పంచాయతీ పోరు షురూ..

ABN , First Publish Date - 2021-01-22T06:05:08+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది

పంచాయతీ పోరు షురూ..

  1. ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా 
  2. గ్రామాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్‌
  3. వేడెక్కుతున్న వాతావరణం
  4. గుర్రుగా ఉన్న వైసీపీ నాయకులు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. హైకోర్టు నిర్ణయాన్ని దాదాపు అన్ని పార్టీలు స్వాగతిస్తుండగా.. వైసీపీ నాయకులు మాత్రం గుర్రుగా ఉన్నారు. జిల్లాలోని 970 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేస్తుండగా.. త్వరలో వెలువడే నోటిఫికేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాత షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. 

గతంలో మార్చి 15న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉండగా.. కొవిడ్‌ కారణంగా ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడ్డాయి. జనవరి 8న ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఎస్‌ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. 11వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను సింగిల్‌ జడ్జి కొట్టేశారు. దీనిపై ఎస్‌ఈసీ అప్పీల్‌కు వెళ్లగా ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లాలో 970 పంచాయతీలకు జనవరి 8న ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లుగా చెబుతున్నారు. 


జగన్‌కు చెంపపెట్టు

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం గురువారం ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్‌కు చెంపపెట్టు. తన మంకు పట్టును నిరూపించుకోవడానికి, ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ను వేధించడానికి మాత్రమే ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఏ మాత్రం దృష్టిలో ఉంచుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధం కావాలి. - సోమిశెట్టి వెంకటేశ్వర్లు,  టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు

 

ప్రజల ప్రయోజనాలను కాపాడాలి

ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్‌ ఎన్నికలను నిర్వహించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికలను వాయిదా వేసేందుకు చూపిన కారణాలు సహేతుకంగా లేవని హైకోర్టు తీర్పునివ్వడం శుభపరిణామం. భేషజాలు వదిలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌కు సహకరించాలి.  - గౌరు వెంకటరెడ్డి, టీడీపీ నంద్యాల లోక్‌సభ   నియోజకవర్గ అధ్యక్షుడు


ఎన్నికలంటే మీ ఇంట్లో ఫంక్షనా?

మీ ఇష్టమొచ్చినట్లు జరుపుకోవడానికి ఎన్నికలు మీ ఇంట్లో ఫంక్షన్‌ కాదు. ఎవరైనా రాజ్యాంగ నిబంధనలు పాటించాల్సిందే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ వ్యక్తిగత భేషజాలకు వెళ్లి ఎన్నికల వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మొదటి నుంచి కోరుతున్నాం. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి. ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందాలంటే ఏడాది అవుతుంది. అప్పటి వరకు ఎన్నికలు వద్దంటే ఎలా? - వాల్మీకి పార్థసారఽథి, బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి 


నియంతలా వ్యవహరిస్తున్నారు

ఎస్‌ఈసీ నియంతలా వ్యవహరి స్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగా టమాడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా లేరు. 2018లో ఎన్నికలు ఎందుకు జరపలేదో సమాధానం చెప్పాలి. కరోనా వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయించింది. రెండు నెలల తరువాత ఎన్నికలు నిర్వహిస్తే నష్టం ఏంటి? - బీవై రామయ్య, వైసీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు 

Updated Date - 2021-01-22T06:05:08+05:30 IST