మళ్లీ స్తంభించిన పార్లమెంటు

ABN , First Publish Date - 2021-08-03T06:56:37+05:30 IST

పెగాసస్‌ నిఘా, సాగు చట్టాలపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు సమావేశాలు

మళ్లీ స్తంభించిన పార్లమెంటు

  • 10వ రోజూ ప్రతిపక్షాల నిరసన 


న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పెగాసస్‌ నిఘా, సాగు చట్టాలపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు సమావేశాలు వరుసగా పదో రోజూ  స్తంభించాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. కాంగ్రెస్‌, తృణమూల్‌, వామపక్షాలు, ఇతర పార్టీల సభ్యులు సోమవారం కూడా వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. దీంతో సభాపతులు చివరికి మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా.. తొలుత మధ్యాహ్నం 12.30 వరకు, ఆ తరువాత తిరిగి ప్రారంభమయ్యాక మళ్లీ 2 గంటలకు వాయిదా వేశారు. అయినా ప్రతిపక్షాలు  ఆందోళన కొనసాగించాయి. వారి ఆందోళన మధ్యే మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రభుత్వం లోక్‌సభ జనరల్‌ ఇన్సూరెన్‌ ్స బిజినెస్‌ (జాతీయూకరణ) సవరణ బిల్లు-2021ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. అంతకుముందు గందరగోళం మధ్యే ప్రభుత్వం ట్రైబ్యునళ్లసంస్కరణల బిల్లునూ ప్రవేశపెట్టింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన షట్లర్‌ పీవీ సింధును లోక్‌సభ అభినందించింది. 



రాజ్యసభలోనూ అదే పరిస్థితి..

రాజ్యసభలో కూడా డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించలేకపోయారు. మధ్యాహ్నం గందరగోళం మధ్యే మంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రవేశపెట్టిన ఇన్‌లాండ్‌ వెసెల్స్‌ బిల్లును ఆమోదించారు. రాజ్యాంగ (ఎస్‌టీ) ఆదేశాల సవరణల బిల్లును గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ప్రవేశపెట్టారు. చివరకు మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత ఆర్థిక పద్దుల బిల్లును ప్రవేశపెట్టి సభను వాయిదా వేశారు. ఉదయం సమావేశాలను ప్రారంభించగానే వ్యవసాయ చట్టాలపై చర్చించాలని కాంగ్రెస్‌, పెగాసస్‌ అంశంపై చర్చకు తృణమూల్‌, లెఫ్ట్‌ సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకువచ్చి ప్లకార్డులతో నినాదాలు చేశారు. సభను చైర్మన్‌ వాయిదా వేశారు. అనంతరం డిప్యూటీ చైర్మన్‌ సభను నిర్వహించగా.. అదే పరిస్థితి కొనసాగింది. దీంతో మంగళవారానికి వాయిదా వేయాల్సివచ్చింది.


Updated Date - 2021-08-03T06:56:37+05:30 IST