ఇదేమి నిర్వహణ?

ABN , First Publish Date - 2021-03-09T04:50:14+05:30 IST

‘మెరుగైన విద్యాబోధన, పౌష్టికాహారం అందుతుందని ఆశించాం. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 250 మంది విద్యార్థినులకు రెండు మరుగుదొడ్లేనా?. 95 మంది నిద్రించడానికి ఒక గది మాత్రమే కేటాయిస్తారా? కనీసం మా పిల్లలకు తాగునీరు అందించలేకపోతున్నారు. ఇలాగేనా పాఠశాల నిర్వహణ’... అంటూ జలుమూరు కేజీబీవీ ప్రత్యేకాధికారి వాన సుజాతను విద్యార్థినుల తల్లిదండ్రులు నిలదీశారు.

ఇదేమి నిర్వహణ?
కేజీబీవీ ప్రత్యేకాధికారి సుజాతను నిలదీస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థినులు

ఇలాగైతే పిల్లల టీసీలు తీసుకుంటాం
జలుమూరు కేజీబీవీ వద్ద తల్లిదండ్రుల నిరసన
దర్యాప్తు చేసిన డీఈవో చంద్రకళ
జలుమూరు, మార్చి 8 :
‘మెరుగైన విద్యాబోధన, పౌష్టికాహారం అందుతుందని ఆశించాం. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 250 మంది విద్యార్థినులకు రెండు మరుగుదొడ్లేనా?. 95 మంది నిద్రించడానికి  ఒక గది మాత్రమే కేటాయిస్తారా? కనీసం మా పిల్లలకు తాగునీరు అందించలేకపోతున్నారు. ఇలాగేనా పాఠశాల నిర్వహణ’... అంటూ జలుమూరు కేజీబీవీ ప్రత్యేకాధికారి వాన సుజాతను విద్యార్థినుల తల్లిదండ్రులు నిలదీశారు. సోమవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. సమస్యలు విన్నవించుకుందామని ప్రత్యేకాధికారి కోసం ఆరాతీశారు. కానీ ఎస్‌వో వెలుగు కార్యాలయంలో మహిళా దినోత్సవాలకు వెళ్లారని అక్కడున్న సిబ్బంది చెప్పారు. దీంతో ఎస్‌వోకు తల్లిదండ్రులే నేరుగా ఫోన్‌చేశారు. పాఠశాల వద్దకు రావాలని కోరారు. అయినా ఆమె మధ్యాహ్నం 12 గంటల వరకూ రాలేదు. దీంతో సమగ్ర శిక్ష అభియాన్‌ పీవోకు తల్లిదండ్రులు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాల వద్ద విద్యార్థినులతో కలిసి తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఇంతలో ఎస్‌వో పాఠశాలకు చేరుకోవడంతో ఆమెను నిలదీశారు. ఎస్‌వో సంతృప్తికర సమాధానం చెప్పకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలల లోపలికి ప్రవేశించారు. వసతిగదులు, మరుగుదొడ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం జిల్లా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పిల్లల టీసీలు తీసుకొని వెళ్లిపోతామని హెచ్చరించారు.  విషయం తెలుసుకున్న డీఈవో చంద్రకళ సోమవారం మధ్యాహ్నం పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ పరిణామాలపై సమగ్ర దర్యాప్తు చేసి కలెక్టర్‌కు నివేదించనున్నట్టు డీఈవో ప్రకటించారు. డీఈవోతో పాటు జీసీడీవో శారద ఉన్నారు.

Updated Date - 2021-03-09T04:50:14+05:30 IST