పన్నుల బాదుడు

ABN , First Publish Date - 2022-01-01T06:03:49+05:30 IST

కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపనుంది. జనవరి 1 నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి, గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించే వారిని భారీగా బాదేయనుంది.

పన్నుల బాదుడు
కొత్త ఏడాది కానుక

 నేటి నుంచి పెరగనున్న లైఫ్‌, గ్రీన్‌ ట్యాక్స్‌లు


నెల్లూరు (క్రైం), డిసెంబరు 31:  కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపనుంది. జనవరి 1 నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి, గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించే వారిని భారీగా బాదేయనుంది. ఆ వివరాలేమిటో చూద్దాం... గతంలో ద్విచక్రవాహనాలకు తొమ్మిది శాతం లైఫ్‌ ట్యాక్స్‌ విధించే వారు. ఇకనుంచి రూ.50 వేలులోపు ఉన్న ద్విచక్ర వాహనాలకు 9 శాతం, రూ.50 వేలు దాటితే 12 శాతం ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి తీసుకు వచ్చే ద్విచక్ర వాహనాలకు వాహన వయసు ఆధారంగా 4 నుంచి 11 శాతం వరకు లెఫ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇక, కార్ల విషయానికి వస్తే రూ.5 లక్షలలోపు కార్లకు 13 శాతం, రూ.5-10 లక్షల మధ్య వాటికి 14 శాతం, రూ.10-20 లక్షల మధ్య వాటికి 17 శాతం, రూ.20లక్షలు దాటితే 18 శాతం ట్యాక్స్‌ చెల్లించాలి. గతంలో 14 శాతం వరకే ట్యాక్స్‌లు ఉండేవి. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే వాహనాలకు కూడా పన్నులు పెంచారు. 


గ్రీన్‌ ట్యాక్స్‌ ఇలా...

గతంలో వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత ఏడేళ్లు దాటితేనే గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉండేది. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు మాత్రం ఏడు నుంచి పదేళ్లలోపు ఉంటే క్వార్టర్లీ ట్యాక్స్‌లో సగం చెల్లించాల్సి ఉండేది. కానీ ఇకనుంచి 10-12 ఏళ్లలోపు వాహనాలకు క్వార్టర్లీ పూర్తి ట్యాక్స్‌ చెల్లించాలి. 12ఏళ్లు పైబడిన వాహనాలకు అదనంగా గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్‌ ట్రాక్టర్లు, ఆటోలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు సంబంధించి 8 నుంచి 13 సీట్ల సామర్ధ్యం ఉంటే ఏడాదికి రూ.4-6 వేలు, నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో మోటారు సైకిల్‌కు 15-20 ఏళ్లలోపు ఉన్న వాటికి ఐదేళ్లకు రూ.2వేలు, 20 ఏళ్లు దాటిన వాహనానికి రూ.5వేలు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. వైట్‌ బోర్డు కార్లకు 15-20 ఏళ్లలోపు ఉంటే ఐదేళ్ల కాలపరిమితికి రూ.5వేలు, 20 ఏళ్లు దాటితే ఐదేళ్లకు రూ.10వేలు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. 

Updated Date - 2022-01-01T06:03:49+05:30 IST