సాయుధ దళాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించొద్దు : పార్లమెంటరీ కమిటీ

ABN , First Publish Date - 2022-03-17T20:41:05+05:30 IST

సాయుధ దళాలకు బడ్జెట్ కేటాయింపులను తగ్గించవద్దని

సాయుధ దళాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించొద్దు : పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ : సాయుధ దళాలకు బడ్జెట్ కేటాయింపులను తగ్గించవద్దని రక్షణ రంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. బీజేపీ ఎంపీ జువల్ ఓరం నేతృత్వంలోని ఈ కమిటీ లోక్‌సభకు తన నివేదికను ఇటీవల సమర్పించింది. 


మన పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ రంగంలో సర్వసన్నద్ధతతో వ్యవహరించాలంటే బడ్జెట్ కేటాయింపులను తగ్గించరాదని తెలిపింది. బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తే, రక్షణ దళాల సర్వసన్నద్ధతకు సానుకూలత ఉండదని తెలిపింది. 


కేపిటల్ బడ్జెట్‌ను నాన్ లాప్సబుల్, రోల్-ఆన్ స్వభావంగలదిగా తీర్చిదిద్దాలని ఈ కమిటీ గతంలో ఇచ్చిన నివేదికల్లో కోరింది. నాన్ లాప్సబుల్ డిఫెన్స్ మోడర్నైజేషన్ ఫండ్ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు గతంలో చెప్పినట్లు గుర్తు చేసింది. 2022-23 సంవత్సరానికి కేపిటల్ హెడ్ క్రింద రూ.2,15,995 కోట్లు డిమాండ్ చేయగా, కేటాయించినది మాత్రం రూ.1,52,369.61 కోట్లు అని పేర్కొంది. ఈ విధంగా నిధులను తగ్గించడం వల్ల రక్షణ దళాల కార్యకలాపాల సన్నద్ధతకు విఘాతం కలుగుతుందని తెలిపింది. 


బడ్జెట్ అంచనాల దశలో 2022-23లో ప్రతిపాదిత బడ్జెట్, కేటాయింపు బడ్జెట్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది. ఈ వ్యత్యాసం సైన్యానికి రూ.14,729.11 కోట్లు; నావికా దళానికి రూ.20,031.97 కోట్లు; వైమానిక దళానికి రూ.28,471.05 కోట్లు ఉందని వివరించింది. 


Updated Date - 2022-03-17T20:41:05+05:30 IST