పాలకవర్గం లేక అగచాట్లు

ABN , First Publish Date - 2021-05-10T04:49:07+05:30 IST

భద్రాచలం.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. నాలుగు రాష్ట్రాల ప్రధాన కూడలి.. రెవెన్యూ డివిజన్‌ కేంద్రం. అంతటి ప్రాధాన్యమున్న పట్టణ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం లేదు.

పాలకవర్గం లేక అగచాట్లు
భద్రాచలం పంచాయతీకార్యాలయం

కరోనా కష్టాలతో ప్రజల ఇబ్బందులు

భద్రాచలం, మే 9: భద్రాచలం.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. నాలుగు రాష్ట్రాల ప్రధాన కూడలి.. రెవెన్యూ డివిజన్‌ కేంద్రం. అంతటి ప్రాధాన్యమున్న పట్టణ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం లేదు. సుమారు 80 వేల జనాభా, 32 కాలనీలు, 11,700 ఇళ్లు ఉన్న భద్రాచలంలో 2018 ఆగస్టు ఒకటిన అప్పటి పంచాయతీ పాలకవర్గ పాలన గడువు ముగిసింది. నాటి నుంచి నేటి వరకూ ఎన్నికలు లేవు. అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో అన్ని పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, భద్రాచలంలో ఆ ఊసే లేదు. ఆ సమయంలో అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణ నుంచి భద్రాచలాన్ని తప్పించారు. ప్రతిపాదిత మునిసిపాలిటీ అనే పేరుతో నాటి నుంచి ప్రత్యేక అధికారి పాలన సాగుతుం డగా పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నెల రోజులుగా కరోనా వైరస్‌ రెండో విడత ఉధృతి నేపథ్యంలో భద్రాచలంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీడీఏ, భద్రాచలం రామాలయం ఇలా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, వ్యాపారులు కరోనా బారిన పడి ఇబ్బందుల పాలవుతున్నారు. ఇదే సమయంలో ప్రజల పరిస్థితి వర్ణనాతీతం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పాలకవర్గం ఉంటే బాగుండు అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. పంచాయతీ పాలకవర్గం లేకపోవడంతో ప్రజలు అగచాట్లు పడుతున్నారు.

పట్టించుకునే వారేరీ

భద్రాచలం అటు పంచాయతీ కాదు. ఇటు మునిసిపాలిటీ కాదు అసలు ఇంతకీ భద్రాచలం ఏంటో ఎవరికి తెలియని మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒక వైపు పాలక మండలి లేకపోవడంతో ప్రజలకు కరోనా వేళ పూర్తిస్థాయిలో పారిశుధ్య చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే ప్రజలను అప్రమత్తం చేసే పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయనే వ్యాఖ్యలు రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. రూ.2.60 కోట్ల ఆదాయం ఇంటి పన్నుల ద్వారా వస్తుండగా, ఆశీలు, సంత, ఫెర్రీ ద్వారా రూ.60 లక్షల ఆదాయం సమకూరుతోంది. అయితే రెండేళ్లుగా ఆశీలు, సంత, ఫెర్రీ వేలం పాట నిర్వహించగా ఎవరు ఆసక్తి కనబరచలేదని పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే భద్రాచలంకు దాదాపు రూ.3.20 కోట్ల ఆదాయం వస్తున్నా అందుకు తగినట్లుగా అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ప్రతిపాదిత మునిసిపాలిటీగా పేర్కొంటున్న భద్రాచలానికి ప్రత్యేక అధికారిగా సబ్‌కలెక్టర్‌ వ్యవహరిస్తారు. గత ఏడాదిగా సబ్‌కలెక్టరు పోస్టు ఖాళీగా ఉండటంతో అదనపు కలెక్టర్‌ వెంక టేశ్వర్లు సబ్‌కలెక్టరు, ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించే డివిజ న్‌స్థాయి అధికారి లేకపోవడం లోపంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


Updated Date - 2021-05-10T04:49:07+05:30 IST