పంచాయతీ కుదిరేనా?

ABN , First Publish Date - 2021-01-22T06:29:51+05:30 IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ముందుకు వెళ్లవచ్చని గురువారం తీర్పుచెప్పింది. ఈ నేపథ్యంలో మళ్లీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమ ల్లోకి వచ్చింది.

పంచాయతీ కుదిరేనా?
అమలాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో గతంలో సిద్ధం చేసిన బ్యాలెట్‌ బాక్సులు (ఫైల్‌ ఫొటో)

  పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

 ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలవడంతో మళ్లీ అమల్లోకి కోడ్‌

  ఫిబ్రవరి 5,9,13,17 తేదీల్లో విడతల వారీగా పోలింగ్‌

  ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ఎస్‌ఈసీ పిలుపు

  ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సందిగ్ధం

  ఏర్పాట్లకు ముందుకు వెళ్లాలా? వద్దో తేల్చుకోలేక   జిల్లా అధికారుల సతమతం


(కాకినాడ/అమలాపురం-ఆంధ్రజ్యోతి)పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ముందుకు వెళ్లవచ్చని గురువారం తీర్పుచెప్పింది. ఈ నేపథ్యంలో మళ్లీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమ ల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కొత్తగా ఎలాంటి పనులు చేపట్టకుండా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి జనవరి 8న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు విడుదల చేసింది. దీని ప్రకారం నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. జనవరి 23, 27, 31, ఫిబ్రవరి 4వ తేదీల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు వివరించింది. నామినేషన్ల దాఖలుకు జనవరి 27, 31, ఫిబ్రవరి 4, 8 తేదీలను ప్రకటించింది. పోలింగ్‌ నాలుగు దశల కింద ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. దీంతో జిల్లాలోను జనవరి 8 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్టయింది. దీనికి తగ్గట్టుగానే జిల్లా అధికారులు సైతం పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలు ఎవరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ మేరకు మండలాల స్థాయిలో ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఈలోపు పంచాయతీ ఎన్నికలకు వ్యతిరేకంగా జగన్‌ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణకు తాము సుముఖంగా లేమని వెల్లడించింది. దీంతో హైకోర్టు సింగిల్‌బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో జనవరి 11 నుంచి కోడ్‌ అమలు నిలిచిపోయింది. ఆతర్వాత సింగిల్‌బెంచ్‌ తీర్పును ఎస్‌ఈసీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. దీంతో  జిల్లాలో మళ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్టయింది. అయితే ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, తేదీల్లో ఎలాంటి మార్పులేదని ఎన్నికల కమిషనర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా గురువారం నాటి హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం గురువారం సాయత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి తాము సుముఖంగా లేమని, ఎన్నికలకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరింది. దీంతో మళ్లీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. 


తలపట్టుకుంటున్న అధికారులు...


హైకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్లాలా? రాష్ట్ర ప్రభుత్వం అయిష్టత నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లకు దూరంగా ఉండాలా? తేల్చుకోలేక జిల్లాలో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఈ మేరకు రాజధాని స్థాయిలో ఉన్న తాధికారులను సంప్రదిస్తున్నారు. మరోపక్క జిల్లా పంచాయతీశాఖ సైతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేపట్టాలా? వద్దా? అనేది తేల్చు కోలేకపోతుంది. ఏర్పాట్లు మొదలుపెడితే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. చేయకపోతే ఎన్నికల కమిషన్‌ నుంచి చర్యలు తప్పవేమోనని ఆందోళన చెందుతోంది. షెడ్యూల్‌ గడువు సమీపించేనాటికి ఏర్పాట్లు పూర్తికాకపోతే వేటు పడుతుందేమోనని ఆశాఖ అధికారులను గుబులు వేధిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచిచూద్దాం అనుకుంటే ఒకవేళ అనుకూలంగా తీర్పు వస్తే అప్పటికప్పుడు జిల్లాలోని 1,072 పంచాయతీలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ముందుకు వెళ్తే సర్కారుతో చిక్కు.. వెళ్లకపోతే ఎన్నికల కమిషన్‌తో ముప్పు ఉండడంతో తల పట్టుకుంటున్నారు. ఇదిలాఉంటే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు గతేడాది మార్చిలోనే జరగాల్సి ఉంది. మార్చి 27, 29 తేదీల్లో పోలింగ్‌ నిర్వహణకు తేదీలు కూడా ప్రకటించారు. కానీ కొవిడ్‌ ముప్పు నేపథ్యంలో ఎన్నికలు వాయిదాపడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించకుండా కమిషన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడంతో ప్రక్రియ కొలిక్కిరాలేదు. ఇప్పుడు హైకోర్టు నుంచి పచ్చజెండా లభించినా మళ్లీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో సందిగ్ధం నెలకొంది.


Updated Date - 2021-01-22T06:29:51+05:30 IST