని ఇంధనశాఖ సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా పంచాయతీ నిధులను మళ్లిస్తోంది.  

 

బిల్లులు, చలానాలు లేవు..

పంచాయతీల ఖాతాల నుంచి నిధులను డ్రా చేసే సమయంలో బిల్లులు, చలానాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ నిధులు ఏ ఖాతాలకు జమవుతున్నాయో కూడా తెలియని స్థ్థితి నెలకొంది. 


అభివృద్ధి ప్రణాళికల మాటేమిటి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అందుకనుగుణంగా పాలకవర్గాలు ప్రణాళికలను తయారు చేస్తున్నా, ఖాతాల్లోని నగదును గుట్టుచప్పుడు కాకుండా లాగేసుకుంటుంటే ఈ ప్రణాళికలు ఎలా అమలవుతాయని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. బకాయిలకంటే అధికంగా నిధులను మళ్లించుకుంటున్న ఇంధనశాఖ ఇంకా బకాయిలున్నట్టు నోటీసులు పంపుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.


మూడు విడతలుగా నిధుల మళ్లింపు 

జిల్లాలోని పంచాయతీల నుంచి మూడు విడతలుగా నిధులను మళ్లించారని సర్పంచ్‌లు ఆరోపించారు. సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇవ్వడంలో తీవ్రజాప్యం చేస్తూ, అభివృద్ధి పనులకు బిల్లులు పెడితే, పెండింగ్‌లో పెట్టారని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు.


సమాచారం లేకుండా పక్కదారి

పంచాయతీల్లో విద్యుత్‌ చార్జీలు, పారిశుధ్య పనులు, రోడ్ల నిర్వహణ, స్టేషనరీ ఖర్చుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.34,89,380 విడుదల చేసింది. వీటిలో 13,61,601 రూపాయలను ఏ విధమైన సమాచారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఆర్థిక సంఘం నిధులను సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా, గ్రామపంచాయతీ తీర్మానంతో సర్పంచ్‌ చెక్‌పవర్‌ ద్వారా మాత్రమే డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ నిధుల్లో 60 శాతం టైడ్‌ గ్రాంటుగా పరిగణించి, 30 శాతం తాగునీటికి, 30 శాతం పారిశుధ్య పనుల నిర్వహణకు ఉపయోగించాలి. మిగిలిన నిధులను అభివృద్ధి పనులకు, పంచాయతీ నిర్వహణకు వినియోగించుకోవాలి. ఈ నిబంధనలను లెక్క చేయకుండా నిధులను దారి మళ్లిస్తున్నారు. ఈ నిధులను తిరిగి ఖాతాల్లో జమ చేయకుంటే సర్పంచ్‌లంతా ఐక్యంగా ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది.  - పోలిమెట్ల ఏసుబాబు, సర్పంచ్‌, పెదప్రోలు

Updated Date - 2021-11-24T06:19:22+05:30 IST