Gulam Nabi Azad: పార్టీ పేరు ఇంకా నిర్ణయించలేదు

ABN , First Publish Date - 2022-09-04T20:02:26+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన గులాం నబీ ఆజాద్..

Gulam Nabi Azad: పార్టీ పేరు ఇంకా నిర్ణయించలేదు

శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన గులాం నబీ ఆజాద్ ఆదివారంనాడు తొలిసారి జమ్మూలో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ పేరు ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. సైనిక్ ఫామ్స్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో 20 వేల మందికి పైగా మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పేరు ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. పార్టీ పేరు, జెండాను జమ్మూకశ్మీర్ ప్రజలే నిర్ణయిస్తారని  చెప్పారు. అందరికీ అర్థమయ్యే విధంగా తన పార్టీకి హిందుస్థానీ పేరు పెడతామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరణ, స్థానికులకు భూమి, ఉద్యోగ హక్కులపై తమ పార్టీ దృష్టి సారిస్తుందని చెప్పారు.


కాంగ్రెస్ పార్టీపై ఆజాద్ విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ పార్టీకి రక్తం ధారపోసి పటిష్టం చేసుకున్నామని, కంప్యూటర్లు, ట్విట్టర్లతో పార్టీ రూపొందలేదన్నారు. కేవలం కంప్యూటర్లు, ట్వీట్లకు పరిమితమైన కొందరు తమను అప్రతిష్టపాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేలకు దిగజారిపోవడానికి ఇవే కారణాలని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. రామ్ లీలా మైదాన్‌లో కాంగ్రెస్ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ వాళ్లు కాసేపట్లో బస్సులెక్కి జైళ్లకు వెళ్లిపోతారని, వాళ్ల పేర్లు రాయించుకుని ఆ తర్వాత గంటలో వెళ్లిపోతారని, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి ఇదే కారణమని అన్నారు.

Updated Date - 2022-09-04T20:02:26+05:30 IST