HYD : మెట్రో స్టేషన్లలో Parking పరేషాన్‌.. ఏంటిది..!

ABN , First Publish Date - 2022-03-19T13:52:42+05:30 IST

మెట్రోస్టేషన్ల వద్ద పార్కింగ్‌ సమస్య వేధిస్తోంది. వాహనాలను నిలిపేందుకు

HYD : మెట్రో స్టేషన్లలో Parking పరేషాన్‌.. ఏంటిది..!

  • పది స్టేషన్లలో ఏర్పాట్లు
  • ఎండకు మండుతున్న వాహనాలు


హైదరాబాద్‌ సిటీ : నగరంలోని మెట్రోస్టేషన్ల వద్ద పార్కింగ్‌ సమస్య వేధిస్తోంది. వాహనాలను నిలిపేందుకు సరైన స్థలం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌బీనగర్‌- మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్లలో ప్రస్తుతం రోజుకు సగటున 2.80లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గడంతో ఏడాదిన్నర కాలంగా మూతపడిన ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోమ్‌ను ఎత్తివేసి ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. కాలేజీలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు యథావిధిగా నడుస్తుండడంతో ప్రయాణికులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇదే క్రమంలో మెట్రో స్టేషన్లలోని మాల్స్‌, దుకాణాల్లో సందడి కనిపిస్తోంది.


గంటకు రూ.5

నగరంలోని మూడు కారిడార్ల పరిధిలోని మొత్తం 66 స్టేషన్లలో ప్రస్తుతం 10స్టేషన్ల వద్ద మాత్రమే తాత్కాలికంగా ఉచిత పార్కింగ్‌ ఏర్పాట్లు ఉండగా, మిగతాచోట్ల చార్జీలు వసూలు చేస్తుండడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌బీనగర్‌, బాలానగర్‌, మూసారాంబాగ్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, రసూల్‌పురా, నాగోలు, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, హైటెక్‌సిటీ వద్ద ఖాళీ స్థలాలు ఉండడంతో తాత్కాలికంగా ఉచిత పార్కింగ్‌తోపాటు పెయిడ్‌ పార్కింగ్‌ సేవలు అందిస్తున్నారు. మిగతా 56 స్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలను నిలిపే వారి నుంచి మొదటి రెండు గంటల వరకు రూ.5, తర్వాత ప్రతి గంటకు రూ.2 చొప్పున వసూలు చేస్తున్నారు. కార్లకు తొలి రెండు గంటలకు రూ.10, తర్వాత ప్రతి గంటకు రూ.5 తీసుకుంటున్నట్లు యజమానులు వాపోతున్నారు. 


ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ..

చాలా మెట్రో స్టేషన్ల పెయిడ్‌ పార్కింగ్‌ వద్ద షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పాడైపోతున్నాయి. రోడ్ల పక్కన వాహనాలను నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్‌ పోలీసులు సైతం యజమానులకు జరిమానా విధిస్తున్నారు. దీంతో వాహనదారులు రెండు విధాలా నష్టపోతున్నారు. పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో చాలామంది వాహనాలు ఇంటి వద్దే వదిలి వస్తున్నారు. దీంతో రాత్రివేళలో తమ గమ్యస్థానాల (లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ)కు చేరుకునేందుకు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రత్యేక చొరవ చూపి అన్ని స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్‌, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2022-03-19T13:52:42+05:30 IST