పన్నీరు–కన్నీరు

ABN , First Publish Date - 2022-06-24T07:13:08+05:30 IST

తమిళనాట అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీకి అత్యున్నతస్థాయిలో ఏకనాయకత్వం విషయమై పదిరోజులుగా పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న...

పన్నీరు–కన్నీరు

తమిళనాట అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీకి అత్యున్నతస్థాయిలో ఏకనాయకత్వం విషయమై పదిరోజులుగా పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు ఏకంగా దాడుల దశకు చేరుకుంది. గురువారం అన్నాడీఎంకె సర్వసభ్యసమావేశంలో వేదికమీద ఉన్న పన్నీరుకు వ్యతిరేకంగా పళనివర్గీయులు నినాదాలు చేయడం, వాటర్ బాటిల్ విసరడంతో పన్నీరు సమావేశం నుంచి నిష్క్రమించవలసి వచ్చింది. ఈ పరిణామాలు చూస్తుంటే, శశికళను ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీలోకి రానివ్వకుండా ఆమె రహస్యపన్నాగాలను తిప్పికొట్టాలని పదిరోజుల క్రితమే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వీరిద్దరూ చివరకు ఆమెకే దారులుపరిచేట్టు కనిపిస్తున్నది.


అధికారంలో ఉన్నన్నాళ్ళూ కలసికట్టుగా పనిచేసుకున్న వీరిద్దరూ అధికారాంతమున ఇలా కాట్లాడుకోవడం విచిత్రం. ఏంజీఆర్, జయలలిత హయాంలో మాదిరిగా పార్టీకి ఏకనాయకత్వం కావాలన్న తీర్మానానికి పళనిస్వామి వర్గం సంకల్పిస్తుండటంతో, ఈ సమావేశం జరగకుండా ఉండేందుకు పన్నీరుసెల్వం అనేక ప్రయత్నాలు చేశారు. ఈ భేటీకి అనుమతి ఇవ్వవద్దని ఆయన పోలీసులకు విజ్ఞప్తిచేశాడు. ఆ తరువాత హైకోర్టును ఆశ్రయిస్తే, ఇది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమైనప్పుడు తీర్మానాలు చేయవద్దని మేమెలా చెబుతామంటూ సింగిల్ జడ్జి తేల్చేశారు. మళ్ళీ అర్ధరాత్రి కోర్టుమెట్లు ఎక్కి ఓ చిన్న వెసులుబాటు మాత్రమే సాధించగలిగారు పన్నీరు. న్యాయస్థానం ఆదేశాలు పళని వర్గాన్ని ఈ దిశగా తీర్మానించకుండా నిరోధించగలిగాయి కానీ, ‘ఏక నాయకత్వం’ అంశంమీద వారంతా ప్రసంగాలు దంచకుండా ఆపలేకపోయాయి. పళని వర్గం ఎంతో బలంగా ఉంటే, పన్నీరు పక్షాన పదిమంది కూడా లేరన్న వాస్తవాన్ని ఈ సమావేశం తేల్చేసింది. పన్నీరు ఆమోదించిన 23 తీర్మానాలను ఏకమాటగా తిరస్కరించడం ద్వారా పార్టీ పగ్గాలు ఒక్కరి చేతుల్లోనే ఉండాలన్న తన వాదనకు మరింత బలాన్ని సాధించింది పళనివర్గం. ఏకనాయకత్వం లక్ష్యాన్ని వచ్చేనెల 11న జరిగే సమావేశంలో సాధించగలమన్న నమ్మకంతో పళనివర్గం ఉంది. ఆయనను ప్రధాన కార్యదర్శి కాకుండా పన్నీరు ఎలా నిరోధించగలరో చూడాలి.


పన్నీరు పక్షాన నలుగురు కూడా లేరని ఇక్కడి దృశ్యాలే చెబుతున్నాయి. ఒకప్పుడు ఆయనకు జేజేలు పలికినవారు ఇప్పుడు పళనికి దణ్ణాలు పెడుతున్నారు. జయలలితకు వీరవిధేయుడుగా మూడుమార్లు ముఖ్యమంత్రి అయిన పన్నీరు, ఆ తరువాత శశికళమీద తిరుగుబాటుచేసిన ఘట్టం తెలిసిందే. జయ సమాధి ముందు కూర్చుని కన్నీరు పెట్టుకుని ‘అమ్మ చెప్పింది’ అంటూ ఆయన తీసుకున్న నిర్ణయంతో రెండు వర్గాలు ఒక్కటైనాయి, శశికళను తరిమికొట్టడమూ సాధ్యపడింది. కానీ, ఐదేళ్ళ తరువాత పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమంత్రిగా ఉన్న తాను పార్టీ శ్రేయస్సు కోసం డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నానని పన్నీరు చెప్పుకుంటున్నారు కానీ, శశికళను అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు ఢిల్లీ పెద్దల రాజకీయంలో ఆయన పావుగా ఉపకరించారు. జయలలిత కన్నుమూసేటప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు, శశికళమీద తిరుగుబాటు చేసినందుకు ఆ పదవి పోగొట్టుకొని, ఆ తరువాత ఆమె ప్రతిష్ఠించిన పళనిస్వామితోనే రాజీపడటం ఓ విచిత్రం. పార్టీ సమన్వయకర్త పదవి ఉన్నందున ఈ మాత్రమైనా నిలబడ్డారు కానీ, ఈ ఐదేళ్ళలో పళనిస్వామి మరింత బలపడిన మాట వాస్తవం. అంగబలం, అర్థబలం, నిన్నటివరకూ ముఖ్యమంత్రిగా ఉండటంవంటి అంశాలతో పాటు, పళనికి సమర్థ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అంటారు. పన్నీరు లాగా బీజేపీ ముందు సాగిలబడినట్టు కనిపించకుండా జాగ్రత్తపడేవారు కూడా. అప్పట్లో పన్నీరును ముందుపెట్టి జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాలను కలగాపులగం చేసిన బీజేపీ ఇప్పుడు ఆయనను కాపాడుతుందని అనుకోనక్కరలేదు. అన్నాడీఎంకె జనరల్ కౌన్సిల్ భేటీ ఇలా రసాభాసగా ముగిసిన వెంటనే బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మరో సీనియర్ బీజేపీ నేతతో కలిసి ఎళప్పాడి పళనిస్వామిని కలుసుకున్నారు. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా తాము నిలబడుతున్న ద్రౌపది ముర్మును దేశాధ్యక్షపీఠంమీద కూచోబెట్టడంలో అన్నాడీఎంకె సహాయాన్ని అర్థించారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎప్పుడు వంచాలో, ఎలా తుంచాలో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు.

Updated Date - 2022-06-24T07:13:08+05:30 IST