చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారో..? విశాఖ టీడీపీలో హాట్ టాపిక్..!

ABN , First Publish Date - 2020-09-22T18:06:36+05:30 IST

అర్బన్‌, జిల్లా కమిటీల స్థానంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటుచేయబోతోంది. పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కమిటీలు నియమించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారో..? విశాఖ టీడీపీలో హాట్ టాపిక్..!

టీడీపీ పార్లమెంటరీ కమిటీలు.. రేస్‌లో పట్టాభి, కాకి గోవిందరెడ్డి, పీలా శ్రీను 

అనకాపల్లి పార్లమెంటరీ నియోజక వర్గానికి పీలా గోవింద పేరు పరిశీలన

అరకులోయపై ఇంకా రాని స్పష్టత

జిల్లా స్థాయిలో సమన్వయానికి మరో కమిటీ ఏర్పాటు

విశాఖపట్నం నియోజకవర్గ కమిటీకి పలువురి పోటీ

ఎమ్మెల్యేలకు ఇవ్వాలనుకుంటే వెలగపూడి, లేని పక్షంలో పల్లా శ్రీనివాసరావుకు అవకాశం

27న ప్రకటించే అవకాశం..


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): అర్బన్‌, జిల్లా కమిటీల స్థానంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటుచేయబోతోంది. పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కమిటీలు నియమించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యుదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గసభ్యులు ఉంటారు. కమిటీల సమన్వయం కోసం జిల్లాలో ముఖ్య నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటుచేస్తారు. అయితే సమన్వయ కమిటీలో జిల్లా కమిటీలో ఉన్నన్ని పదవులు ఉండవు. ఈ నెల 27న మంచిది కావడంలో పార్లమెంటరీ కమిటీలు ప్రకటించనున్నట్టు తెలిసింది. 


విశాఖ జిల్లాలో ఇప్పటివరకూ అర్బన్‌, రూరల్‌ జిల్లా కమిటీలు ఉండేవి. అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ మూడు రోజుల క్రితం వైసీపీలో చేరారు. రూరల్‌ జిల్లా అధ్యక్షుడిగా వున్న పంచకర్ల రమేష్‌బాబు కూడా పదవికి రాజీనామా చేసి ఇటీవల వైసీపీలో చేరారు. దీంతో అర్బన్‌, రూరల్‌ జిల్లా అధ్యక్ష పదవులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. అయితే కొత్త విధానంలో విశాఖపట్నం, అనకాపల్లి, అరకు లోయ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు పార్టీ కమిటీలు ఏర్పాటుకానున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాలకు అధ్యక్షులు ఎవరు అనేది ఇంతవరకు ఖరారు కాలేదు. అయితే కొన్ని పేర్లు అధినేత వద్ద ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖకు గల ప్రాధాన్యం నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ అధ్యక్షునిగా సీనియర్లకు అవకాశం కల్పించవచ్చునని ప్రచారం జరుగుతుంది. గతంలో అర్బన్‌  పార్టీ అధ్యక్షునిగా ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చిన అధిష్ఠానం, ఈ పర్యాయం అటువంటి ప్రయోగం చేయక పోవచ్చునని చెబుతున్నారు. 


ఒకవేళ పాత విధానం అమలుచేస్తే వెలగపూడి రామకృష్ణ బాబు పేరు పరిశీలనలో ఉంటుంది. ఆ ఫార్ములా కాకపోతే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అవకాశం కల్పించవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే అర్బన్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి చోడే పట్టాభి, సీనియర్‌ నేతలు టి.హర్షవర్దన్‌ప్రసాద్‌, కాకి గోవిందరెడ్డితో పాటు నజీర్‌, లొడగల కృష్ణ, పీలా శ్రీనివాస్‌ తదితరులు కూడా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్‌.కోట మాజీ ఎమ్మెల్యే లలితకుమారి అభిప్రాయం కూడా కీలకంగా మారనున్నది. పల్లా శ్రీనివాసరావు వద్దంటే మిగిలిన వారిలో ఒకరి పేరు అధినేత ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక అనకాపల్లి పార్లమెంటరీ నియోజక వర్గానికి అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పంచకర్ల రూరల్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత గోవింద్‌కు ఇవ్వాలని అధినేత నిర్ణయించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.


ఇప్పుడు కూడా పీలా గోవింద్‌కు అవకాశం వుందని చెబుతున్నారు. ఇంకా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుతో పాటు మరి కొందరు కూడా ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. అరకులోయ పార్లమెంటరీ నియోజకవర్గం నాలుగు జిల్లాలకు విస్తరించి ఉంది. ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌ల ఇన్‌చార్జులు, జిల్లాల నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి నిర్ణయం తీసుకోనున్నారు. కమిటీల ఏర్పాటుపై జిల్లాలో సీనియర్ల అభిప్రాయాలు తీసుకుంటారని సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణ, కేడర్‌కు అండగా నిలవడం, సమర్థంగా నడిపించే సత్తా కలిగిన వారికే అవకాశం వుంటుందని వివరించారు.  

Updated Date - 2020-09-22T18:06:36+05:30 IST