రాష్ట్రంలో కక్షపూరిత పాలన

ABN , First Publish Date - 2022-09-23T05:57:47+05:30 IST

రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగుతోందని, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు దీనికి నిదర్శనమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

రాష్ట్రంలో కక్షపూరిత పాలన
రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం టౌన, సెప్టెంబరు 22: రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగుతోందని, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు దీనికి నిదర్శనమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో గురువారం నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులతో కలిసి కాలవ రాస్తారోకో నిర్వహించారు. శాంతినగర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినాయక సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ పేరుమార్పు జీవో ప్రతులను దహనం చేశారు. ఆరోగ్య సంబంధ విషయాలపై విస్తృతంగా అధ్యయనం చేయడానికి, మెడికల్‌ కళాశాలల అజమాయిషీకి ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉండాలని ఆలోచించిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. 1986లో ఎన్టీఆర్‌ నెలకొల్పిన హెల్త్‌ వర్సిటీకి 1998లో చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ పేరు పెట్టారని గుర్తుచేశారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి జిల్లాలోని వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ పేరును తొలగించాలని కొంతమంది చంద్రబాబునాయుడుకు సలహా ఇచ్చారని అన్నారు. భూకబ్జాదారుడి పేరును తొలగించాలని కోరినా, చంద్రబాబునాయుడు మార్చలేదని అన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టడం పిచ్చితుగ్లక్‌ చర్య అని అన్నారు. చివరకు జగన వదిలిన బాణం అని చెప్పుకున్న షర్మిల కూడా జగన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వెయ్యి మంది జగన్మోహన రెడ్డిలు అడ్డుకున్నా రాషా్ట్రనికి చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. అధికారంలోకి వచ్చాక రాజశేఖర్‌రెడ్డి పేరు, విగ్రహాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను తొలగించడానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని చంద్రబాబును తానే స్వయంగా కోరుతానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ ప్రశాంతి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నల్లపూల వెంకటేశులు, కడ్డిపూడి మహబూబ్‌ బాషా, టీడీపీ నాయకులు పొరాళ్లు పురుషోత్తమ్‌, హనుమంతరెడ్డి,  కాదలూరు మోహనరెడ్డి, హనుమంతు, తిప్పేస్వామి, పసుపులేటి నాగరాజు, బండి భారతి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-23T05:57:47+05:30 IST