పట్టాలెక్కని పాసింజర్‌ రైళ్లు

ABN , First Publish Date - 2021-03-01T06:37:39+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది మార్చిలో రైళ్లు నిలచిపోవడంతో ఏడాది కాలంగా రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పట్టాలెక్కని పాసింజర్‌ రైళ్లు

రాకపోకలకు ఇబ్బందిపడుతున్న సామాన్యులు 

ఏడాదిగా ఇదే పరిస్థితి 

దొనకొండ, ఫిబ్రవరి 28 : కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది మార్చిలో రైళ్లు నిలచిపోవడంతో ఏడాది కాలంగా రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు ప్రయాణం భారంగా మారడంతో పాసింజరు రైళ్లు పునఃప్రారంభంపై ప్రయాణికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కరోనా వైర్‌సకు ముందు దొనకొండ మీదుగా గుంటూరు-గుంతకల్లు ప్రధాన రైలు మార్గంలో బెంగళూరు-విజయవాడ, కాచిగూడ-గుంటూరు, మార్కాపురం-తెనాలి, ఢోన్‌-గుంటూరు, హుబ్లీ-విజయవాడ, కాచిగూడ-గుంటూరు, విజయవాడ-బెంగుళూరు, గుంటూరు- కాచిగూడ, రేపల్లి-మార్కాపురం, విజయవాడ-హుబ్లీ, గుంటూరు-డోన్‌, గుంటూరు-కాచిగూడ మొత్తం 12 పాసింజర్‌ రైళ్లు తిరిగేవి. వీటితోపాటు హుబ్లీ-విజయవాడ, యశ్వంతపూర్‌-మచలీపట్నం, బెంగుళూర్‌-భువనేశ్వర్‌, యశ్వంతపూర్‌-పూరి, మచలీపట్నం-యశ్వంత్‌పూర్‌, భువనేశ్వర్‌-బెంగుళూర్‌, విజయవాడ-హుబ్లీ, పూరి-యశ్వంత్‌పూర్‌ మొత్తం 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిత్యం ప్రయాణిస్తుండేవి. ఇవికాక వారానికి మూడు రోజులు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌  రైళ్లుగా రాయచూర్‌-కాకినాడ, కాకినాడ-రాయచూర్‌, కర్నూల్‌సిటీ-కాకినాడ, కాకినాడ-కర్నూల్‌, వాస్కోడిగామా-హౌరా, హౌరా-వాస్కోడిగామా రైళ్లు ప్రయాణిస్తుండేవి. కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది మార్చి 22న నిలపోయిన ఈ రైళ్లు నేటికీ ప్రారంభం కాలేదు. దీంతో దొనకొండలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ వినుకొండ, నర్సరావుపేట తదితర ప్రాంతాల్లో నివసిస్తూ, సీజనల్‌ టికెట్‌ ఉద్యోగులు, జీవనోపాధి నిమిత్తం మార్కాపురం, వినుకొండ తదితర ప్రాంతాలను పనులకు వెళ్లే పేదలు రైలు ప్రయాణం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రైల్వే అధికారులు ఇటీవల మచిలీపట్నం-బెంగుళూర్‌-బెంగుళూర్‌-మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌, హౌరా-యశ్వంత్‌పూర్‌-హౌరా ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రత్యేక రైళ్లుగా నడుపుతున్నా దొనకొండలో స్టాపింగ్‌ ఇవ్వలేదు. దీంతో ఈ ప్రాంతం నుంచి బెంగళూరుకు జీవనోపాధి నిమిత్తం కూలీపనులకు వెళ్లే నిరుపేదలు, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు రవాణా సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొనకొండ ప్రాంత ప్రజలు వైద్యం, ఇతర పనులకు గుంటూరు, విజయవాడ వెళ్లేందుకు రవాణా సౌకర్యంలేక ఆట్లోల్లో కురిచేడు, వినుకొండ వరకు వెళ్లి బస్సులను ఆశ్రయిస్తున్నారు. తిరిగి గమ్యస్ధానం చేరుకునేందుకు సకాలంలో ఆటోలు సైతం లేక అల్లాడిపోతున్నారు. రైల్వే అధికారులు ప్రజల ఇబ్బందులను గుర్తించి దొనకొండ నుంచి గుంటూరుకు పగలు పాసింజర్‌ రైలు నడిపేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-03-01T06:37:39+05:30 IST