పంచాయతీల.. ఖజానా ఖాళీ

ABN , First Publish Date - 2021-12-02T05:55:47+05:30 IST

పంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయి.. ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరిట 14, 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేసుకోగా, రిజిస్ట్రేషన్‌ సర్‌చార్జి నిధులను పంచాయతీలకు జమచేయకుండా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటోంది.

పంచాయతీల.. ఖజానా ఖాళీ
జిల్లా పంచాయతీ కార్యాలయం

విద్యుత్‌ బిల్లులకు ఆర్థిక సంఘం నిధులు జమ

పెండింగ్‌లో కరోనా బిల్లులు

ప్రత్యేకాధికారులు పాలనలో విచ్చలవిడిగా ఖర్చు 

జమకాని రిజిస్ట్రేషన్‌ నిధులు

బ్లీచింగ్‌కు కూడా డబ్బుల్లేవంటున్న సర్పంచ్‌లు

ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు

         (ఆంధ్రజ్యోతి - గుంటూరు)

పంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయి.. ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరిట 14, 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేసుకోగా, రిజిస్ట్రేషన్‌ సర్‌చార్జి నిధులను పంచాయతీలకు జమచేయకుండా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటోంది. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం తమ ప్రమేయం, పంచాయతీల తీర్మానం లేకుండానే నిధులు జమచేసుకొంటోందని సర్పంచ్‌లు తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఆర్థిక వనరులు పెరగడానికి ప్రతేక నిధులు ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చే నిధులను బకాయిలకు జమచేసుకొంటూ తమ చేతులు కట్టేసిందని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. 

ఆర్థిక సంఘ నిధుల మళ్లింపు.. 

రాష్ట్రప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీ విద్యుత్‌ బకాయిలకు నేరుగా జమచేసుకొంది. జిల్లాలో గతంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.170 కోట్లు జమచేసుకోగా, 15వ ఆర్థిక సంఘం తొలివిడత నిధులు రూ.40 కోట్లు తాజాగా జమ చేసుకొంది. రెండోవిడత విడుదలయ్యే రూ.30 కోట్లు జమ చేసుకోబోతున్నట్లు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో పంచాయతీల్లో నిధుల కొరత వేధిస్తోంది.   

వెంటాడుతున్న బకాయిలు..

పంచాయతీల్లో బకాయిలు సర్పంచ్‌లను వెంటాడుతున్నాయి. రెండేళ్లపాటు ప్రత్యేకాధికారులు పెద్దయెత్తున నిధులు ఖర్చుచేశారు. జిల్లాలో సుమారు 300 సచివాలయాలు అద్దెభవనాల్లో ఉంటున్నాయి. వీటికి పంచాయతీలే అద్దె చెల్లించాల్సి వుంది. రెండేళ్ల నుంచి కరోనా నివారణకు ఖర్చుచేసిన సొమ్మును ఇంకా చెల్లించలేదు. పోలింగ్‌ సందర్భంగా చెల్లించాల్సిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో వున్నాయి. కొన్ని పంచాయతీల్లో కొవిడ్‌ క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటికి ఇంకా నిధులు జమచేయలేదు.  ప్రత్యేకాధికారుల పాలనలో చేసిన పనులు, అప్పులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదు. 

జమకాని రిజిస్ట్రేషన్‌ నిధులు..

జిల్లాలో రెండేళ్ల నుంచి రిజిస్ట్రేషన్‌ సర్‌చార్జ్‌ నిధులు పంచాయతీలకు జమ కావడం లేదు.   సీఎఫ్‌ఎంఎస్‌లో ఈ నిధులు ఉన్నట్లు ట్రెజరీలలో అంకెలు చూపిస్తున్నారు. ఆ డబ్బు మాత్రం జమకావటం లేదు. రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు ఆరేడేళ్ల నుంచి సర్‌ఛార్జ్‌ నిధులు విడుదల కాలేదు. జిల్లాలో ఈ నిధులు సుమారు రూ.600-రూ.700 కోట్లను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్ళించింది.   

కోర్టుకు వెళతాం..

ప్రభుత్వం స్థానికసంస్థలపై పెత్తనం చేస్తోంది. గ్రామ అవసరాలు, అభివృద్ధి, ఆర్థిక వనరులు ఇతర అంశాలను సర్పంచ్‌లు, పాలకవర్గం చర్చించి నిధులు ఖర్చుచేయాలి. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం బకాయిల పేరుతో జమ చేసుకోవటం సరికాదు. దీనిపై సర్పంచ్‌లతో చర్చించి కోర్టుకు వెళతాం.

- జాస్తి వీరాంజనేయులు, ఏపీ పంచాయతీ పరిషత్‌ చైర్మన్‌  

 

నిధులు, విధులు ప్రచారానికే పరిమితం...

 స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు, విధులు ఇతర అంశాలు ప్రచారానికే పరిమితంగా వున్నాయి. కేంద్రం 73, 74 రాజ్యాంగ సవరణ పేరుతో చేసిన తీర్మానాలు అమలు కావడం లేదు.  నామినేటెడ్‌ పద్ధతిలో నిధులను జమచేసుకోవటం మంచి సంప్రదాయం కాదు.

-  మల్లెల హరీంద్రనాఽథ్‌చౌదరి, మాజీ సర్పంచ్‌  


Updated Date - 2021-12-02T05:55:47+05:30 IST