సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-07-28T06:01:43+05:30 IST

సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ అధికారులను ఆదేశించారు.

సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలి
స్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ శోభ

కామారెడ్డి, జూలై 27: సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ అధికారులను ఆదేశించారు. మంగళవారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. పారిశుధ్యం మూలంగా వర్షా కాలంలో సీజనల్‌ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని ఇదే స్ఫూర్తితో వ్యాధులు దరి చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో మురికినీరు ఉండ కుండా చూడాలని క్రమం తప్పకుండా బ్లీచింగ్‌ చేయాలని తెలిపారు. గ్రామీణాభివృద్ధి అధికారి మాట్లాడుతూ డీఆర్‌డీఏ ద్వారా 20 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. కాగా పలువురు సభ్యులు మాట్లాడుతూ పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖ సమన్వయంతో మొక్కలు నాటాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ 1.38 కోట్ల విరాళాలు పల్లె ప్రగతి కార్యక్రమానికి జిల్లాకు వచ్చాయన్నారు. 140 బాడీ ఫ్రీజర్‌లు, 41 వైకుంఠధామాలు మండలాల్లో ఎంతో ఉపయోగపడేలా అందుబాటులో ఉంటాయని సభ్యులకు వివరించారు. జిల్లా విద్యాశాఖాధికారులు మాట్లాడుతూ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో కేవలం 21 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. నాగిరెడ్డిపేట జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ గాయత్రి షుగర్స్‌ మూలంగా చాలా వరకు పక్కనున్న గ్రామాలకు కాలుష్య వాతావరణం ఏర్పడుతుందని గతంలో సమావేశంలో చర్చించినప్పటికీ చర్యలు కరువయ్యాయని అన్నారు. మాచారెడ్డి జడ్పీటీసీ శ్రీరాంరెడ్డి మాట్లాడుతూ మండలంలోని పాల్వంచ మర్రి రోడ్డు వెడల్పు పనులకు ఇంకా అటవీశాఖ క్లియరెన్స్‌ రాలేదని దాని మూలంగా పేమెంట్‌కు లేట్‌ అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్‌, జడ్పీటీసీలు శంకర్‌నాయక్‌, చంద్రభాగ, మోహన్‌రెడ్డి, శంకర్‌, స్వరూ ప, శ్రీలత, కో ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ మజీద్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T06:01:43+05:30 IST