కుటుంబ పాలన అంతానికే పార్టీ మార్పు

ABN , First Publish Date - 2022-08-14T07:50:00+05:30 IST

సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి అంతం బీజేపీతోనే సాధ్యమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

కుటుంబ పాలన అంతానికే పార్టీ మార్పు

జాతీయ స్థాయిలో బలహీనపడిన కాంగ్రెస్‌ 

దొంగచాటు పోస్టర్లను అంతా గమనిస్తున్నారు

తప్పు చేయలేదని గుడిలో 

ప్రమాణం చేస్తా: రాజగోపాల్‌రెడ్డి 


చండూరు, ఆగస్టు 13: సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి అంతం బీజేపీతోనే సాధ్యమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. నల్లగొండ జిల్లా చండూరులో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాయితీ, నైతిక విలువలకు కట్టుబడి ఆ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. దీన్ని ఓర్వలేని కొందరు తనపై ఆరోపణలు చేస్తూ చౌటుప్పల్‌, నారాయణపురం మండలాల్లో దొంగచాటుగా పోస్టర్లు అంటిస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టులేక అమ్ముడుపోయానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాననే సమాచారం రాగానే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గట్టుప్పల మండలం ఏర్పాటుతోపాటు పెన్షన్లు, ఫీల్డ్‌అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడం, చేనేత కార్మికులకు బీమా ప్రకటించడం వంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఒకవేళ తాను అమ్ముడు పోవాలనుకుంటే కాంగ్రెస్‌ పార్టీ నుంచి 12మంది ఎమ్మెల్యేలు వెంట వెళ్లేవాడినన్నారు.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిందని అందుకే బీజేపీలో చేరుతున్నానని వెల్లడించారు.  ప్రజలు తనను ఆదరిస్తున్నారని, వచ్చే ఉప ఎన్నికల్లో గెలిచేది తాను కాదని, మునుగోడు ప్రజలు అని అన్నారు. మచ్చలేని వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నానని, ఏ తప్పు చేయలేదని గుడిలో ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 21న మునుగోడులో ధర్మయుద్ధం శంఖారావం పూరించేందుకు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-08-14T07:50:00+05:30 IST