సర్వహితం... సంక్రాంతి పరమార్థం

ABN , First Publish Date - 2022-01-14T05:30:00+05:30 IST

ఖగోళశాస్త్ర రీత్యా... ప్రకృతిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అనుసరించవలసిన విధి విధానాలకు మన పూర్వ ఋషులు పండుగల రూపంలో దిశానిర్దేశం చేశారు. ఈ విధి విధానాలన్నీ మనిషి వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సామాజికమైన ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ కాక్షించేవే!

సర్వహితం... సంక్రాంతి పరమార్థం

ఖగోళశాస్త్ర రీత్యా... ప్రకృతిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అనుసరించవలసిన విధి విధానాలకు మన పూర్వ ఋషులు పండుగల రూపంలో దిశానిర్దేశం చేశారు. ఈ విధి విధానాలన్నీ మనిషి వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సామాజికమైన ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ కాక్షించేవే! ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక, సాంఘిక, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాలలో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి ఉద్దేశించిన ఈ పండుగలు బహుళార్థ సాధకాలు. ఆయా ఋతువులలో, సంక్రమణాల్లో ఎలా మసలుకోవాలో, ఆ వాతావరణాలను ఎలా సమన్వయించుకోవాలో వీటి ద్వారా పూర్వులు తెలియజేశారు.


సూర్యుడు ధనురాశి నుంచి మకరరాశిలో ప్రవేశించడం మకర సంక్రమణంగా, మకర సంక్రాంతిగా ప్రసిద్ధి పొందింది. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తాడు.  దీన్ని ఉత్తరాయన పుణ్యకాలంగా పరిగణిస్తారు. దేశవాసులందరూ వారి వారి సంప్రదాయాలను అనుసరించి దీన్ని ప్రత్యేక పర్వంగా నిర్వహించుకుంటారు. ఉత్తరాయనంలో తెలుగువారు జరుపుకొనే ప్రముఖమైన తొలి పండుగ సంక్రాంతి. జీవిక కోసం ఎవరు ఎక్కడెక్కడ ఉన్నా... సంక్రాంతి నాటికి తమ ఇళ్ళకు చేరి, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ ఆధునిక కాలంలో కూడా సంక్రాంతి శోభను చూడాలంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి. తరాలు మారినా, ప్రపంచం సాంకేతికంగా వృద్ధి చెందినా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు పల్లెల్లో జీవించి ఉండడం చెప్పుకోదగిన విషయం. పౌష్య లక్ష్మికి స్వాగతం పలికే సంక్రాంతిని గతంలో ‘పెద్ద(ల) పండుగ’ అని పిలిచేవారు.  వ్యవసాయమే జీవనాధారమైన కర్షకుల ఇళ్ళకు పంటలన్నీ సంక్రాంతి నాటికి చేరుకుంటాయి. ప్రకృతి పచ్చగా, శోభాయమానంగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కర్షకులకు, వారి కష్టానికి సాయపడిన పశుగణానికి ఇది విశ్రాంతి సమయం. 


నెల రోజుల సంబరం...

సంక్రాంతి... ‘భోగి, సంక్రాంతి, కనుమ’ అనే మూడు రోజుల పండుగ. వాస్తవానికి సంక్రాంతి శోభ ముప్ఫై రోజుల ముందు నుంచే కనువిందు చేస్తుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి, మకరరాశికి చేరుకొనే ముప్ఫై రోజులను ‘ధనుర్మాసం’ అంటారు. ‘నెల పట్టడం’ అని కూడా వ్యవహరిస్తారు. గృహిణులు ఉషోదయానికి ముందే ఇళ్ళ ముందు ఆవు పేడతో కళ్ళాపి చల్లి, అందంగా రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి, అవి కంటికి ఇంపుగా కనబడేలా బంతి, చామంతి, గుమ్మడి పూలతో అలంకరించి... వాటి చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొట్టి పాటలు పాడుతారు. ధనుర్మాసంలో పల్లెల్లో కనువిందు చేసే హరిదాసులు, గంగిరెద్దులు ఆడించేవారు, జంగమయ్యలు, బుడబుడక్కులవారు, పగటి వేషధారులు తదితర జానపద కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. 


భోగాన్ని ప్రసాదించే భోగి

మకర సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ. ధనుర్మాసంలో చివరి రోజు. విశిష్టాద్వైతం పాటించేవారు ఈ నెలంతా ‘శ్రీవ్రతం’ ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి.. రంగనాథుణ్ణి భర్తగా పొందింది. ఆ భోగాన్ని అందరికీ ప్రసాదించింది. కాబట్టి దీన్ని ‘భోగి పండుగ’గా జరుపుకోవడం అనూచానంగా వస్తోంది. సంక్రాంతి నాడు పూజలు, దానాలు, తర్పణాలు లాంటివి ఉంటాయి. కాబట్టి ముందు రోజునే కొన్ని వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. తెల్లవారుజామునే లేచి... నలుగు పెట్టుకొని, తలంటు పోసుకొని, కొత్త దుస్తులు ధరిస్తారు. ఇంటి ముంగిట, కూడళ్ళలో భోగి మంటలు వేస్తారు. ఆ సాయంత్రం చిన్నపిల్లలకు రేగు పండ్లు, నాణేలు, చెరుకు ముక్కలు కలిపిన మిశ్రమాన్ని ‘భోగి పండ్లు’గా పోస్తారు. అమ్మాయిలు బొమ్మల కొలువులు పెడతారు. బంధుమిత్రులను పిలిచి పేరంటం చేస్తారు. అవకాశం ఉన్నవారు కానుకలు ఇస్తారు. ఇలా అందరితో ఇచ్చి పుచ్చుకొని... రోజంతా ఆనందంగా గడుపుతారు.

 

పెద్ద(ల ) పండుగ..

రెండో రోజు సంక్రాంతి. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్యకాలంలో తర్పణాలు, దానాలు ప్రధానాంశాలు. కాబట్టి దీన్ని ‘పెద్దల పండుగ’గా వ్యవహరిస్తారు. బలి చక్రవర్తికి వామనుడు ఇచ్చిన వరం కారణంగా... ఈ మూడు రోజులు బలి చక్రవర్తి భూలోకంలో సంచరిస్తాడని అంటారు. ఈ రోజున బలిని కొన్ని ప్రాంతాల్లో పూజిస్తారు. భూమండలానికి ప్రతీకగా గుమ్మడి పండును దానం చేస్తే... భూమిని దానం చేసి ఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది. మకర రాశిలో ఉండే శ్రవణం నక్షత్రాధిపతి అయిన శనిని శాంతింపజేయడానికి... నువ్వుల దానం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు. 


కృతజ్ఞతల చెల్లింపే కనుమ

మూడో రోజు కనుమ. ఇది ప్రత్యేకించి కర్షకుల పండుగ. ఏడాదంతా తమకు సహకరించిన పశువులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుకొంటారు. పశువుల కొట్టాలను, పశువులను కడిగి శుభ్రం చేస్తారు. కొట్టాలకు మామిడి తోరణాలు, పశువుల మెడలో గంటలు కడతారు. వాటి కొమ్ములకు రంగులు వేసి ముస్తాబు చేస్తారు. పక్షులు తినడానికి ఇంటి ముందర వసారాల్లో వరికంకులను గుత్తులుగా కడతారు. తమ పంటలో కొంత భాగాన్ని పాలేర్లకు, కూలీలకు ఇస్తారు. తమను కళాకౌశలంతో అలరించినవారికి వార్షికంగా ధన, ధాన్యాదులు ఇచ్చి ఆనందం కలిగిస్తారు. కొత్త బియ్యంతో పొంగలి వండి, నివేదించి, పశువులకు ప్రసాదంగా పెడతారు. ఆ పొంగలిని తమ పొలాల్లో చల్లి... భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. 

కొన్ని ప్రాంతాల్లో... నాలుగో రోజును ‘ముక్కనుమ’ పేరుతో నిర్వహిస్తారు.  కొన్ని కుటుంబాలవారు ఈ రోజున నూతన వధువులతో... పదహారు రోజుల పాటు జరిగే సావిత్రీ గౌరీ దేవి వ్రతాన్ని చేయిస్తారు. మట్టితో చేయించిన గౌరీదేవి బొమ్మను మేళతాళాలతో ఇంటికి తెచ్చి, పదహారు రోజులు పూజిస్తారు. చివర్లో బంధు మిత్రులకు విందు ఏర్పాటు చేస్తారు.


ఈ విధంగా... సంక్రాంతి వేడుకలు... ఆధ్యాత్మికత, సమాజ హితం, సర్వ భూత హితం... వీటన్నిటి సమ్మేళనం.

ఎ. సీతారామారావు

8978799864

Updated Date - 2022-01-14T05:30:00+05:30 IST