మా అమ్మాయి ఒంటిపై గాట్లు ఉన్నాయి

ABN , First Publish Date - 2021-10-13T06:26:07+05:30 IST

అగనంపూడిలో వారం రోజుల క్రితం చనిపోయిన బాలిక కేసును పోలీసులు పక్కదోవ పట్టించారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మా అమ్మాయి ఒంటిపై గాట్లు ఉన్నాయి

‘అగనంపూడి బాలిక’ తల్లిదండ్రులు

కేసును పోలీసులే పక్కదోవ పట్టించారని ఆరోపణ

ఇప్పటికైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌

మరో అమ్మాయికి అన్యాయం జరగకుండా చూడాలి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అగనంపూడిలో వారం రోజుల క్రితం చనిపోయిన బాలిక కేసును పోలీసులు పక్కదోవ పట్టించారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ రోజున పాప శవం దొరికిన తరువాత తాము చెబుతున్న మాటలు వినకుండా వారికి నచ్చినట్టుగా చేశారని, ఆ మేరకే కేసును ముగించేశారని అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, తమ బిడ్డను చంపిన వారికి ఉరిశిక్ష వేయించాలని, అలాగే ఇంకో అమ్మాయికి అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఇవీ బాలిక తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు

- బాలిక శవాన్ని లిఫ్టులో తీసుకువచ్చి బయట గోడ పక్కన కూర్చోబెట్టారు. ఆమె పైనుంచి పడి చనిపోలేదు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. పైనుంచి పడిపోయి ఉంటే...ఆమెను గోడ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఎవరు? 

- ఎదుటి అపార్టుమెంట్లో గల వ్యక్తితో బాలిక సన్నిహితంగా వుంటున్నట్టు ఏ ఒక్కరూ చూడలేదు. పోలీసులు సెల్‌ఫోన్‌ ఆధారంగా ఆ ఆరోపణలు చేస్తున్నారు. అవి ఎంత వరకు వాస్తవమో మాకు తెలియదు.

- బాలిక ఒంటిపై గాట్లు, కోతలు ఉన్నాయి. సిగరెట్‌తో కాల్చిన గుర్తులు ఉన్నాయి. 

- బాలికను చంపిన వారి కోసం పోలీసు కుక్కను తెప్పించాలని ఆ రోజున మేము కోరితే పోలీసులు పట్టించుకోలేదు.

- బాలిక పైనుంచి పోడిపోయి చనిపోయిందని చెబుతున్న పోలీసులు...ఆ స్థలాన్ని దర్యాప్తులో భాగంగా మార్కింగ్‌ చేస్తారు. ఈ కేసులో అది కూడా చేయలేదు.

- ఘటన జరిగిన అపార్టుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ పని కూడా సరిగ్గా చేయలేదు. ఇప్పటికీ సెల్లార్‌లో రక్తపు మరకలు ఉన్నాయి.

- ఘటన జరిగిన తరువాత నుంచి ఆ అపార్టుమెంట్‌లో లిఫ్టు పనిచేయడం లేదు. దీనికి కారణం ఏమిటి?

- అపార్ట్‌మెంట్‌లో ఐదుగురు యువకులు అద్దెకు దిగారని పోలీసుల కథనం. కానీ ఆ ఐదుగురు రెండు నెలల క్రితం ఆ ఫ్లాట్‌ (101)లో కప్‌బోర్డులు చేసే పని కోసం వచ్చారు. అక్కడే పనిచేసి అక్కడే ఉంటున్నారు. 

- పనులు ఇంకా పూర్తికాని ఫ్లాట్‌లో ఒకే వయసు కలిగిన ఐదుగురు యువకులు ఉంటున్నప్పుడు...ఆ ఫ్లాట్‌కు రెండు నెలలుగా ఒక అమ్మాయి వచ్చి వెళుతుంటే...మిగిలిన నలుగురికి ఆ విషయం తెలియదని పోలీసులు చెబుతున్న విషయం నమ్మశక్యంగా లేదు.  

- కేజీహెచ్‌ నుంచి పోస్టుమార్టం అయిన తరువాత బాలిక శవాన్ని, కుటుంబ సభ్యులు అగనంపూడి తేవడానికి యత్నించగా, పోలీసులు బలవంతంగా స్వగ్రామానికి సెక్యూరిటీ ఇచ్చి పంపించారు. వారి వాహనానికి ముందు ఒక పోలీసు వాహనం, వెనుక మరో వాహనం పెట్టి తరలించారు. ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నారు?....ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ పోలీసులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-10-13T06:26:07+05:30 IST