పల్నాడులో పోలీసుల దాష్టీకం! నామినేషన్‌ ఉపసంహరించుకోలేదని..

ABN , First Publish Date - 2021-02-12T06:42:03+05:30 IST

నామినేషన్‌ ఉపసంహరించుకోవడానికి ససేమిరా..

పల్నాడులో పోలీసుల దాష్టీకం! నామినేషన్‌ ఉపసంహరించుకోలేదని..

భయోత్పాతం!

సర్పంచ్‌ అభ్యర్థి భర్తను చావబాదిన ఖాకీలు

తిరగబడ్డ జనం.. రాస్తారోకో.. 

ఏనుగుపాలెంలో టీడీపీ కార్యకర్తపై దాడి

కరూత్నల పొలాల్లో నీటి పైపుల ధ్వంసానికి యత్నం


రెంటచింతల(గుంటూరు): పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ వర్గీయులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. తమకు నచ్చనివారు నామినేషన్‌ వేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. సొంత పార్టీలో రెబల్స్‌పైనా దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు పోలీసులు సైతం జులుం ప్రదర్శిస్తున్నారు. రెంటచింతల మండలం కొతపాలువాయిలో నామినేషన్‌ ఉపసంహరించుకోవాలంటూ ఓ అభ్యర్థి భర్తను పోలీసులు చావబాదడ కలకలం రేపింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహించి రాస్తారోకో చేశారు. వినుకొండ మండలం ఏనుగుపాలెంలో ఓ వ్యక్తిపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. తమకు స్థానిక సీఐ నుంచి రక్షణ కల్పించాలంటూ పిట్టంబండ అభ్యర్థి ఎన్నికల అధికారికి విన్నవించుకున్నారు. 

 

నామినేషన్‌ ఉపసంహరించుకోవడానికి ససేమిరా అనడంతో ఓ అభ్యర్థిని పోలీసులు చావబాదిన ఘటన రెంటచింతల మండలం కొత్తపాలువాయి గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... పాలువాయి గ్రామ సర్పంచ్‌ పదవి ఓసీ మహిళకు కేటాయించడంతో వైసీపీకి చెందిన ఆరుగురు నామినేషన్లు వేశారు. వీరిలో ముగ్గురు నామినేషన్‌ ఉపసంహరించుకోవడానికి ముందుకొచ్చారు. అయితే వైసీపీలోనే మరో వర్గానికి చెందిన పాశం రామకోటిరెడ్డి భార్య వెంకట నరసమ్మ, గన్నవరపు శ్రీనివాసరెడ్డి భార్య లక్ష్మీ విజయ బరిలో వున్నారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగియనుండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గన్నవరపు శ్రీనివాసరెడ్డి, పాశం రామకోటిరెడ్డిలను పిలిపించి వారి భార్యలను విత్‌డ్రా చేసుకోవాలని తమదైన శైలిలో చెప్పగా శ్రీనివాసరెడ్డి తన భార్య చేత విత్‌ డ్రా చేయించేందుకు అంగీకరించాడు.


రామకోటిరెడ్డి మాత్రం ససేమిరా అంటూ మిరప చేను వరకు వెళ్లి వస్తానని చెప్పి పొలంలో దాక్కున్నాడు. ఎంతకి రాకపోవడంతో పోలీసులు పొలంలోకి వచ్చి రామకోటిరెడ్డిని లాఠీలతో చావబాదారు. రామకోటిరెడ్డి స్పృహ కోల్పోయిన విషయాన్ని కూలీలు గ్రామస్తులకు తెలియజేయడంతో ఒక్కసారిగా ఆగ్రహించారు. గ్రామస్తులు పోలీసువాహనంపై రాళ్లురువ్వడంతో  పోలీసులు వెనుతిరిగారు. బాధితుని కుటుంబీకులు, గ్రామస్తులంతా రెంటచింతలకు వచ్చి మాచర్ల  గుంటూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఫలితంగా ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది. దోషులపై చర్యలు తీసుకుంటాం ట్రాఫిక్‌ అంతరాయం కలిగించొద్దంటూ గురజాల రూరల్‌ సీఐ ఉమేష్‌ ఆందోళనకారులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. గురజాల డీఎస్పీ బెజవాడ మెహర్‌ జయరాం ప్రసాద్‌ రంగంలోకి దిగి ఆందోళనకారులకు నచ్చచెప్పారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోరడంతో ఆందోళన విరమించారు. 

 

ఓటు వేయకపోతే చంపుతాం..

వైసీపీకి ఓటు వేయకపోతే చంపుతామంటూ ఆ పార్టీకి చెందిన కొందరు తనపై దాడి చేశారని మండలంలోని ఏనుగుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అర్ధలపూడి సాయికుమార్‌ ఆరోపించారు. గ్రామానికి చెందిన పాపసాని రమేష్‌, దావులూరి వీరాంజి, దావులూరి వీరాంజి కర్రలతో దాడి చేయడంతో ఎడమ భుజానికి తీవ్రగాయమైందని తెలిపారు. వైసీపీకి ఓటు వేయకుండా గ్రామంలో ఎలా తిరుగుతావో చూస్తామని గతంలో బెదిరించారని అన్నాడు. గాయాలపాలైన సాయికుమార్‌ను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంధువులు ఈ ఘటనపై పోలీసులకు  ఫిర్యాదు చేశారు.   

 

సీఐ బెదిరిస్తున్నారు..

నియోజకవర్గంలో గురువారం జిల్లా ఎన్నికల పరిశీలకుడు కాంతిలాల్‌దండే పర్యటించారు. తమకు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని వినుకొండ మండలం పిట్టంబండ సర్పంచ్‌ అభ్యర్థితో కలిసి గ్రామస్తులు కాంతిలాల్‌ దండేకు విన్నవించుకున్నారు. గ్రామంలో ప్రచారం చేసే సమయంలో పోలీసులు వచ్చి నానా దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. సీఐ చినమల్లయ్య నుంచి తమను రక్షించండి అంటూ మొరపెట్టుకున్నారు. ఆయన వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నూజెండ్ల మండలం కమ్మవారిపాలేనికి చెందిన కొందరు  ఆయనను కలిసి మారెళ్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలెం 7, 8 పోలింగ్‌ బూత్‌లను, మారెళ్లవారిపాలెంకు మార్చిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. శావల్యాపురం జడ్పీ పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఉద్యోగులకు అందజేయాలని ఎంపీడీవోకు సూచించారు. 

  

రాజుపాలెంలో ఉద్రిక్తత

మండలంలోని రాజుపాలెంలో బుధవారం రాత్రి నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న ఓ వర్గాన్ని రెండో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పి.నాగేశ్వరరావు వర్గం నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న సమయంలో వారిని అడ్డుకునేందుకు కె.నాగమల్లేశ్వరరావు వర్గం అక్కడికి చేరుకుంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఇరువర్గాలను పిలిపించి బైండోవర్‌ కేసలు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జయకుమార్‌ తెలిపారు.  


బెదిరింపుల పర్వం

హోమంత్రి పాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజవర్గంలో సొంత పార్టీవారికే రక్షణ లేకుండా పోతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల వైసీపీ రెబల్‌గా నామినేషన్‌ వేయడానికి వెళుతున్న వారిపై ఓ వర్గం దాడి చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్‌ వేసిన రెబల్‌ వర్గంపై ఇప్పుడు బెదిరింపుల పర్వం ప్రారంభమైంది. గురువారం పొలాలకు వెళ్లే నీటి పైపులను పగల గొట్టడమే కాకుండా నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటేనే పొలాల్లో పంట మీకు ఇచ్చేది అంటూ బెదిరించారు. పొలాల్లో ట్యూబులు, ఇంజన్లు పగలగొడుతున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారంతా పొలాలలో పడి పరారయ్యారు. గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ ప్రశాంతితో పాటు స్థానిక పోలీసుల వద్ద కర్నూతల వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. రాజీకి రావాలంటూ బెదిరిస్తున్నారని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 


రక్షణ కల్పించండి

తనకు రక్షణ కల్పించాలని సాతులూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఉడతా వెంకటేశ్వరరావు నరసరావుపేట డీఎస్పీకి విన్నవించారు. గ్రామంలో ఒక వర్గానికి చెందినవారు సర్పంచిగా పోటీ చేస్తున్నందున మద్దతు ఇస్తున్నానని వివరించారు.  తమపార్టీకి చెందిన కోటయ్య, ఆంజనేయులులు తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విన్నవించారు.

Updated Date - 2021-02-12T06:42:03+05:30 IST