హైదరాబాద్‌ కన్నా ముందు.. అమిత్‌ షా పేరులో ‘షా’ తీసేయాలి

ABN , First Publish Date - 2022-01-05T18:01:36+05:30 IST

హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులు, ముందుగా వాళ్ల జాతీయ నాయకుడు అమిత్‌ షా పేరులోని పార్శీ పదమైన ‘షా’ను తొలగించాలని చరిత్ర అధ్యయనకారుడు కెప్టెన్‌

హైదరాబాద్‌ కన్నా ముందు.. అమిత్‌ షా పేరులో ‘షా’ తీసేయాలి

         - భాగమతి ప్రేమ కథ.. ఒక కట్టు కథ: దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌


హైదరాబాద్‌: హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులు, ముందుగా వాళ్ల జాతీయ నాయకుడు అమిత్‌ షా పేరులోని పార్శీ పదమైన ‘షా’ను తొలగించాలని చరిత్ర అధ్యయనకారుడు కెప్టెన్‌ పాండురంగారెడ్డి సవాల్‌ విసిరారు. ఇస్లాం రాజుల ద్వారా మనుగడలోకి వచ్చిన షేర్వాణీ, కుర్తా, పజామాలను బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులు ధరించకూడదని అన్నారు. మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా నిర్మించిన నగరానికి మొదటి నుంచి హైదరాబాద్‌ అనే ఒక్క పేరే ఉందని అన్నారు. భాగమతి ప్రేమ కథ.. కట్టు కథ అనడానికి ప్రఖ్యాత చరిత్రకారుడు హరూన్‌ ఖాన్‌ షెర్వాణీ రచించిన ‘హిస్టరీ ఆఫ్‌ మిడీవల్‌ దక్కన్‌’ పుస్తకం ఒక ప్రధాన సాక్ష్యమని చెప్పారు. కుతుబ్‌షాహీల నాణేలలోనూ ఎక్కడా భాగ్యనగర్‌ పేరు కనిపించదని తెలిపారు. దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘హైదరాబాద్‌ ఫరెవర్‌.. ట్రుత్‌ వర్సెస్‌ మిత్‌’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాండు రంగారెడ్డి మాట్లాడారు. మహమ్మద్‌ కులీ రాసిన ‘కుల్లీయత్‌’ కవిత్వంలో తన పదిహేడు మంది భార్యల గురించి రాశాడని, అందులో ఎక్కడా భాగమతి పేరు కనిపించదని తెలిపారు. కుతుబ్‌షాహీల ఆస్థాన కవి సారంగు తమ్మయ్య రాసిన ‘వైజయంతి విలాసం’, భక్త రామదాసు రచనల్లోనూ భాగ్యనగర్‌ పేరు ప్రస్తావన ఉండదని చెప్పారు. నగరాన్ని అభివృద్ధి చేస్తామనడానికి బదులు పేర్లు మారుస్తామంటూ బీజేపీ మాట్లాడటం సరికాదని పాండురంగారెడ్డి విమర్శించారు. మహమ్మద్‌ కులీ నిర్మించిన హైదరాబాద్‌ నగరానికి భాగ్యనగర్‌ పేరు పెడతామనడం అన్యాయమన్నారు. మహమ్మద్‌ కులీ.. భాగమతి అనే మహిళను ప్రేమించి, పెళ్లాడాడని రాసిన పౌజీ, నిజాముద్దీన్‌, ఫెరిస్తాలు ఎన్నడూ నగరాన్ని సందర్శించలేదనడానికి చారిత్రక ఆధారాలున్నాయని సీనియర్‌ జర్నలిస్టు కింగ్‌షుక్‌ నాగ్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-05T18:01:36+05:30 IST