'వీడొక్కడే' సినిమా సీన్ రిపీట్.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుడి కడుపులో రూ.12 కోట్ల కొకైన్‌!

ABN , First Publish Date - 2022-04-27T13:02:17+05:30 IST

సూర్య హీరోగా నటించిన 'వీడొక్కడే' సినిమాలో కడుపులో మత్తు పదార్థాలను పెట్టుకొని స్మగ్లింగ్‌ చేస్తున్న సీన్‌ గుర్తుందా? శంషాబాద్‌ విమానాశ్రయంలోనూ అచ్చం అలాగే జరిగింది.

'వీడొక్కడే' సినిమా సీన్ రిపీట్.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుడి కడుపులో రూ.12 కోట్ల కొకైన్‌!
ప్రతీకాత్మక చిత్రం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల కొకైన్‌ పట్టివేత

పార్సిల్స్‌లో కొంత, కడుపులో మరింత దాచి తెచ్చిన ప్రయాణికుడు 

శంషాబాద్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): సూర్య హీరోగా నటించిన 'వీడొక్కడే' సినిమాలో కడుపులో మత్తు పదార్థాలను పెట్టుకొని స్మగ్లింగ్‌ చేస్తున్న సీన్‌ గుర్తుందా? శంషాబాద్‌ విమానాశ్రయంలోనూ అచ్చం అలాగే జరిగింది. ఓ వ్యక్తి కడుపులో కొకైన్‌ను దాచి తీసుకొస్తూ డీఆర్‌ఐ అధికారులకు చిక్కాడు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా వచ్చిన విమానం నుంచి ఓ ప్రయాణికుడు(44) ఈ నెల 21న శంషాబాద్‌ లో దిగాడు. అతడిని తనిఖీ చేయగా ప్లాస్టిక్‌తో చుట్టిన ప్యాక్‌లో 24 కొకైన్‌ క్యాప్సుల్స్‌ దొరికాయి. అధికారులు అతడి బాడీని స్కాన్‌ చేయగా కడుపులో మరిన్ని ఉన్నట్టు గుర్తించారు. అతడికి శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి 57 క్యాప్సుల్స్‌ వెలికితీశారు. వాటన్నింటినీ తూకం వేయగా 1.16 కిలోలున్నాయి. వీటి విలువ 12 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. ఆ డ్రగ్స్‌ స్మగ్లర్‌పై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-04-27T13:02:17+05:30 IST