బొప్పాయి విత్తన మాఫియా...!

ABN , First Publish Date - 2022-06-29T04:32:00+05:30 IST

బొప్పాయి విత్తన మాఫియా నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఈ కల్తీ విత్తనాల కారణంగా అన్నదాతలు దిగుబడి రాక అప్పుల పాలవుతున్నారు.

బొప్పాయి విత్తన మాఫియా...!
దిగుబడులు రాని బొప్పాయి చెట్లు

ప్రతి ఏటా మోసపోతున్న రైతులు

చెట్లు పెరుగుతున్నాయే తప్ప... దిగుబడి రాని వైనం

లబోదిబోమంటున్న రైతులు


బొప్పాయి విత్తన మాఫియా నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఈ కల్తీ విత్తనాల కారణంగా అన్నదాతలు దిగుబడి రాక అప్పుల పాలవుతున్నారు. తోటల్లో కాయలు రాకపోవడం.. కాపు కాసినా గిడసబారిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. విత్తన డీలర్లు విత్తనాల్లో కల్తీ చేయడంతోనే ఇలా జరుగుతోందని, అధికారులకు చెప్పినా లాభం లేదని పలువురు బొప్పాయి రైతులు వాపోతున్నారు.


రైల్వేకోడూరు, జూన్‌ 28: నియోజకవర్గ కేంద్రమైన రైల్వేకోడూరుతో పాటు చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె మండలాలకు కొందరు డీలర్లు నర్సరీలకు, రైతులకు ఓ కంపెనీకి చెందిన బొప్పాయి విత్తనాలు ఇస్తున్నారు. వీటిల్లో 75 శాతం వరకు కల్తీ విత్తనాలు వేసి మోసం చేస్తున్నారు. విత్తనాలు విదేశాల నుంచి ఒక కంపెనీ వారు సరఫరా చేస్తున్నారు. ప్రత్యేకంగా కంపెనీ వారు డబ్బాల్లో మహారాష్ట్రకు పంపుతున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న డైరెక్టర్లకు అందుతాయని రైతులు చెబుతున్నారు. డైరెక్టర్స్‌ నుంచి డీలర్లకు విత్తనాలు పంపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఒకే ఒక డైరెక్టర్‌ ఉన్నారని రైతులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఆగస్టు నుంచి సెప్టెంబరు వరకు విత్తనాలు వస్తాయి. రైల్వేకోడూరులో నలుగురు డీలర్లు ఉన్నారు. ఇందులో ఒక డీలర్‌ తమిళనాడు డీలర్‌షిప్‌ పెట్టుకుని రైల్వేకోడూరులో విత్తనాలు అమ్ముతున్నారని రైతులు తెలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో 50 వేల మంది రైతులు ఉన్నారు. సుమారుగా 20 వేల హెక్టార్లలో బొప్పాయి సాగు చేస్తున్నారు. కిలో బొప్పాయి విత్తనాలు రూ.3.8 లక్షల ధర ఉంటుంది. ప్రతి ప్యాకెట్‌లో విత్తనాలు కల్తీ చేసి నర్సరీలకు ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో సుమారుగా 200 కిలోల విత్తనాలు అవసరం ఉంటుంది. కిలో విత్తనాల్లో 200 గ్రాముల విత్తనాలు కల్తీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒక్క గింజ రూ.3 పడుతుంది. గింజ మొలకెత్తితే రూ.8 పడుతుంది. రవాణా ఛార్జీలు రూ.1 పడుతుంది. రైతుల పొలాల్లోకి చేరే లోపు రూ.12 పడుతుంది. పది గ్రాముల విత్తనాల ప్యాకెట్‌లో 550 విత్తనాలు ఉంటాయి. ఒక రైతు ఒక ఎకరాలో బొప్పాయి సాగు చేయాలంటే రూ.60 వేల నుంచి రూ.70 వేలు అవుతుంది. రైతుల డిమాండును బట్టి విత్తనాలు తెప్పిస్తారు. ఇలా ప్రతి ఏటా రైతులకు నాసిరకంతో పాటు కల్తీ చేసిన విత్తనాలు విక్రయించి నిలువునా ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. బొప్పాయి విత్తన మాఫియాను అరికట్టే విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా బొప్పాయి తదితర విత్తనాలను సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఆర్‌బీకేల నుంచి విత్తనాలు సరఫరా చేయాలి

- కోనేరెడ్డి రామసుబ్బారెడ్డి, ఉప్పరపల్లె, రైల్వేకోడూరు మండలం

బొప్పాయి విత్తనాలను రైతులకు నేరుగా ప్రభుత్వం అందించాలి. అప్పుడు దళారుల బెడద తగ్గుతుంది. కల్తీ చేసే డీలర్లపై చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాదిలో సాగు చేసిన బొప్పాయి విత్తనాల్లో కల్తీ కావడంతో సరిగ్గా కాపు కాయలేదు. కాయలు గిడసబారిపోయాయి. నేను 5 ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేశాను. తోట సరిగ్గా రాలేదు. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు పెట్టాను. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను సరఫరా చేయాలి.


విత్తన మాఫియాపై చర్యలు తీసుకోవాలి

- లక్కిరెడ్డి పాపిరెడ్డి, ఉప్పరపల్లె, రైల్వేకోడూరు మండలం

విత్తన మాఫియాపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. డీలర్లకు డీలర్‌షిప్‌లు ఉన్నాయా, ఉంటే ఎంత వరకు ఉన్నాయి అనేది పరిశీలించాలి. అసలు డీలర్లకు ఎక్కడి నుంచి విత్తనాలు వస్తున్నాయన్నది సమగ్రంగా ప్రభుత్వం పరిశీలించాలి. విత్తనాల డీలర్‌షిప్‌లు రద్దు చేసి రైతుకు నేరుగా విత్తనాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. కంపెనీ ఎవరిది, కంపెనీ ఎక్కడ ఉంది, విత్తనాలు వచ్చే డైరెక్టర్లను విచారణ చేయాలి. దీంతో దళారుల ఆధిపత్యం తగ్గిపోతుంది. నేను 3 ఎకరాలలో బొప్పాయి సాగు చేస్తున్నాను. రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు అయింది. 


ప్రతి రైతు నర్సరీల నుంచి బిల్లులు తీసుకోవాలి

- హరి, ఉద్యానశాఖాధికారి, రైల్వేకోడూరు

ప్రతి రైతు నర్సరీల నుంచి బిల్లులు తీసుకుంటే విత్తన మాఫియాకు అడ్డుకట్ట వేయవచ్చు. దీంతో రైతులు మోసపోకుండా ఉంటారు. బిల్లులు లేకుంటే ఆధారం ఉండదు. బిల్లులు ఉంటే వ్యాపారులపైన, డీలర్లపైన కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా రైతులు సాగు చేస్తున్న తోటలను పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం పంపుతాము.

Updated Date - 2022-06-29T04:32:00+05:30 IST