నిశ్శబ్ద మహమ్మారి

ABN , First Publish Date - 2020-12-29T19:05:30+05:30 IST

మానవాళికి అత్యంత ప్రాణాంతకమైన కేన్సర్లలో పాంక్రియాటిక్‌ (క్లోమ గ్రంథి) కేన్సర్‌ ఒకటి. నిజానికి, పాంక్రియాటిక్‌ కేన్సర్‌ నిర్ధారణ అయిన వారిలో సుమారు 70-75 శాతం మంది

నిశ్శబ్ద మహమ్మారి

ఆంధ్రజ్యోతి(29-12-2020)

మానవాళికి అత్యంత ప్రాణాంతకమైన కేన్సర్లలో  పాంక్రియాటిక్‌ (క్లోమ గ్రంథి) కేన్సర్‌ ఒకటి. నిజానికి, పాంక్రియాటిక్‌ కేన్సర్‌  నిర్ధారణ అయిన వారిలో సుమారు 70-75 శాతం మంది ఒక ఏడాదిలోనే మరణిస్తున్నారు.  5 శాతం మంది మాత్రమే అయిదేళ్ళ వరకూ మనుగడ సాగించగలుగుతున్నారు.  అధునిక చికిత్సలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ యాపిల్‌ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ క్లోమ గ్రంథి కేన్సర్‌తో మరణించారంటే ఈ కేన్సర్‌ ఎంతటి ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.


క్లోమ గ్రంథి అంటే ఏమిటి? ఎక్కడ ఉంటుంది? అది చేసే పనులేమిటి?

కాలేయం మాదిరిగానే, క్లోమ గ్రంథి కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ ట్రాక్ట్‌ (జీర్ణాశయాంతర పేగు)లో అత్యంత ముఖ్యమైన ఒక అవయవం. అది పొట్ట వెనుక, పొత్తి కడుపు పై సగభాగంలో ఉంటుంది. అది చేసే ప్రధానమైన పనులు రెండు. ఆహారం జీర్ణం కావడానికి ఎంతో కీలకమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, తగిన చక్కెర స్థాయిలను నిర్వహిస్తూ, మధుమేహ వ్యాధి నివారణలో కీలకమైన ఇన్సులిన్‌, గ్లూకగాన్‌ లాంటి హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తుంది.


క్లోమ గ్రంథి కేన్సర్‌ ఎందుకింత ప్రమాదకారి?

స్వభావరీత్యా క్లోమ గ్రంథి చాలా ప్రమాదకరమైనది. అందుకే ఈ కేన్సర్‌ నిశ్శబ్దంగా చంపే మహమ్మారి. 90 శాతానికి పైగా కేసుల్లో రోగుల్లో లక్షణాలు బయటపడి, వైద్యుడి దగ్గరకు వచ్చేసరికే అది అడ్వాన్స్‌డ్‌ స్టేజికి వచ్చేస్తుంది. దీన్ని నయం చేసే చికిత్సలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. ఈ వ్యాధిలో ఆకలి లేకపోవడం, ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలున్నప్పటికీ, అవి అంత నిర్దిష్టంగా కనిపించవు. అలాగే పొట్ట వెనకాల క్లోమ గ్రంథి ఉండడంతో, ప్రామాణికమైన పరీక్షల ద్వారా దాన్ని చూడడం కష్టమవుతుంది. స్వభావరీత్యా ఇది సైలెంట్‌ కిల్లర్‌ కావడం, నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం, అది ఉండే ప్రదేశం, అత్యంత ప్రాణాంతకమైన కేన్సర్‌ కణాలూ... ఇవన్నీ కలిసి దీన్ని అత్యంత ప్రమాదకరమైన కేన్సర్‌గా మారుస్తున్నాయి.


ఇవీ లక్షణాలు

రోగిలో తరచుగా లక్షణాలు కనిపించేసరికే ఈ కేన్సర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉంటుంది. హఠాత్తుగా ఆకలి తగ్గిపోవడం, ఏ కారణం లేకుండా బరువు తగ్గడం, పచ్చకామెర్లు, పొత్తికడుపులో మందకొడిగా తేలికపాటి నొప్పి, వాంతులు, కాళ్లలో, ఊపిరితిత్తుల్లో గడ్డలు, పొత్తికడుపులో, కాళ్ళలో నీరు చేరడం లాంటివి సాధారణమైన లక్షణాలు.


రిస్క్‌ ఎవరికంటే...

ఈ కేన్సర్‌ అభివృద్ధి అయితే తలెత్తే కచ్చితమైన రిస్క్‌ల గురించి సైన్స్‌ ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉంది. అయితే ప్రమాదకారులుగా గుర్తించిన అంశాలు అనేకం ఉన్నాయి. పొగ తాగేవారిలో ఈ కేన్సర్‌ పెరిగే రిస్క్‌ కనీసం యాభై శాతం ఎక్కువ. అలాగే మద్యపానం వల్ల దాదాపు ఇరవై నించి ముప్ఫై రెట్లు రిస్క్‌ గణనీయంగా పెరుగుతుంది. స్థూలకాయం, రెడ్‌ మీట్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, ఫ్యాటీ ఫుడ్స్‌ లాంటి కొన్ని నిర్దిష్టమైన ఆహారాలు తీసుకోవడం లాంటివి జీవన శైలికి సంబంధించిన ఇతర రిస్క్‌ అంశాలుగా గుర్తించారు. క్రానిక్‌ ప్రాంకియాటైటిస్‌ (దీర్ఖకాలిక ఇన్‌ఫ్లమేషన్‌) ఉన్న వారికి క్లోమ గ్రంథి కేన్సర్‌ రిస్క్‌ పెరుగుతుంది, వారు కచ్చితంగా గ్యాస్ట్రోఎంటరాలజిస్స్‌ నిశిత పర్యవేక్షణలో ఉండాలి.


అలాగే మధుమేహం ఉన్న వ్యక్తుల్లో కూడా క్లోమ గ్రంథి కేన్సర్‌ అభివృద్ధి చెందే రిస్క్‌ ఎక్కువ. ప్రపంచ మధుమేహ రాజధాని అయిన భారతదేశంలో మధుమేహ రోగులను ఈ విషయంలో జాగ్రత్తగా పర్యవేక్షించడం ముఖ్యం. వీటితోపాటు, కనీసం 10 జీన్స్‌ను క్లోమ గ్రంథి కేన్సర్‌ కారకాలుగా గుర్తించారు, ఒకవేళ క్లోమగ్రంథి కేన్సర్‌కు సంబంధించి కుటుంబ చరిత్ర బలంగా ఉన్నట్టయితే, యుక్త వయసులో కచ్చితంగా వారు జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి.


నిర్ధారించుకోవడం ఎలా?

క్లోమ గ్రంథి ఉన్న ప్రదేశం కారణంగా ప్రామాణికమైన అలా్ట్రసౌండ్‌లో ఈ కేన్సర్‌ తరచూ కనిపించకుండా ఉంటుంది, కాబట్టి వైద్యపరమైన సందేహాల సూచీ, జాగ్రత్తగా స్కానింగ్‌ చెయ్యడం అనేవి ఈ కేన్సర్లను కనుక్కోడానికి ముఖ్యం. సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, ఎండోస్కోపిక్‌ అలా్ట్రసౌండ్‌ (ఇంటర్నల్‌ అలా్ట్రసౌండ్‌) అనే అత్యంత అధునిక ఎండోస్కోపీ (నోటిలోంచీ కెమేరా పెట్టి చేస్తారు) లాంటి అనేక పరీక్షలు ఈ కేన్సర్‌నూ, వ్యాధి దశనూ తెలుసుకోవడానికి సాయపడతాయి. ఈ కేన్సర్‌ను నిశ్చయంగా కనుక్కోడానికి నిర్దిష్టమైన రక్త పరీక్షలేవీ లేవు. కేన్సర్‌ను నిర్ధారణ చేయడానికి ఎండోస్కోపిక్‌ అలా్ట్రసౌండ్‌ ఉపయోగించి, తరచూ ఒక బయాప్సీ (కణజాలం నమూనా)ను తీసుకుంటారు.


కేన్సర్‌ ఉందని తెలిస్తే ఏం చెయ్యాలి?

ఇతర కేన్సర్ల మాదిరిగానే బయాప్సీ ద్వారా ఈ కేన్సర్‌ను నిర్ధారించిన తరువాత, తదుపరి చర్య వ్యాధి దశను గుర్తించడం. వ్యాధి దశ (దశ 1-4) మీద ఆధారపడి, అత్యుత్తమ ఫలితాలిచ్చే చికిత్సా పద్ధతులను మేము రూపొందిస్తాం. దీన్ని తరచూ పెట్‌ స్కాన్‌, ఎండోస్కోపిక్‌ అలా్ట్రసౌండ్‌ లాంటి తదుపరి స్కాన్ల ద్వారా జరుగుతుంది, కేన్సర్‌ కేవలం క్లోమ గ్రంథి దగ్గరే ఉందా లేదా క్లోమ గ్రంథి బయట ఉందా, లేదా కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు లేదా ఎముకల్లాంటి ఇతర అవయవాలకు వ్యాపించిందా అనేది వీటివల్ల తెలుస్తుంది. 


అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులు...

ఏ కేన్సర్‌ చికిత్సకైనా ప్రధాన లక్ష్యం తక్కువ సైడ్‌ ఎఫెక్ట్స్‌తో కేన్సర్‌ కణాలను నిర్మూలించడం, అదే సమయంలో నాణ్యమైన జీవనాన్ని కొనసాగించడం. కానీ దురదృష్టవశాత్తూ క్లోమ గ్రంథి కేన్సర్‌ రోగుల్లో వాళ్ళు వైద్యుల దగ్గరకు వచ్చే సమయానికి, కేన్సర్‌ అప్పటికే అడ్వాన్స్‌డ్‌ దశల్లో ఉంటుంది, చికిత్సా అవకాశాలు చాలా పరిమితం. ఒకవేళ తొలి దశల్లోనే వాళ్ళు వచ్చినట్టయితే, వారు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


తొలి దశల్లోని చికిత్సా పద్ధతుల్లో, అన్ని కేన్సర్‌ కణాలనూ తొలగించే శస్త్ర చికిత్స (క్యూరేటివ్‌ ఇంటెట్‌ సర్జరీ) కూడా ఉంటుంది. ఒకవేళ వ్యాధి స్టేజ్‌ 2లో వచ్చినట్టయితే, కణితిని తగ్గించడం కోసం కొన్నిసార్లు కీమోథెరపీ అందిస్తారు, తరువాత క్యూరేటివ్‌ సర్జరీతో దాన్ని తొలగిస్తారు. ఒకవేళ చివరి దశల్లో (దశలు 3, 4) వచ్చినట్టయితే, కీమోథెరపీ, కొన్ని సార్లు రేడియోథెరపీతో సహా చికిత్సా ఎంపికలు ఉన్నాయి. ఈ దశలో చికిత్స లక్ష్యాలు వ్యాధిని పరిమితం చేయడం, తక్కువ సైడ్‌ ఎఫెక్ట్స్‌తో జీవిత కాలాన్ని పొడిగించడం. 


నిరోధించడం ఎలా?

ఈ ప్రాణాంతకమైన కేన్సర్‌ను నియంత్రించడం కోసం ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకోవడం, ధూమపానాన్ని మానెయ్యడం, సిఫార్సు చేసిన పరిమితుల్లోనే మద్యపానం చేయడం (మద్యపానం చేయకపోవడం మంచిది), క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మధుమేహం ఉన్న వ్యక్తులు చక్కెర స్థాయిలను  నియంత్రించుకోవడంతో పాటు, ఈ కేన్సర్లు ఉన్నాయేమో తెలుసుకోడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా స్కాన్‌ చేయించుకోవడం కోసం తమ వైద్యుణ్ణి సంప్రతించాలి, వీలైనంత వరకూ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ పర్యవేక్షణలో ఉండాలి. క్లోమ గ్రంథి కేన్సర్‌ విషయంలో కుటుంబ చరిత్ర ఉన్న వ్యక్తులు కచ్చితంగా ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ పర్యవేక్షణలో ఉండాలి. దీనితోపాటు, పైన చెప్పిన లక్షణాలు ఉన్నాయేమో గమనిస్తూ ఉండాలి. 2-3 వారాలకన్నా ఎక్కువకాలం ఏ లక్షణాలైనా ఉంటే, వాళ్ళు వైద్యుడిని కలవాల్సిన అవసరం ఉంది.


చివరిగా చెప్పేదేమిటంటే, అత్యంత ప్రాణాంతకమైన కేన్సర్లలో క్లోమ గ్రంథి కేన్సర్‌ ఒకటి, ప్రపంచవ్యాప్తంగా సర్వైవల్‌ రేట్లు చాలా తక్కువ, ఇది ఉన్నట్టు గుర్తించాక ఒక ఏడాది లోపలే 75 శాతం మందికి పైగా మరణిస్తున్నారు. వారిలో తరచూ ఎలాంటి లక్షణాలూ ఉండవు, రోగులకు లక్షణాలు కనిపించే సమయానికి, అప్పటికే అది అడ్వాన్స్‌డ్‌ స్టేజిలో ఉంటుంది. అయితే, తొలి దశల్లోనే దీన్ని గుర్తిస్తే, నయమయ్యే శాతాలు ఉత్తమంగా ఉన్నాయి.


ఈ కేన్సర్ల విషయంలో విజయవంతమైన ఫలితాలకు కీలకం ఆరోగ్యవంతమైన జీవనశైలి కలిగి ఉండడం, ధూమపానం, మద్యపానం మానెయ్యడం, రెగ్యులర్‌గా స్కానింగ్‌ చేయించుకోవడం. మధుమేహం, క్రానిక్‌ పాంక్రియాటైటిస్‌, క్లోమ గ్రంథి కేన్సర్‌ కుటుంబ చరిత్ర ఉన్నవారు క్లోమ గ్రంథి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వైద్యుడి ద్వారా జాగ్రత్తగా పర్యవేక్షణ పొందాలి.


పాంక్రియాటిక్‌ కేన్సర్‌ను నియంత్రించడం కోసం ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకోవడం, ధూమపానాన్ని మానెయ్యడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మధుమేహం ఉన్నవారు చక్కెర స్థాయిలను  నియంత్రించుకోవడంతో పాటు, ఈ కేన్సర్‌ ఉందేమో తెలుసుకోడానికి తరచూ స్కాన్‌ చేయించుకోవడం కోసం తమ వైద్యుణ్ణి సంప్రతించాలి.


డాక్టర్‌ నవీన్‌ పోలవరపు

సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌.

అపోలో హాస్పిటల్స్‌, 

జూబ్లీ హిల్స్‌,

హైదరాబాద్‌.

ఫోన్‌ నెంబర్లు: 7382778899, 8008541111


Updated Date - 2020-12-29T19:05:30+05:30 IST