పెడనలో పచ్చ జెండా

ABN , First Publish Date - 2021-11-19T06:55:54+05:30 IST

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

పెడనలో పచ్చ జెండా
పెడన జడ్పీటీసీ నుంచి విజయం సాధించి, సీఈవో సూర్యప్రకాష్‌ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న టీడీపీ అభ్యర్థి అర్జా వెంకటనగేష్‌

జోగి రమేష్‌కు ఎదురుదెబ్బ

పెడన జడ్పీటీసీలో టీడీపీ విజయం

విస్సన్నపేట, జి-కొండూరు జడ్పీటీసీలు వైసీపీకి


పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో  గట్టి ఎదురుదెబ్బే తగిలింది. పెడన జడ్పీటీసీని టీడీపీకి కట్టబెట్టడం ద్వారా ఆ మండల ఓటర్లు అధికార పార్టీపై తమకున్న వ్యతిరేకతను ఓటు మాటగా చాటి చెప్పారు. జిల్లాలోని మూడు జడ్పీటీసీ, ఏడు ఎంపీటీసీలకు మంగళవారం నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం జరిగింది.


 ఆంద్రజ్యోతి-మచిలీపట్నం : పెడన నియోజకవర్గంలో కీలకమైన పెడన జడ్పీటీసీలో టీడీపీ అభ్యర్థికి ఓటర్లు పట్టం కట్టారు. స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను వ్యతిరేకిస్తున్న పెడన ప్రజలు సరైన సమయంలో  కీలెరిగి వాతపెట్టినట్లయింది. జిల్లాలో  మూడు జడ్పీటీసీ, ఏడు ఎంపీటీసీ  స్థానాల  ఓట్ల లెక్కింపు గురువారం జరిగింది. పెడన జడ్పీటీసీలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించగా, విస్సన్నపేట, జి- కొండూరు జడ్పీటీసీలను వైసీపీ గెలుచుకుంది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో టీడీపీ తరుపున మోపిదేవి జడ్పీటీసీ సభ్యుడు మొండితోక జగన్మోహన్‌రావు ఒక్కరే ఉండగా, పెడనలో విజయం సాధించడం ద్వారా ఇక టీడీపీ నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహించనున్నారు. పెడన జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన అర్జా వెంకటనగేష్‌ను మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ  అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ తదితరులు అభినందించారు. 


 వైసీపీకి 2.. టీడీపీకి ఒకటి

మూడు జడ్పీటీసీలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి రెండు, టీడీపీకి ఒకటి దక్కాయి. పెడనలో 19,867మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అభ్యర్థి అర్జా వెంకటనగేష్‌కు 9,929 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి గుడిశేవ లక్ష్మీరాణికి 9,271 ఓట్లు వచ్చాయి. 658 ఓట్ల మెజారీటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. విస్సన్నపేటలో 25,114 ఓట్లకు గానూ వైసీపీ అభ్యర్థి భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డికి 15,802, టీడీపీ అభ్యర్థి నెక్కలపు శ్రీనివాసరావుకు 6,146 ఓట్లు వచ్చాయి. 9,656 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. జి-కొండూరులో 31,815 ఓట్లకు గానూ వైసీపీ అభ్యర్థి మందా చక్రధరరావుకు 17,240, టీడీపీ అభ్యర్థి గరికపాటి జయపాల్‌కు 12,347 ఓట్లు వచ్చాయి. 4,893 ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. 


ఎంపీటీసీలు వైసీపీకి ఆరు.. టీడీపీకి ఒకటి 

జిల్లాలో ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఆరు ఎంపీటీసీ స్థానాలను వైసీపీ, ఒక స్థానాన్ని టీడీపీ గెలుచుకున్నాయి.

- ముదినేపల్లి మండలం వణుదుర్రు ఎంపీటీసీలో 2,518 ఓట్లు  పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి గుమ్మడి వెంకటేశ్వరరావుకు 1,368 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి లీలా ఆంజనేయులుకు 1,081 ఓట్లు వచ్చాయి. 287 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. 

- నూజివీడు మండలం దేవరగుంట ఎంపీటీసీలో 3,098 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి నక్కా శ్రీనివాసరావుకు 2,075 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బెజవాడ శ్రీనివాసరావుకు 915 ఓట్లు వచ్చాయి.

- గన్నవరం మండలం చినఅవుటపల్లి ఎంపీటీసీలో 2,474 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ అభ్యర్థి గంతోటి ప్రశాంతికి  1,450 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి సరిహద్దు వసంతలక్ష్మికి 975 ఓట్లు వచ్చాయి.

- పెనుగంచిప్రోలు మండలం కొణకంచి ఎంపీటీసీలో 1,973 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి కనగాల శ్రీనివాసరావుకు 1,264 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కె.దశరథ రామారావుకు 660 ఓట్లు వచ్చాయి.

- ముదినేపల్లి-2 ఎంపీటీసీలో 1,209 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి మరీదు నాగలింగేశ్వరరావుకు 813 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి మీసాల సత్యనారాయణకు 320 ఓట్లు వచ్చాయి.

- నాగాయలంక మండలం పర్రచివర ఎంపీటీసీలో 1,920 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థి బుడిపల్లి ఆదిశేషుకు 1,115 ఓట్లు, టీడీపీ అభ్యర్థి తాతా సుబ్బారావుకు 720 ఓట్లు వచ్చాయి. 

- ఆగిరిపల్లి మండలం ఈదర-1 ఎంపీటీసీలో 1,996 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి దొండపాటి కుమారికి 990 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి డొండపాటి బుజ్జికి 960 ఓట్లు వచ్చాయి. 

Updated Date - 2021-11-19T06:55:54+05:30 IST