రోడ్లా.. పార్కింగ్‌ అడ్డాలా!

ABN , First Publish Date - 2021-11-16T15:45:24+05:30 IST

ప్రధాన రహదారులు లారీల పార్కింగ్‌ అడ్డాలుగా మారిపోయాయి. ఆ లారీల వెనుక దుకాణ సముదాయాలూ కనిపించకుండా పోతున్నాయి. అయితే, చిన్నచిన్న వాహనాలు ట్రాఫిక్‌

రోడ్లా.. పార్కింగ్‌ అడ్డాలా!

లారీల పార్కింగ్‌తో పరేషాన్‌

పట్టించుకోని ట్రాఫిక్‌ పోలీసులు

కనిపించని వ్యాపార సముదాయాలు


హైదరాబాద్/చంపాపేట: ప్రధాన రహదారులు లారీల పార్కింగ్‌ అడ్డాలుగా మారిపోయాయి. ఆ లారీల వెనుక దుకాణ సముదాయాలూ కనిపించకుండా పోతున్నాయి. అయితే, చిన్నచిన్న వాహనాలు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. హెల్మెట్‌ లేదని ఫొటోలు తీసి జరిమానాలు విధించే ట్రాఫిక్‌ పోలీసులు ఈ లారీల పార్కింగ్‌ను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.


చంపాపేట, హస్తినాపురం డివిజన్‌ల మధ్య ఉన్న మందమల్లమ్మ చౌరస్తా నుంచి డీఎంఆర్‌ఎల్‌ ఎక్స్‌ రోడ్‌ వైపు, ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌లో రెండువైపుల నిత్యం వందలాది ఇసుక, ఇటుక, కంకర, గ్రానెట్‌రాళ్లు నింపుకొని లారీలు దర్శనమిస్తున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం వాటి వైపు కన్నెత్తి చూడరు. నెలనెలా అందే మాముళ్లకు ఆశపడి వారు వాటిని చూసి చూడనట్లు వ్యవరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


నిత్యం వేలాది వాహనాలు

ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్‌ మీదుగా ఓవైసీ ఆస్పత్రి, ఎయిర్‌పోర్టు, ఆరాంఘార్‌ వైపు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తాయి. ఇటు చంపాపేట ఎక్స్‌రోడ్‌ నుంచి ఏపీఆర్‌గార్డెన్‌ సాయిరాంనగర్‌కాలనీ వరకు, అటు మందమల్లమ్మ ఎక్స్‌రోడ్‌ నుంచి శ్రీబంధన ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వరకు లారీలు నిలిపి ఉంచడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏపీఆర్‌గార్డెన్‌ రోడ్‌లో రహదారిపై వాహనాలు నిలిపి ఉంచడంతో వ్యాపార సముదాయాలు కనపడకుండా పోతున్నాయి. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాలంటే దుకాణాలు కనిపించక పోవడంతో వారు వెనుదిరుగుతున్నారు. ఒకో చోట రెండు నుంచి మూడు వరుసల్లో లారీలను నిలుపుతున్నారు. అదే విధంగా లారీల నుంచి మరొక చిన్న వాహనంలోకి ఇసుకను డంప్‌ చేస్తున్నారు. దీంతో ఇసుక రహదారులపై పడుతుండటంతో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. 


అసాంఘిక కార్యకలాపాలకు...

రాత్రి వేళల్లో లారీలను అదునుగా చేసుకొని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వచ్చి పోయే ద్విచక్ర వాహనాదారులతో పాటు బాటసారులను టార్గెట్‌ చేసుకొని కొందరు బెదిరించి డబ్బులు వసూళ్లు చేసుకుంటున్నారు. మద్యం సేవించడం, ఖాళీ బాటళ్లను రహదారిపై వేయడం పరిపాటిగా మారింది. వాహనదారులకు ఇబ్బందిగా ఉన్నందున లారీలను ప్రధాన రహదారులకు ఇరువైపులా నిలుపుకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులను కోరుతున్నారు. 


లారీల నిలుపుదలతో....

ప్రధాన రహదారులపై లారీలను నిలుపొద్దు. లారీల నిలుపుదలతో ద్విచక్ర వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. రహదారులపై ఇసుక పడుతుండటంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.

 -లక్ష్మణ్‌, వాహనదారుడు, చంపాపేట


రహదారిపై నిలిపితే జరిమానా వేస్తాం...

పార్కింగ్‌ లేని ప్రాంతాలలో వాహనాలు నిలిపితే జరిమానా వేస్తాం. ప్రధాన రహదారులపై లారీలు, ఇతర వాహనాలు నిలుపొద్దు. లారీలకు రహదారిపై ఎటువంటి పార్కింగ్‌ అనుమతులు లేవు. సిబ్బందిని పంపించి తగిన చర్యలు తీసుకుంటాం.

-మహేష్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, వనస్థలిపురం పీఎస్‌

Updated Date - 2021-11-16T15:45:24+05:30 IST