నిధుల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-09-20T06:28:19+05:30 IST

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 1,240 పంచాయతీలు ఉన్నాయి.

నిధుల్లేవ్‌!

పల్లెల్లో స్వచ్ఛత సాధ్యమేనా?

నిధులు నిల్‌.. అజెండా పుల్‌ 

పంచాయతీల్లో అక్టోబర్‌ 2 వరకు స్వచ్ఛతా హే సేవ కాక్యక్రమాలు

గ్రామ పంచాయతీల్లో ఖజానా ఖాళీ

ఎప్పటికప్పుడు ఊడ్చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

నిధులు లేకుండా పనులెలా అంటున్న సర్పంచులు

తూతూమంత్రంగా స్వచ్ఛత కార్యక్రమాలు

 

పంచాయతీల ఖజానా ఖాళీగా ఉంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎప్పటికప్పుడు రాష్ట్రం ప్రభుత్వం మళ్లిస్తుండడంతో ఖాతాల్లో చిల్లిగవ్వ లేదు. మరోవైపున పంచాయతీల్లో అక్టోబరు రెండు వరకు స్వచ్ఛత హే సేవ కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వచ్ఛసంకల్పం పేరుతో గ్రామాల్లో రోడ్లను శుభ్రపర్చటం, డ్రైనేజీలు మరమ్మత్తులు చేయటం, వీధులు వెంట చెత్తాచెదారం తొలగించటతోపాటు శానిటేషన్‌ పనులు ముమ్మరం చేయాలని ఆదేశిస్తున్నారు. అసలు నిధులే లేకుండా ఇవన్నీ ఎలా చేయాలని పంచాయతీ సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. మూడురోజుల కిందట ప్రారంభమైన సచ్ఛతా హే సేవ కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. బ్యానర్లతో ర్యాలీలు చేసి  మమ అనిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

గుంటూరు, సెప్టెంబరు 18: ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 1,240 పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటిలో ఈ నెల 16వ తేదీ నుంచి అక్టోబరు 2న గాంధీజయింతి రోజు వరకు స్వచ్ఛత హే సేవ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా  గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, ప్లాస్టిక్‌ నిషేదం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి పలు కార్యక్రమాలను చేపట్టాలని తెలిపింది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఆదేశాలు అందాయి. అసలు పంచాయతీల నిధుల అంశాలను ప్రస్తావించకుండా గాంధీజయంతి వరకు నిత్యం కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించటంపై సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొతడబ్బుతో చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ అలా చేస్తే ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు.


నిధులు లేకుండా ఎలా..? 

గ్రామపంచాయతీల్లో నిధులు నిండుకున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘ నిధులు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించటంతో ఖాతాలు ఖాళీ అయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతలలో గుప్పెడు మట్టిపోయాలన్న సర్పంచ్‌లకు తిప్పలు తప్పటంలేదు. స్వచ్ఛసంకల్పం పేరుతో గ్రామాలలో రోడ్లు శుభ్ర పర్చటం, డ్రైనేజిలు మరమ్మత్తులు చేయటం, వీదులు వెంట చెత్తాచెదారం తొలగించటతోపాటు శానిటేషన్‌ పనులు ముమ్మరం చేయాలని పెద్దఎత్తున అజెండా పెట్టి ఆదేశిస్తున్నారు. వీటిని చూచి ఏమి చేయాలో తెలియక పంచాయతీ సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల మండలాల్లో 59 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులు కంటికి కనిపించటంలేదు. దీర్ఘకాలిక సమస్యలు సైతం ఎక్కిరిస్తున్నాయి. రెండునెలల నుంచి కురుస్తున్న వర్షాలతో గ్రామాలలో పారిశుధ్యం పడకేసింది. అనేక గ్రామాలు మురికి కూపాలుగా మారాయి. డ్రైనేజిలు పూడిపోయాయి. మరమ్మతులు చేయటానికి గ్రామ పంచాయతీలో నిధులు లేవు.    


 పెనుభారంగా సచివాలయ వ్యవస్థ

సచివాలయాలు ఏర్పడిన దగ్గరి నుంచి వాటి నిర్వహణ బాధ్యత కూడా పంచాయతీలే  చేయాల్సి వస్తోంది. దీనివల్ల ప్రతి నెల మైనర్‌ పంచాయతీ అయితే రూ.8 వేల నుంచి రూ.10వేలు, మేజర్‌ పంచాయతీ అయితే రూ.10 వేల నుంచి రూ.20వేలు ఖర్చుచేయాల్సి వస్తుందని  పంచాయితీల సర్పంచులు కొందరు వాపోతున్నారు. గతంలో పంచాయితీలకు వివిధ రూపాలుగా నిధులు సమకూరేవి. నీటి తీరువా, స్టాంపుడ్యూటీ, ఇసుక సీనరేజ్‌ సొమ్ములను ప్రభుత్వం పంచాయతీలకు జమచేసేది.  కొంతకాలంగా అవి పంచాయితీలకు జమ కావటంలేదు. దీనివల్ల పంచాయితీలకు అదనపు భారం పడుతోంది.

  

  పారిశుధ్య లోపంతో విజృంభిస్తున్న జ్వరాలు 

మరోవైపున పారిశుధ్య నిర్వహణ లోపంతో దోమలు పెరిగిపోతున్నాయి. విషజ్వరాలు విజృంభించి వేలాది మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిధులు లేకపోవడంతో దోమల నివారణ మందులు కూడా పిచికారీ చేయలేని పరిస్థితుల్లో పంచాయితీ కార్యాలయాలు ఉన్నాయి. స్వచ్ఛ గ్రామాలుగా గ్రామాలను తీర్చిదిద్దడానికి గ్రామాల్లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్లను గతంలో పెద్ద ఎత్తున నిర్మించారు. ఆ షెడ్ల నిర్వహణే నిధుల లేమితో మూలనపడింది. గ్రామాల్లో చెత్త సేకరిస్తున్నప్పటికీ నిధుల లేమి వల్ల సెక్రిగేషన్‌ చేయలేక చెత్త, చెదారాలను రహదారులవెంటే విడిచి పెడుతున్నారు. 


గుంటూరు జిల్లాలో..

 తెనాలి మండంలంలోని 18 పంచాయతీల్లో స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. అధికారులు మాత్రం పంచాయతీల్లో స్వచ్ఛకార్యక్రమాలపై రివ్యూలు పెట్టి జరుగుతున్న పనులను రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశాలు ఇస్తున్నారు. నిధులు లేవని చెప్పిన వారి మాటలు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిధులు విడుదల అయితేనే తప్ప కనీసం గడ్డిమందుకూడా కొట్టించలేని పరిస్థితుల్లో మండలంలోని పలు పంచాయతీలు ఉన్నాయి. కొన్నిచోట్ల బ్యానర్లు పట్టుకుని ఫొటోలు తీసుకుని యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలతోపాటు నగరపాలక సంస్థ విలీన గ్రామాలలో కార్పొరేషన్‌ ఆధ్వర్యాన స్వచ్ఛత హే సేవ కార్యక్రమాలు నిర్వహించాల్సి వున్నా వాటి ఊసే లేదు. కనీసం మొక్కుబడిగానైనా ఇప్పటివరకు ఒక్క అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయలేదు.

 

పల్నాడులో..

నరసరావుపేట నియోజకవర్గంలోని పంచాయతీలలో స్వచ్ఛతా హే సేవా కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.  మాచర్ల నియోజకవర్గంలో అదేపరిస్థితి. నిధులు లేకుండా ఎలా నిర్వహించాలని పాలకులు, అధికారులు ఆలోచనలో పడ్డారు. పలుచోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు.  మాచవరం మండలంలో అధికార పార్టీకి చెందిన సర్పంచులు రెండు రోజుల క్రితం రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖామంత్రిని కలిసి పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞాపనపత్రం అందించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈనెల 16వ తేదీ నుంచి పల్లెల్లో నిర్వహించాల్సిన స్వచ్ఛతహే సేవ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు.    స్వచ్ఛతా హే సేవ కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో చేపట్టిన కార్యక్రమాలు చిలకలూరిపేట నియోజకవర్గంలో మొక్కుబడిగా సాగుతున్నాయి.  

Updated Date - 2022-09-20T06:28:19+05:30 IST