కాళ్లు లేని వాడితో పెళ్లి చేయలేమన్న తల్లిదండ్రులు.. వేరే పెళ్లి చేసుకోమని బాధగానే ప్రేయసికి చెప్పిన ప్రియుడు.. చివరకు..

ABN , First Publish Date - 2021-10-15T17:07:28+05:30 IST

ఎలాంటి అవాంతరాలూ లేకుండా పెళ్లి వరకు వెళ్లే ప్రేమ కథలను చాలా అరుదుగా వింటుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథ చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

కాళ్లు లేని వాడితో పెళ్లి చేయలేమన్న తల్లిదండ్రులు.. వేరే పెళ్లి చేసుకోమని బాధగానే ప్రేయసికి చెప్పిన ప్రియుడు.. చివరకు..

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందంటారు. ప్రేమించుకున్న వారు.. పెళ్లి చేసుకునే వరకు వెళ్లే క్రమంలో ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులు. కులం వేరనో, మతం వేరనో, ధనం లేదనో.. ఇలా పలు కారణాలతో పెద్దలు అడ్డుచెబుతూ ఉంటారు. దీంతో ఆఖరికి ప్రేమికులు తెగించి పెళ్లి చేసుకోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ధైర్యంగా పెళ్లి చేసుకున్నా.. తర్వాత క్షేమంగా ఉంటారన్న గ్యారెంటీ ఉండదు. వారి మీద అక్కసుతో దాడులు, హత్యలు చేయించడం చూస్తుంటాం. ఎలాంటి అవాంతరాలూ లేకుండా పెళ్లి వరకు వెళ్లే ప్రేమ కథలను చాలా అరుదుగా వింటుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథ చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తెలుసుకుంటే.. ప్రేమంటే ఇదేరా.. అని మీరే అంటారు. వివరాల్లోకి వెళితే.. 


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని రామదాసు వీధికి చెందిన గుర్రం అనిల్, లక్ష్మీపురం వీధికి చెందిన ఎద్దుల పవిత్ర చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి తర్వాత వారి జీవితం గురించి ఎన్నో కలలు కనేవారు. ఇలావుండగా 2016లో అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నముక దెబ్బతినిందని, ఇక నడవడం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో అప్పటినుంచి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్న వారి కలలు.. కళ్లలయ్యాయి. అయ్యో పాపం.. దేవుడు ఇలా చేశాడేంటీ.. అని అంతా వారి మీద జాలిపడ్డారు.


అనిల్ ఏ పరిస్థితిలో ఉన్నా సరే.. తననే పెళ్లిచేసుకుంటానని పవిత్ర నిర్ణయించుకుంది. ఇదే మాట అనిల్‌తోనూ చెప్పింది. తను వద్దని చెప్పినా వినలేదు. మరోవైపు పవిత్ర తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఇష్టపడలేదు. కాళ్లు లేని అతన్ని చేసుకుని ఏం సుఖపడతావ్.. తమకు అసలు ఇష్టం లేదంటూ వారించారు. కానీ పవిత్ర మాత్రం మాట మార్చుకోలేదు. అన్నీ బాగున్నపుడు ప్రేమించి, ఇప్పుడు తను ఇబ్బందుల్లో ఉంటే.. వదిలేయడం తనకు నచ్చదని తేల్చి చెప్పింది. అనిల్‌ను బలవంతంగా ఒప్పించింది. తర్వాత ఇద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ నెల 3న వివాహం చేసుకున్నారు. పవిత్ర ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తాను కష్టం చేసైనా.. తన భర్తను పోషించుకుంటానని చెబుతోంది. ఈ కాలంలో ఇలాంటి ప్రేమికులు చాలా అరుదుగా ఉంటారని.. వీరిది పవిత్ర ప్రేమ అంటూ స్థానికులు తెగ పొగుడుతున్నారు. 

Updated Date - 2021-10-15T17:07:28+05:30 IST