ప్రజాక్షేత్రంలోకి పార్టీలు

ABN , First Publish Date - 2022-07-07T05:45:20+05:30 IST

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉంది.

ప్రజాక్షేత్రంలోకి పార్టీలు

- ప్రజలను ఆకర్షించేందుకు ముమ్మర యత్నాలు

- అభివృద్ధి, సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్‌

- ‘రచ్చబండ’తో పల్లెల్లోకి కాంగ్రెస్‌

- కేంద్ర పథకాలతో ఇంటింటికి బీజేపీ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉంది. అయి నప్పటికీ ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న ఆయా పార్టీల నాయకులు వివిధ కార్యక్రమాల పేరిట ప్రజాక్షేత్రంలోకి వెళుతు న్నారు. ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తు న్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేం దుకు తహతహలాడుతుండగా, ఎలాగైనా ఈసారి అధికారాన్ని చేజి క్కించుకోవాలని కాంగ్రెస్‌, బీజేపీలు ముందుకు సాగుతున్నాయి. అధికా ర పార్టీకి దీటుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త, మాంత్రికుడిగా పేరొందిన ఐ ప్యాక్‌ ప్రశాంత్‌ కిశోర్‌ అధి కార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యూహకర్తగా పని చేస్తూ మళ్లీ అధికా రంలోకి తీసుకవచ్చేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన బృందాల తో అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన చర్య ల గురించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధి కార టీఆర్‌ఎస్‌ పాలన, పార్టీ నాయకుల తీరుపై ప్రజల్లో వ్యతిరే కత పెరుగుతున్నదని, అది తమకు కలిసివస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు సైతం ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలు ఉండగా, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నా రు. మంథని నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులంతా వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లపై ఆశలు పెంచు కుని గ్రామాలు,పట్టణాల్లో తిరుగుతూ తమ ఉనికిని చాటుతున్నారు. 

అభివృద్ధి, సంక్షేమంపై టీఆర్‌ఎస్‌ ప్రచారం

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకం టి చందర్‌లు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీపై అలకబూనిన నేతలను బుజ్జగిస్తున్నారు. ప్రతిరోజు గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనో హర్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని చెబుతున్నారు. తనపై అలకబూనిన వారికి నచ్చజెబుతూ పార్టీ కోసం పనిచేయాలని చెబుతున్నారు. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అధికంగా నియోజకవర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నియోజక వర్గం రెండు జిల్లాల్లో ఉండడంతో అటు, ఇటు తిరుగుతున్నారు. ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు బీసీ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకవెళుతున్నారు. అయితే రాష్ట్రంలో కొన్ని సిట్టింగ్‌ స్థానాల్లో కొత్త అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నందున పలువురు నాయకులు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారు. పెద్దపల్లి నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి, జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీనారా యణ పలు సేవా కార్యక్రమాల పేరిట ప్రజల్లోకి వెళుతున్నారు. రామ గుండంలోనూ పలువురు నాయకులు ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

గ్రామాల్లో కాంగ్రెస్‌ ‘రచ్చబండ’

జూన్‌ మొదటి వారం లో వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో తాము అధికా రంలోకి వస్తే రైతుల సంక్షేమానికి చేపట్టే పథకాల గురించి రాహుల్‌గాంధీ డిక్లరేషన్‌ చేశారు. ఆ డిక్లరేషన్‌ను గ్రామ గ్రామానికి తీసుకపోయేందుకు రచ్చబండ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆదేశించింది. ఆ మేరకు మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ విజయరమణరావు, రామగుండంలో నియోజకవర్గ ఇన్‌చార్జి, శాప్‌ మాజీ చైర్మన్‌ మక్కాన్‌ సింగ్‌ గ్రామాల్లో పర్యటిస్తూ రచ్చబండ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పాలనా తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం తరచూ పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పెంచ డం వల్ల పేద, మధ్య తరగతి ప్రజానీకంపై తీరని భారం పడుతు న్నదని వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త వారికి ఆసరా కింద పింఛన్లు ఇవ్వడం లేదని, డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్లు మంజూరు చేయడం లేదని, రైతులకు రుణ మాఫీ, వడ్డీ బకాయిలు చెల్లించడం లేదని ప్రచారం చేస్తున్నారు. 

బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం

జిల్లాలోని రామగుండం, మంథని నియోజకవర్గాల్లో బీజేపీ నాయకు లు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకుసాగుతున్నారు. రామ గుండం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తో పాటు కౌశిక హరి, బల్మూరి వనిత అమరేందర్‌రావులు ఇంటింటికి తిరుగుతూ వివధ వర్గాల ప్రజలు, కార్మికులను ఆకర్శించేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారు. మంథని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాం రెడ్డి కుమారుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి గ్రామాల్లో విస్తృతంగా పర్య టిస్తూ పార్టీని బలోపేతం కృషి చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావుల మధ్య వర్గపోరు నడుస్తుం డగా, టిక్కెట్‌ పోరులో ఇద్దరూ ముందున్నారని చెప్పవచ్చు. బీఎస్పీ నుంచి దాసరి ఉష నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. దళిత, గిరిజన, బహుజనులంతా ఒక్కటై బీఎస్పీకి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద గ్రామాలు, పట్టణాల్లో వివిధ పార్టీల నాయకులు ముందస్తు ఎన్నికలు వస్తాయని హడావుడి చేస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 

Updated Date - 2022-07-07T05:45:20+05:30 IST