నూతన సంవత్సరాదిలో పన్ను పోటు

ABN , First Publish Date - 2021-12-22T04:58:59+05:30 IST

కూడు, గూడు, గుడ్డ అన్నది మహాత్మా గాంధీజీ సిద్ధాంతం. స్వతంత్ర భారతంలో ప్రతి పౌరుడికి ఈ మూడు అందాలన్నది గాంధీ సిద్ధాంతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోకి రాకముందు వరకు వస్త్ర పరిశ్రమ సాఫీగానే నడిచింది.

నూతన సంవత్సరాదిలో   పన్ను పోటు

వస్త్ర, చెప్పుల పరిశ్రమలపై జీఎస్టీ పిడుగు

5 నుంచి 12 శాతం పెంపునకు కేంద్రం నిర్ణయం

అమలైతే సంక్షోభం తప్పదంటున్న వ్యాపారులు


కరోనా అన్ని రంగాలనూ చిదిమేసింది. ఇది చాలదన్నట్టు ఆనలైన వ్యాపారం మరింత కుంగదీసింది. ముఖ్యంగా వస్త్ర, చెప్పుల పరిశ్రమలు కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. అయినా తేరుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఆ రంగ వ్యాపారులపై నూతన సంవత్సరాదిలో మరో పిడుగు పడనుంది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎ్‌సటీని జనవరి నుంచి 12 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తమపై తీవ్ర ప్రభావం పడుతుందని, 30 శాతం దుకాణాలు మూతపడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నెల్లూరు (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 21 : కూడు, గూడు, గుడ్డ అన్నది మహాత్మా గాంధీజీ సిద్ధాంతం. స్వతంత్ర భారతంలో ప్రతి పౌరుడికి ఈ మూడు అందాలన్నది గాంధీ సిద్ధాంతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోకి రాకముందు వరకు వస్త్ర పరిశ్రమ సాఫీగానే నడిచింది. ఆ తర్వాత జీఎ్‌సటీ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ రంగానికి ఆటుపోట్లు మొదలయ్యాయి. అప్పటివరకు వస్త్ర రంగం పన్నులకు దూరంగా ఉండేది. జీఎ్‌సటీ వచ్చిన తరువాత తొలిసారిగా 5శాతం పన్ను అమలులోకి తెచ్చారు. దీనిని వస్త్ర వ్యాపారులు ఎంత వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. జీఎ్‌సటీ కారణంగా చిన్నా చితక దుకాణాలు మూతపడ్డాయి. ఆ తరువాత ఈ రంగాన్ని కరోనా దారుణంగా దెబ్బతీసింది. రెండు విడతల కరోనాలో సుమారు 12 నెలలకుపైగా దుకాణాలు మూతపడ్డాయి. ఈ కాలంలో షాపుల అద్దెలు, సిబ్బంది జీతభత్యాలు, కరెంటు చార్జీలు, పెట్టుబడులపై వడ్డీలు ఇవన్నీ పెనుభారం కావడంతో చిన్న, మధ్య తరహా దుకాణాలు సుమారుగా 30 శాతం వరకు మూతపడ్డాయి. రెండో విడత కరోనా తరువాత ఇప్పుడిప్పుడే దుకాణాలు తెరుస్తుండగా ఇప్పుడు జీఎ్‌సటీ పెంపు నిర్ణయం ఈ రంగాలపై పిడుగులా పడింది. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమపై ఐదు శాతం జీఎ్‌సటీ అమలులో ఉంది. ప్రస్తుత పన్ను విధానంలో మార్పు తీసుకొచ్చి జీఎ్‌సటీని 12 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకుంది. పత్తి నుంచి వస్త్రం తయారయ్యే వరకు మూడు దశలు ఉంటాయి. మొదటిది పత్తి. ఆ తరువాత పత్తి నుంచి నూలును తీస్తారు. ఈ రెండింటిని ముడిసరుకు అంటారు. దీని తరువాత దశ గ్రే. అంటే వస్త్రా తయారీకి మధ్యస్థ దశ. వస్త్ర తయారీ పరిశ్రమలు ఈ గ్రేను తెచ్చి పూర్తిస్థాయి వస్త్రంగా తయారు చేస్తాయి. ప్రస్తుతం ఈ దశలన్నింటిపైనా ఒకేవిధంగా 5 శాతం జీఎ్‌సటీ అమలులో ఉంది. కొత్తగా మార్పులు చేయబోయే విధానంలో గ్రేపై మాత్రం 12 శాతం జీఎ్‌సటీ పెంచనున్నారు. పెరిగిన ఈ పన్నును ఉత్పత్తులపై పెంచుతారు. దీనివల్ల సరుకు ధర పెరుగుతుంది. చివరికి ఆ ఫలితం వినియోగదారుడిపైనే పడుతుంది. అసలే కరోనా కారణంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు ఆనలైన బిజినెస్‌ దుకాణాల వ్యాపారాన్ని దెబ్బకొడుతోంది. ఈ తరుణంలో జీఎ్‌సటీ 12 శాతానికి పెంచితే వస్త్ర పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ పడుతుంది. చెప్పుల పరిశ్రమ పరిస్థితి కూడా ఇంతే. జిల్లా వ్యాప్తంగా సుమారు చిన్న పెద్ద కలిపి 2వేలకుపైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. కరోనా ప్రభావంతో నష్టాలను తట్టుకోలేక 30 శాతానికి పైగా చిన్న, మధ్య తరహా షాపులు మూతపడ్డాయి. ఇప్పుడు జీఎ్‌సటీ 12 శాతానికి పెంచితే మరిన్ని షాపులు మూతపడే ప్రమాదం లేకపోలేదని వ్యాపారులు అంటున్నారు. జిల్లాలో ఈ వ్యాపారాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో చాలా మంది జీవనోపాధి కోల్పోవలసి వస్తుందనే ఆవేదనలు వ్యాపార వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. చెప్పులపై కూడా జీఎస్టీ పెంచడాన్ని ఆ వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారులపైనే కాదు.. అన్ని వర్గాల ప్రజలపై కూడా ఇది ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు.



వస్త్ర వ్యాపారం కుదేలే!


5 నుంచి 12శాతానికి జీఎస్టీ పెంపు వల్ల వస్త్ర వ్యాపారం కుదేలవుతుంది. పేద మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడి వస్త్రం కొనుగోలు మరింత ప్రియమయ్యే ప్రమాదముంది. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆఽధారపడి జీవించే లక్షలాదిమంది ఉపాధి కోల్పోయే అవకాశమూ ఉంది. ఇప్పటికే పత్తి కొనుగోలు దగ్గర నుంచి వస్త్రం తయారయ్యే వరకు వివిధ దశల్లో వివిధ రకాలుగా జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఈ నెల 14న ఢిల్లీలో వస్త్ర వ్యాపార ప్రముఖులు సమావేశమై 12శాతం జీఎస్టీ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాం. లేనిపక్షంలో దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాం

- అమరా వెంకట సుబ్బారావు, మెంబర్‌ ఆఫ్‌ ఏపీ గ్రీవెన్స రీడ్రస్సెల్‌ కమిటీ సెంట్రల్‌ జీఎస్టీ

 


పునరాలోచించాలి 


ఓ పక్క కరోనా ప్రభావం.. మరోపక్క ఆనలైన వ్యాపారం వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ పెంపు మరింత ప్రభావం పడుతుంది. మా ఇబ్బందులను అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం  జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని పునరాలోచించాలి. 

- మాడరన నరసింహరావు, వస్త్ర వ్యాపారి, కావలి



వినియోగదారులపై ప్రభావం

వస్త్రాలపై ఒక్కసారిగా 12శాతం జీఎ్‌సటీ పెంచడం వినియోగదారులకు పెనుభారం అవుతుంది. ఇప్పటివరకు నూలుపై 12శాతం, వస్త్రాలపై 5శాతం జీఎస్టీ ఉంది. తాజాగా వస్త్రాలపై 12 శాతానికి పెంచడం చాలా బాధాకరం. వస్త్ర వ్యాపారంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. 

- భయ్యా శ్రీనివాసులు, వస్త్ర వ్యాపారి, నెల్లూరు


  

చెప్పులపై 5శాతమే జీఎ్‌సటీ ఉండాలి

పేదలు వాడే చెప్పులపై 12 శాతం జీఎ్‌సటీ పెంచడం  దారుణం. రెండేళ్లుగా కరోనాతో వ్యాపారాలు పడిపోయి  ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు, పేదలపై  ఇలాంటి భారం వేయడం సరికాదు. ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచన చేసి, పాత పన్ను 5శాతం ఉంచాలి.  

- బి. బాలాజి, నవయుగ ఫుట్‌వేర్‌ అధినేత


Updated Date - 2021-12-22T04:58:59+05:30 IST