పరశురామ క్షేత్రం తిరువల్లం!

ABN , First Publish Date - 2021-05-14T03:55:49+05:30 IST

కేరళను ‘పరశురామ భూమి’గా పురాణాలు అభివర్ణించాయి. ఆ రాష్ట్రంలో పరశురాముడు నిర్మించినవిగా ప్రసిద్ధమైన ఆలయాలు అనేకం ఉన్నా, పరశురాముడి గుడి ఒక్కటే ఉంది....

పరశురామ క్షేత్రం తిరువల్లం!

కేరళను ‘పరశురామ భూమి’గా పురాణాలు అభివర్ణించాయి. ఆ రాష్ట్రంలో పరశురాముడు నిర్మించినవిగా ప్రసిద్ధమైన ఆలయాలు అనేకం ఉన్నా, పరశురాముడి గుడి ఒక్కటే ఉంది. అదే తిరువల్లం ఆలయం.

దక్షిణ భారతదేశంలో అతని పురాతనమైన ఆలయాల్లో తిరువల్లంలోని పరశురామ క్షేత్రం ఒకటి. ఎన్నో ప్రత్యేకతల సమాహారమైన ఈ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది.


పురాణ గాథల ప్రకారం, తన కోసం ప్రత్యేకంగా భూభాగం కావాలని వరుణ దేవుణ్ణి పరశురాముడు కోరాడు. ‘‘నీ పరశువును సముద్రంలోకి విసురు. అది ఎంత దూరంలో పడుతుందో అంత మేర భూభాగం నీదే!’’ అని వరుణుడు చెప్పాడు.. పరశురాముడు తన గొడ్డలిని విసిరినంత మేర సముద్రం వెనక్కు వెళ్ళింది. ఈ విధంగా ఏర్పడిన ప్రదేశమే కేరళ అని చెబుతారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరశురామ క్షేతాలు ఉన్నప్పటికీ... పరశురామ భూమిగా పేరుపొందిన కేరళలో ఆయనకు ఏకైక ఆలయం తిరువల్లంలోనే ఉంది. రెండువేల ఏళ్ళనాటిదిగా స్థానికులు పేర్కొంటున్న ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది.


త్రివేణీ సంగమం...

తిరువల్లం పరశురామ క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కరమన, కిల్లి, పార్వతీపుథనూర్‌ అనే మూడు నదులు ఇక్కడ సంగమిస్తాయి. తండ్రి జమదగ్ని ఆదేశం మేరకు తన తల్లి రేణుకాదేవిని సంహరించిన పరశురాముడు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడనీ, శివుడి ఆదేశం మేరకు ఈ త్రివేణీ సంగమంలో తల్లికి పిండప్రదానం చేశాడనీ స్థానిక గాథలు పేర్కొంటున్నాయి. పిండప్రదానాలు, పితృ తర్పణాల కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తారు.


త్రిమూర్తుల కొలువు...

బిల్వ మంగళస్వామి అనే విష్ణు భక్తుడు యాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడనీ, ఇక్కడ అతనికి పరశురాముడి సాక్షాత్కారం జరిగిందనీ, ఆ తరువాత అతను ఇక్కడే స్థిరపడి, పరశురామ ఆలయాన్ని నిర్మించాడనీ ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పన్నెండు, పదమూడు శతాబ్దాల మధ్య చేర రాజులు నిర్మించారు.  ఆలయం గర్భగుడిలో గొడ్డలి ధరించిన పరశురాముని విగ్రహం ఉత్తర దిశగా.... తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి ఆలయం వైపు తిరిగి ఉంటుంది.


అనంతపద్మనాభుడికీ తిరువల్లం పరశురామ ఆలయానికీ ప్రత్యేకమైన అనుబంధం ఉందంటారు. ‘వల్లం’ అంటే తల. అనంత పద్మనాభస్వామికి తిరువల్లం ఆలయం శిరస్సు అనీ, దగ్గరలోని అనంతన్‌కడ్డు ఆలయం దేహం కాగా, తిరిప్పాపూర్‌లోని ఆలయం పాదాలు అనీ భక్తుల విశ్వాసం. పరశురామ ఆలయ ఆవరణలో శివుడికీ, బ్రహ్మకూ ఆలయాలు ఉండడంతో త్రిమూర్తి క్షేత్రంగానూ ఇది పేరు పొందింది. గణపతి, మహిషాసురమర్దని, కృష్ణుడు, వ్యాసుడు, మత్స్యరూప మహా విష్ణువు, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఆలయ స్వాగత ద్వారం మీద కనిపించే పరశురాముడి విగ్రహం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. 


(నేడు పరశురామ జయంతి)

Updated Date - 2021-05-14T03:55:49+05:30 IST