Bahrain: కొత్త విజిట్ వీసా రూల్స్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న బహ్రెయిన్

ABN , First Publish Date - 2022-09-23T19:15:13+05:30 IST

మానవ అక్రమ రవాణా, విదేశీయుల అక్రమ ఎంట్రీలను నిరోధించే క్రమంలో బహ్రెయిన్ (Bahrain) కొత్త విజిట్ వీసా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Bahrain: కొత్త విజిట్ వీసా రూల్స్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న బహ్రెయిన్

బహ్రెయిన్: మానవ అక్రమ రవాణా, విదేశీయుల అక్రమ ఎంట్రీలను నిరోధించే క్రమంలో బహ్రెయిన్ (Bahrain) కొత్త విజిట్ వీసా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త రూల్స్‌ను అమలు చేసే ప్రక్రియను బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు వేగవంతం చేశారు. విజిట్ వీసాపై బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల్లో ఈ నిబంధనలను పాటించని వారిని అధికారులు బలవంతంగా స్వదేశానికి తిరిగి పంపుతున్నారు. ఇక కొత్త తీసుకొచ్చిన నిబంధనలపై గల్ఫ్ ఎయిర్ ఇంతకుముందు విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. విజిట్ వీసాదారులు తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన క్రెడిట్ కార్డును కలిగి ఉండాలి. లేనిపక్షంలో కింగ్‌డమ్‌లో ఉండేందుకు రోజుకు 50 బహ్రెయిన్ దినార్లు(రూ.10,734) వెచ్చించే సామర్థ్యం ఉండాలి. అలాగే 300 బహ్రెయిన్ దినార్లతో (రూ.64వేలు) కనీస ఖాతా బ్యాలెన్స్‌తో బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను సమర్పించడం ద్వారా ఆన్‌లైన్‌లో విజిట్ వీసాను పొందవచ్చని అధికారులు తెలిపారు.


అంతేగాక సందర్శకులు రిటర్న్ టికెట్‌లతో పాటు హోటల్ బుకింగ్ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సహా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలలో చాలా మంది మోసపూరిత ఏజెంట్లు ఉన్నారని, వారు అమాయక చదువులేని క్లయింట్‌లను మోసం చేసేందుకు ఉద్యోగ వీసాల పేరుతో వారిని పంపుతున్నారని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. మోసగాళ్ల బారిన పడిన తర్వాత ఇంటికి తిరిగి రావడం లేదా అక్రమ నివాసిగా రాజ్యంలో తమ బసను కొనసాగించడం తప్ప బాధితులకు వేరే మార్గం ఉండటం లేదట. బాధితుల్లో ఎక్కువ మంది నైపుణ్యం లేని కార్మికులే ఉంటున్నారని సామాజిక కార్యకర్తలు తెలిపారు. 

Updated Date - 2022-09-23T19:15:13+05:30 IST