పరమేశ్వరి పాలయమాం!

ABN , First Publish Date - 2022-09-25T05:23:21+05:30 IST

‘అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ’ అని అమ్మవారిని శక్తి స్వరూపిణిగా పూజించటం మన ఆచారం. అటువంటి అమ్మవారి పూజకు ఎంతో విశేషమైన రోజులు ‘శరన్నవరాత్రులు’. శరదృతువు ఆరంభంతో ప్రారంభమై తొమ్మిది రోజులు జరుగుతాయి కనుక వీటిని శరన్నవరాత్రులు అని పిలుస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఒక విశేష అలంకరణతో పూజిస్తారు.

పరమేశ్వరి పాలయమాం!
ఒంగోలులో శ్రీప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలంకరణ

రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

  రోజుకొక అవతారంలో అమ్మవారి దర్శనం

  కళారాలు, పార్వేట ఉత్సవం ప్రత్యేకం

  ముస్తాబవుతున్న దేవాలయాలు


ఒంగోలు(కల్చరల్‌), సెప్టెంబరు 24: ‘అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ’ అని అమ్మవారిని శక్తి స్వరూపిణిగా పూజించటం మన ఆచారం. అటువంటి అమ్మవారి పూజకు ఎంతో విశేషమైన రోజులు ‘శరన్నవరాత్రులు’. శరదృతువు ఆరంభంతో ప్రారంభమై తొమ్మిది రోజులు జరుగుతాయి కనుక వీటిని శరన్నవరాత్రులు అని పిలుస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఒక విశేష అలంకరణతో పూజిస్తారు. హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగ దసరా.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా జరుపుకుని పదవ రోజైన దశమి రోజును విజయదశమి లేదా దసరా పండుగ్గా జరుపుకుంటాం. హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగ దసరా.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా జరుపుకుని పదవ రోజైన దశమి రోజును విజయదశమి లేదా దసరా పండుగ్గా జరుపుకుంటాం.  జిల్లాలో ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి.ఈ సందర్భంగా అమ్మవారి కళారాలతో ఊరేగింపు జరపటం ఒంగోలు నగరంలో వస్తున్న ఆనవాయితీ.ఈ కళారాల ఊరేగింపు రాత్రంతా విద్యుత్కాంతులు, డప్పువాయిద్యాలు, భక్తుల నృత్యాలతో కన్నుల పండుగ్గా జరుగుతుంది. సోమవారం  నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని అమ్మవారి దేవస్థానాలలోను చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 


రోజుకొక అలంకారం

ఈ దసరా నవరాత్రులు అమ్మవారిని రోజుకొక రూపంతో అలంకరించి పూజిస్తారు. అనేక దేవాలయాలు విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే అలంకారాలను ప్రామాణికంగా తీసుకుంటారు. మరికొన్ని దేవస్థానాల్లో నిత్య అలంకారాలు అక్కడి దేవతలను బట్టి మారుతుంటాయి. నవరాత్రులలో తొలిరోజునుంచి ఏడో రోజైన సప్తమి వరకు వరుసగా  శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, బాలాత్రిపురసుందరీదేవి, గాయత్రిదేవి, లలితత్రిపురసుందరీదేవి, సరస్వతిదేవి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవిగా అలంకారాలను చేస్తారు. అయితే వివిధ దేవాలయాల్లో చేసే అలంకారాల్లో కొద్ది మార్పులు ఉన్నప్పటికీ, ఎనిమిదవ రోజైన అష్టమి రోజు దుర్గాదేవిగా అలంకరిస్తారు. అందుకే దీన్ని దుర్గాష్టమిగా పిలుస్తారు. ఇక తొమ్మిదో రోజు మహిషాసురమర్ధనిగా దర్శనమిస్తారు. అందుకే దీన్ని మహర్నవమిగా పిలుస్తాం. ఆ మరుసటి రోజైన దశమిని విజయదశమి అంటే దసరా పండుగగా జరుపుకుంటాం. ఆ రోజున రాజరాజేశ్వరిదేవిగా అలంకరిస్తారు.

మూలా నక్షత్రం రోజున సరస్వతీగా..

నవరాత్రుల్లో ఏరోజునైతే మూలా నక్షత్రం ఉంటుందో దాదాపుగా అన్ని దేవాలయాల్లో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. సరస్వతీదేవి జన్మించినది మూలా నక్షత్రంలో కావటమే ఇందుకు కారణం.  అంతేకాకుండా ఆ రోజున అన్ని పాఠశాలల్లో సరస్వతిపూజను సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అలాగే తమ చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలను చేయించుకుంటారు. 


బొమ్మలకొలువు..

దసరా ఉత్సవాల్లో మహిళల సందడి అంతాయింతా కాదు. బొమ్మలకొలువును ఏర్పాటు చేసి అనేక దేవతామూర్తులు, మన కళాసంస్కృతిని, సంపదను చాటిచెప్పే అనేక రకాల బొమ్మలను కొలువుదీర్చటం, ముత్తైదువలను పిలిచి పేరంటం నిర్వహించటం ఆనవాయితీ. 


పార్వేట ఉత్సవం.. 

ఒంగోలు నగరంతో బాటు జిల్లాలో అనేక చోట్ల దసరా సందర్భంగా విజయదశమి రోజున పార్వేట ఉత్సవం ఘనంగా జరుపుకోవటం ఆనవాయితి. ఆ రోజున జమ్మిచెట్టును పూజిస్తారు. ఈ జమ్మిచెట్టు పైనే పాండవులు తమ ఆయుధాలను దాచి ఉంచి కురుక్షేత్ర సంగ్రామానికి వెళ్లేటప్పుడు తీసుకున్నారని, అందుకే వారికి విజయం లభించిందని చెప్పటం జరిగింది. అంతేకాకుండా విజయదశమి రోజునే రాముడు రావణవధ చేశాడని, జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించిందని ఇలా అనేక పురాణగాధలు ఈ దసరా విశిష్టతను తెలియజేస్తాయి. ఈ రోజున జరిగే పార్వేట ఉత్సవం సందర్భంగా నగరంలోని అన్ని దేవాలయాల నుంచి దేవతామూర్తులు ఊరేగింపుగా జమ్మిచెట్టు వద్దకు రావటం అక్కడ ప్రజలు వారిని దర్శించుకోవటం జరుగుతుంది.


దేవాలయాల్లో ఏర్పాట్లు

ఒంగోలు నగరంలోని పలు అమ్మవారి దేవాలయాలు, శక్తిపీఠాల్లో దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ విద్యుత్‌ దీపాలంకరణలు, ప్రత్యేకంగా అమ్మవారి లైటింగ్‌ కటౌట్లు మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు.  ఇక దసరా ఉత్సవాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు కానుండటంతో ఇందుకు సంబంధించిన ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, కళాకారులకు డిమాండ్‌ ఏర్పడింది. అదేవిధంగా పూలు, పండ్లకు సహజంగానే డిమాండ్‌ ఉండటంతో ఇతర ప్రాంతాలనుంచి వివిధ రకాల పూలను తెప్పించటానికి వ్యాపారులు సన్నద్ధమయ్యారు.   


Updated Date - 2022-09-25T05:23:21+05:30 IST