వీడనున్న ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-09-19T05:06:44+05:30 IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనుండడంతో అభ్యర్థుల్లో సందడి నెలకొంది.

వీడనున్న ఉత్కంఠ
భీమవరంలో కౌంటింగ్‌పై సూచనలు చేస్తున్న జేసీ హిమాన్షు శుక్లా

నేటితో 164 రోజుల నిరీక్షణకు తెర

తేలనున్న పరిషత్‌ ఎన్నికల ఫలితాలు

 భారీగా సాగుతున్న బెట్టింగ్‌లు


మొగల్తూరు,సెప్టెంబరు 18 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనుండడంతో అభ్యర్థుల్లో సందడి నెలకొంది. మొగల్తూరు జడ్పీటీసీ స్థానానికి తిరుమాని బాపూజీ(వైసీపీ), మామాడిశెట్టి సత్యనారాయణ (టీడీపీ),గుత్తుల విశ్వేశ్వరరావు(కాంగ్రెస్‌), మోకా చినశ్రీనివాస్‌(జనసేన)లు బరి లో నిలిచారు.అయితే టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతో ఆ పార్టీ అభ్యర్థి కేవలం రోడ్‌ షో నిర్వహించి ప్రచారం ముగించారు. అధికార వైసీపీ 21 ఎంపీటీసీ స్థానాల్లోనూ బరిలో నిలిచింది. జనసేన 16 ,టీడీపీ 14, ఇండిపెండెం ట్లు 7, కాంగ్రెస్‌ ఒకటి, బీజేపీ రెండు స్థానాల్లో పోటీలో నిలిచాయి. 


నరసాపురం రూరల్‌ : మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీల భవిత ఆదివా రంతో తేలనుంది. జడ్పీటీసీ స్థానానికి టీడీపీ పోటీ నుంచి తప్పు కుంది. బొక్కా రాధాకృష్ణ(వైసీపీ),వాతాడి కనకరాజు(జనసేన),రామాంజనేయులు(సీపీఎం) తలపడ్డారు. వీరిలో ఎవరు గెలుపొందినా మెజార్టీ తక్కువగానే ఉంటుందన్న వాదనలు ఉన్నాయి. ఇక 23 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ పోటీకి దిగింది. టీడీపీ 19, జనసేన 11, సీపీఎం రెండు, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బరిలో నిలి చారు. భీమవరంలో జరిగే కౌంటింగ్‌కు అఽధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. 


పెనుగొండ : పరిషత్‌ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.  మండలానికి సంబంధించి కౌంటింగ్‌ తణుకు ఏఎస్‌ఆర్‌ కళాశాలలో నిర్వహిస్తా రు. మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు ఒకటి  ఏకగ్రీవం కాగా మిగిలిన 19  స్థానాలకు 46 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వైసీపీ నుంచి 19 మంది, టీడీపీ 16, జనసేన 8,  సీపీఎం2, ఇండిపెండెంట్‌గా ఒకరు  పోటీ చేశారు. ఎన్నికల  సమయంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి మృతిచెందడంతో ఎన్నిక జరగలేదు. దీంతో కేవలం ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికలు మాత్రమే జరిగాయి. 


ఆచంట : పరిషత్‌ టెన్షన్‌కు మరికొన్న గంటల్లో తెరపడనుంది. మండలంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ తీవ్రంగా జరగడంతో అటు అభ్యర్థుల్లోనూ, ఇటు నాయకుల్లోనూ టెన్షన్‌ నెలకొంది. 17 ఎంపీటీసీ స్థానాలకు 40 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైసీపీ నుంచి 17 మంది, టీడీపీ 13, జనసేన   నలుగురు,బీజేపీ నలుగురు, సీపీఎం, ఇండిపెండెంట్‌గా ఒక్కొక్కరు పోటీ చేశా రు. జడ్పీటీసీకి కడలి రామనాగ గోవిందరాజు(వైసీపీ), ఉప్పలపాటి సురేష్‌బాబు(టీడీపీ), గానుమిల్లి జోగిరాజు(కాంగ్రెస్‌), నెక్కంటి వీర వెంకట సత్యనారాయణ(ఇండిపెండెంట్‌)గా పోటీ చేశారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌కళాశాలలో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 120 మందిని కౌంటింగ్‌కు నియమించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. 


ఉండి : పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు అంతా సిద్ధం చేశామని ఎంపీడీవో గంగాధరరావు శనివారం  తెలిపారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎస్‌ బ్లాక్‌ నందు ఉండికి సంబంధించి కౌంటింగ్‌ జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్‌కు సుమారుగా 150 మందిని నియమించినట్టు తెలిపారు.   కౌంటింగ్‌ నిమిత్తం పాస్‌లను అందించినట్టు తెలిపారు. 

యలమంచిలి : పరిషత్‌ ఫలితాలపై అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 41 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 18 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ, 16 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో జనసేన, ఒక్కొక్క స్థానంలో బీజేపీ, సీపీఎం అభ్యర్థులు పోటీ చేశారు. యలమంచిలి జడ్పీటీసీ స్థానంలో నలుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. కవురు శ్రీనివాస్‌(వైసీపీ), కడలి గోపాలరావు (టీడీపీ), కొడవటి సత్యవరబాబు (జన సేన), దొంగ నాగేంద్రప్రసాద్‌(ఇండిపెండెంట్‌) పోటీ చేశారు.


వీరవాసరం : పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడింది. మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు గానూ కొణితివాడ రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 17 స్థానాలకు లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థు లతో పాటు పందేల రాయుళ్ళు ఉత్కంఠతతో వాతావరణాన్ని వేడెక్కించారు. 


భీమవరంలోనే 12 మండలాల కౌంటింగ్‌


భీమవరం, సెప్టెంబరు 18 : భీమవరంలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ శివారు చినఅమిరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మండలాల వారీగా కౌంటింగ్‌ ఏర్పాట్లను సిద్ధం చేశారు. నరసాపురం డివిజన్‌ పరిధిలో ఉన్న భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం, ఆచంట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధుల భవితవ్యం ఆదివారం ఇక్కడ తేలనున్నది. క్యాంపస్‌ భవనాల్లో ఓట్లను లెక్కించేందుకు అవసరమైన హాళ్ళను కేటాయించి, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఫలితాలను కవర్‌ చేసే మీడియాకు ఈ సారి పరిమితంగానే పాసులు జారీ చేశారు.కౌంటింగ్‌ కేంద్రంలో 5 అసెంబ్లీలకు కలిపి 12 మండలాలు ఉండగా ఒక్కో మీడియాకు రెండేసి పాసులు మాత్రమే ఇస్తున్నారు. 


కౌంటింగ్‌ సజావుగా సాగాలి : జేసీ శుక్లా


భీమవరం/ఆకివీడు, సెప్టెంబరు 18 : పరిషత్‌ కౌంటింగ్‌ సజావుగా నిర్వహించాలని జేసీ హిమాన్షు శుక్లా ఆదేశించారు. భీమవరం చినఅమి రం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌  కేంద్రాలను శనివారం పరిశీలించారు. అనంతరం లెక్కింపు సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఆది వారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభించాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సబ్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ అన్నా రు.కార్యక్రమంలో తహసీల్దార్‌ ఏవీ.రమణారావు,కమిషనర్‌ శ్యామల, ఎంపీడీవో జి.పద్మ, ఆకివీడు ప్రత్యేకాధికారి ఈదా అనిల్‌కుమారి, తహసీల్దార్‌ ఎన్‌.గురుమూర్తిరెడ్డి, ఎంపీడీవో శ్రీకర్‌, ఎంఈవో రవీంద్ర పాల్గొన్నారు.


 300 మంది పోలీస్‌ సిబ్బంది


భీమవరం క్రైమ్‌, సెప్టెంబరు 18 :  పరిషత్‌ ఎన్నికల లెక్కింపునకు సుమారు 300 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించినట్టు భీమవరం టూటౌన్‌ సీఐ కృష్ణకుమార్‌ తెలిపారు. నరసాపురం సబ్‌ డివిజన్‌లోని పోలీసులు, స్పెషల్‌ పార్టీ పోలీసులు ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాల వద్ద బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన సభ్యులు, ఏజెంట్లు తప్పనిసరిగా ఐడీ కార్డులు ఉండాలని తెలిపారు. లోపలికి వచ్చేవారు సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని తెలిపారు. బాల్‌పెన్‌, బుక్‌ మాత్రమే లోపలికి తెచ్చుకోవాలన్నారు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. 


164 రోజుల తర్వాత...


ఉండి, సెప్టెంబరు 18 : అభ్యర్థుల జాతకాలను భద్రంగా ఉంచిన స్ట్రాంగ్‌ రూం 164 రోజుల తరువాత తెరుచుకోనున్నది. ఎంపీటీసీ, జడ్పీ టీసీ ఎన్నికలు ఏప్రిల్‌ 8న జరిగాయి. అదే రోజు భీమవరంలోని ఎస్‌ఆర్‌ కేఆర్‌ కళాశాలకు బ్యాలెట్‌ బాక్స్‌లను తరలించి భద్రపరిచారు. ఆ స్ట్రాంగ్‌ రూమ్‌ ఆదివారం ఉదయం 7 గంటలకు తెరవనున్నారు. ఇదిలా ఉండగా పార్టీలకు చెందిన నాయకులు లెక్కలు వేసుకుంటూ టెన్సన్‌ పడుతు న్నారు. విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూద్దాం మరీ!


పల్లెల్లో లెక్కల తక్కెడ..


భీమవరం రూరల్‌ : గ్రామాల్లో ఎవరిది విజయం.. ఎందుకు నెగ్గుతాడు అన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే గ్రామాల్లో హడావుడి వాతావరణం నెలకొంది. ప్రధాన వీధి, సెంటర్లలో ఎన్నికల ఫలితాల చర్చలే.. మాటల యుద్ధంలో అభ్యర్థుల వైపు నాది పందెం అంటే నాది పందెం అంటూ బెట్టింగ్‌లు వేసుకుంటు న్నారు. ఎన్నికలు జరిగిన 164 రోజుల తర్వాత ఫలితాలు వస్తుండడంతో గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. 


కొవిడ్‌ టెస్టులకు పరుగులు...


ఆచంట/ యలమంచిలి : కొవిడ్‌ టెస్టులు చేయించుకుంటేనే కౌంటింగ్‌ అనుమతి ఇస్తామంటూ అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా కౌంటింగ్‌కు వెళ్లే ఏజెంట్లు దగ్గరలో ఉన్న పీహెచ్‌సీ వద్దకు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయా పీహెచ్‌సీలు కౌంటింగ్‌ ఏజెంట్లతో కిటకిటలాడాయి. టెస్టులు చేయించుకున్నవారంతా తమతమ పత్రాలు తీసుకుని అధికారులకు అందజేశారు.చివరి రోజున కొవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరని తెలియడంతో ఈ పరిస్థితి నెలకొంది.


Updated Date - 2021-09-19T05:06:44+05:30 IST